Kasim
-
పోలీస్‌స్టేషన్‌కు ప్రొఫెసర్ కాశిం
సాక్షి, సిద్దిపేట: ప్రొఫెసర్ కాశిం ఆదివారం ములుగు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. విప్లవ సాహిత్యం కలిగి ఉండటం, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనపై గతంలో ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కండీషనల్ బెయిల్ పొందిన ప్రొఫెసర్ కాశిం నిబంధనల మేరకు ములుగు పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన అరెస్టును నిరసిస్తూ విడుదలకు సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలు కాశిం కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: విద్యార్థుల్ని మావోలుగా మార్చే యత్నం) -
కార్తీక్ పేరుతో మావోలతో కార్యకలాపాలు..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశింకు నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కాశింను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, కాశింపై పోలీసులు పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్ సహాయ పోలీస్ కమిషనర్ పి.నారాయణ కౌంటర్ దాఖలు చేశారు. రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలం వ్యాప్తి కోసమే కాశిం ప్రొఫెసర్, జర్నలిస్ట్ అనే ముసుగులు వేసుకున్నారని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌గా ఉంటూ విద్యార్థుల్లో మావోయిస్టు పార్టీ భావజాలాన్ని నూరిపోసి ఆ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు. బలమైన ఆధారాలు ఉన్నందునే పోలీసులు కాశింను అరెస్టు చేశామని, అంతా చట్ట ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. పలువురు నేతలను పొట్టనబెట్టుకున్న నేర చరిత్ర కూడా మావోయిస్టు పార్టీకి ఉందని, అందుకే ప్రభుత్వం సీపీఎం (మావోయిస్టు) పార్టీని గతంలోనే నిషేధించిందని వివరించారు. అలాంటి పార్టీతో కాశింకు సంబంధాలు ఉన్నాయని గతంలో పట్టుబడిన మావోయిస్టులు చెప్పారని తెలిపారు. మావోయిస్టులకు సహకారం అందించడమే కాకుండా తెర ముందు ఆ పార్టీ భావజాలాన్ని వినిపించే సంస్థల్లో కాశిం ప్రముఖుడని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారుణాలకు పాల్పడే మావోయిస్టులతో కాశింకు సంబంధాలు ఉన్నట్లుగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే చట్ట ప్రకారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాశింపై పోలీసులు నమోదు చేసిన కేసు చట్టబద్ధమేనని.. గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన రిట్‌ను కొట్టేయాలని కోరారు. కార్తీక్ పేరుతో మావోలతో కార్యకలాపాలు.. ‘కాశిం గళాన్ని అణచివేయడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక గొంతుకల్ని నొక్కేయడం లేదు. మావోయిస్టుల పేరుతో చందాలు వసూలు చేశారు. 2016లో ఉన్న కేసులు అరెస్టు చేయకపోవడం వల్లే పరారీలో ఉన్నట్లు పేర్కొన్నాం. కాశిం ఇంట్లో సోదాలు ఆయన భార్య స్నేహలత సమక్షంలోనే చేశాం. సోదాల సమయంలో వీడియో చిత్రీకరణ కూడా చేశాం. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, కంప్యూటర్ వంటి వాటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాం. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల ఆ పరీక్షల్లో ఏమీ తేలలేదు. కాశింపై మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. మరో రెండు కేసుల్లో నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. మావోయిస్టుల పేరుతో చేస్తున్న కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అన్ని సాక్ష్యాధారాలను సేకరించాకే కాశింను అరెస్టు చేశాం. అండర్ గ్రౌండ్లో ఉన్న మావోయిస్టులతో కార్తీక్ అనే పేరుతో కాశిం సంప్రదిస్తున్నారు. 2018లో శ్యాంసుందర్‌రెడ్డి అనే మావోయిస్టు ఇచ్చిన వాంగ్మూలంలో ద్వారా కాశిం గురించి మరిన్ని వివరాలు తెలిశాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి కూతురే కాశిం భార్య స్నేహలత. ఆమె కూడా అదే కేసులో నిందితురాలు. అత్యాధునిక ఆయుధాలతో 150 మంది తీవ్రవాదులు రహస్యంగా ఉన్నారు. వారందరి భావజాలాన్ని కాశిం ప్రొఫెసర్ ముసుగులో వ్యాప్తి చేస్తున్నారు’అని పోలీసులు కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. -
‘విడిచిపెట్టే వరకు ఆందోళనలు’
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ అధ్యాపకుడు డా.కాశింను విడిచిపెట్టే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. గురువారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాశీం విడుదల కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ ఓయూ ప్రధాన కార్యదర్శి రవినాయక్ అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్, డా.అన్సారీ, ఎంఎల్ పార్టీ నేత గోవర్ధన్, రమా, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, విమలక్క, ఎమ్మార్పీఎస్ నేత మేడిపాపయ్య, ఓయూ అధ్యాపకుడు డా.గాలి వినోద్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు. కాశింపై కొత్త కేసులను బనాయించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆయనపై ఉపా కేసు పెట్టి జైల్‌కు తరలించడం అన్యాయమని మండిపడ్డారు. కాశింపై పోలీసులు చేసిన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డా.గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూ బంద్ చేయనున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. -
అప్పట్లో ఇలానే ఉంటే తెలంగాణ వచ్చేదా?
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఉమ్మడి రాష్ట్రంలో ఇంత నిర్బంధం ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రావడానికి గల ఉద్యమాలను మర్చిపోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, యూనియన్లు అవసరం లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉపా చట్టం కింద అందరినీ అరెస్టు చేస్తే తెలంగాణను సాధించుకునే వారిమా? అని ప్రశ్నించారు. ఇప్పటి ప్రభుత్వం కంటే అప్పటి ప్రభుత్వమే ప్రజాస్వామికంగా ఉందని అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్లో (టీపీటీఎఫ్) టీడీఎఫ్, టీడీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు విలీనమైన సందర్భంగా సదస్సు జరిగింది. ఈ సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కాశింను అరెస్టు చేసిన పద్ధతి అప్రజాస్వామికం అని అన్నారు. వైస్ చాన్స్‌లర్ అనుమతి లేకుండా పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చక్రధర్‌రావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ నూతన కమిటీ.. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) నూతన కమిటీని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రకటించా రు. అధ్యక్షుడిగా కె.రమణ, అసోసియేట్ అధ్యక్షుడిగా వై.అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా మైస శ్రీనివాసులు, అదనపు ప్రధాన కార్యదర్శిగా నన్నెబోయిన తిరుపతి, ఉపాధ్యక్షులుగా బి.రమేష్, పి.నారాయణమ్మ, ఎం.రవీందర్, జి.తిరుపతిరెడ్డి, కె.కిషన్‌రావు, రావుల రమేష్, కార్యదర్శులుగా పి.నాగమణి, పి.నాగిరెడ్డి, ఎం.రామాచారి, జె.చంద్రమౌళి, ఎ.రాంకిషన్, కె.కనకయ్య, మాడుగుల రాములు తదితరులు ఎన్నికయ్యారు. కాశింపై కేసులు ఎత్తివేయాలి సుల్తాన్‌బజార్: విరసం కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన కాశింను విడుదల చేసి ఆయనపై మోపిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవస్థాపక సభ్యుడు వరహరరావు ఏడాదికి పైగా పూణె జైలులో ఉన్నారని సభ్యులమీద సైతం కేసులు నడుస్తున్నాయని అన్నారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రజా సంఘాల నేతలను రాష్ట్ర ప్రభుత్వం జైళ్లకు నెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రం కోసం విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాల్లో భాగమైన కాశింను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదన్నారు. ప్రజా సంఘాల బాధ్యులను వరుసగా అరెస్టు చేసి మొత్తం సమాజాన్ని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సమావేశంలో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, సహాయ కార్యదర్శి రివేర, కాశిం తల్లి వీరమ్మ పాల్గొన్నారు. -
మావోలతో సంబంధాలు చూపండి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలతో అరెస్టు చేస్తే కుదరదని, ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఉస్మానియా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశిం ను పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసుల రిమాండ్ డైరీ రిపోర్టు ప్రకారం కాశింపై 5 వేర్వేరు క్రిమినల్ కేసులున్నాయని, 2006–2019 వరకూ క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొన్నారని చెబుతున్న పోలీసులు 14 ఏళ్లుగా కాశింను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీసింది. నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు, డబ్బులు వసూలు చేసినట్లు 2016లో ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో యిస్టు మందల శ్యాంసుందర్‌రెడ్డి వాంగ్మూలంలో చెబితే మూడేళ్లుగా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లో హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్ పోలీసులు ధర్మాసనం ఎదుట హాజరుపర్చారు. ఆదివారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి నివాసంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం కాశింతో మాట్లాడి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తలుపులు పగులగొట్టి.. తొలుత కాశిం తనకు మాయివోస్టు పార్టీతో సంబంధాలు లేవని ధర్మాసనానికి తెలిపారు. ఆ పార్టీ కోసం నిధుల సేకరణగానీ, పంపిణీగానీ, భావజాలప్రచారం గానీ చేయలేదన్నారు. తన ప్రసంగాలు యూట్యూబ్‌లో, పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయని, వాటిలో ఎక్కడా మావో యిస్టు పార్టీకి అనుకూలంగా లేవన్నారు. 18న ఉదయం 6.30 గంటలకు పోలీసులు ఓయూ క్యాంపస్ లోని తన ఇంటి తాళాన్ని పగులగొట్టి మావోయిస్టు సాహిత్యాన్ని వాళ్లే పెట్టి సోదాలు చేశాక దొరికినట్లుగా చెప్పారని ఆరోపించారు. వచ్చిన పోలీసులు ముగ్గురు యూనిఫాంలో ఉంటే 30 మంది సివిల్ దుస్తుల్లో ఉన్నారని వివరించారు. ములుగు తీసుకువెళ్లాక శిక్షణలో ఉన్న పోలీసు అధికారి అఖిల్ మహాజన్ తనను కుల వ్యవస్థ గురించి ప్రశ్నించారే గానీ మావో యిస్టు పార్టీ గురించి అడగలేదన్నారు. మరో ముగ్గురు పోలీసుల విచారణలో మావోయిస్టులతో తాను మాట్లాడినట్లు, డబ్బులు వసూళ్లు చేసినట్లుగా తన చేత బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు. తనను పోలీసులు హింసించలేదని వివరించారు. చాలా నిరుపేదల కుటుంబం నుంచి వచ్చానని, తనపై ఏడుగురు కుటుంబ సభ్యులు ఆధారపడ్డారని, పోలీసుల చర్యల వల్ల తన ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని, కాబట్టి తనను విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని కాశిం హైకోర్టును కోరారు. ఈ వివరాలన్నింటినీ ధర్మాసనం రికార్డు చేసింది. ఆందోళన కలిగిస్తున్నాయి.. ‘మావోయిస్టు సానుభూతిపరులని అరెస్ట్ చేసే కేసుల్ని తరుచుగా విచారించాల్సి వస్తోంది. తెల్లవారుజామున అరెస్టులు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చడం.. మేజిస్ట్రేట్ వారిని జ్యుడీషి యల్ కస్టడీకి పంపడం పరిపాటైంది. పోలీసులే తనిఖీల పేరుతో ఇళ్లలోకి వచ్చి మావోయిస్టు సాహిత్యాన్ని ఇళ్లలో పెట్టి, మావోయిస్టులతో తమకు సంబంధం ఉందని బలవంతంగా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇవన్నీ మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాశిం విషయంలో ఏళ్లుగా కేసులున్నా పట్టించుకోని పోలీసులు ఇటీవల ఓయూలో కుల రాజకీయాలను ప్రశ్నిస్తూ పుస్తకాన్ని ప్రచురించాకే అరెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2006–2019 వరకూ కేసులుంటే ఇప్పుడు ఒక్కసారిగా ఆయనను సమాజానికి ప్రమాదకారిగా చూపించే ప్రయత్నం కనబడుతోంది. ఇన్నేళ్లుగా ఉన్న కేసుల పురోగతి వివరించండి. 2016లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మొత్తం 44 మంది నిందితుల జాబితాలో కాశిం భార్య పేరు కూడా ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు. గత 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నందునే పట్టుకోలేకపోయామని పోలీసులు ఈ నెల 18న చెప్పారు. పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించేందుకు పోలీసులు సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో లేదో చెప్పాలి. కాశిం లైబ్రరీ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సాహిత్యం, పత్రాలు మొదలైన వాటిపై రికవరీ మెమోను మా ముందుంచండి. మావోయిస్టు పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారన్న ఆరోపణలకు సైతం పోలీసులు ఆధారాలు సమర్పించాలి. దీని వల్ల మావోయిస్టు సానుభూతిపరులంటూ పోలీసులు చేసిన అరెస్టులపై పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలపై ఓ ప్రొఫెసర్‌నే అరెస్ట్ చేసినప్పుడు, ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి నిరసన గళాలను నిశ్శబ్ధంగా అణిచివేస్తుందా? అన్నది మేం చూడాలి. ఈ కోర్టు ముందున్న ప్రశ్న ఓ పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛే కాదు, రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విద్య నేర్పే వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకోవడం కూడా. మానవ, రాజ్యాంగ హక్కుల్ని ప్రభుత్వాలు ఉల్లంఘించేందుకు ఆస్కారం లేదు’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 23 కల్లా కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. అప్పటివరకు కాశింను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ కల్పించుకుని, సంగారెడ్డి జిల్లాలో సరైన వసతులు లేవని, అందువల్ల చర్లపల్లి సెంట్రల్ జైలుకు కాశింను తరలించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కాశింను చర్లపల్లి జైలుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా పడింది. కంది జైలుకు ప్రొఫెసర్ కాశిం సంగారెడ్డి అర్బన్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశింను సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తీసుకువచ్చినట్లు జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ తెలిపారు. రిమాండ్‌లో ఉన్న కాశింను ఆదివారం ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ముందు హాజరు పరిచినట్లు వివరించారు. సాయంత్రం 3.30 గంటలకు తిరిగి జైలుకు తీసుకువచ్చామన్నారు. 2016 సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో కాశింపై కేసు నమోదు కాగా.. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై శనివారం గజ్వేల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
చర్లపల్లి జైలుకు ప్రొఫెసర్ కాశీం
సాక్షి, హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చింతకింద కాశీం అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్ విచారణ ముగిసింది. విచారణ నిమిత్తం ఆయనకు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశీంను సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. కాశీం అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నివాసంలో ఆదివారం ఉదయం కాశీంను పోలీసులు హాజరుపరిచిన విషయం తెలిసిందే. అనంతరం ఈ పిటిషన్‌పై ఆయన నివాసంలోనే విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపించారు. (ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్టు) విచారణ అనంతరం ఆయన న్యాయవాది మాట్లాడుతూ.. ‘ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌పై హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసాం. కోర్టు ఆదేశాల మేరకు చీఫ్ జస్టీస్ ముందు హాజరు పరిచారు. కశీం ఇంటిపై సోదాలు చేసి అరెస్ట్ చేసిన విధానంపై వాదనలు వినిపించాము. 2016 లో నమోదైన కేసును ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు జరపలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ మధ్య కాలంలో ప్రజా సంఘాల నేతలు, మావోయిస్టు సానుభూతి పరులపై అక్రమ అరెస్ట్‌లకు సంబంధించిన వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చాము.’ అని తెలిపారు. -
సీజే ముందుకు ప్రొఫెసర్ కాశీం
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశీంను ఆదివారం ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ముందు హాజరుపరిచారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ శనివారం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గజ్వేల్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీనిపై పౌరహక్కల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టిన సీజే ఆదివారం ఉదయం తమ ఎదుట హాజరుపర్చాలని తెలంగాణ పోలీసులను ఆదేశించారు. సీజే ఆదేశాల మేరకు పోలీసులు కాశీంను సీజే ఇంటిముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కాశీంను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆయన్ని వెంటనే విడుదల చేయాలంటూ సీజే ఇంటిముందు విద్యార్థులతో పాటు, ప్రజాసంఘాలు ధర్నాకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసు అధికారులు భారీగా బలగాలను మోహరించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. (ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్టు) -
కాశింను నేడు హాజరుపర్చండి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశీంను ఆదివారం ఉదయం తమ ఎదుట హాజరుపర్చాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కాశీంను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ధర్మాసనం అత్యవసరంగా విచారించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శనివారం అత్యవసరంగా సీజే నివాసంలో(హౌస్‌మోషన్) పిటిషన్‌ను విచారించింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు కాశీంను తమ ఎదుట హాజరు పర్చాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదిస్తూ.. 2016 నాటి కేసులో కాశీం ఇప్పటి వరకూ తప్పించుకు తిరుగు తున్నారని చెప్పిన పోలీసులు శనివారం తెల్లవారుజామున అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని చెప్పారు. భార్య, పిల్లలతో కూడా మాట్లాడేందుకు కూడా ఆయనకు పోలీసులు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. కాశీంను కోర్టులో హాజరుపర్చి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోరారు. పోలీసులు చట్ట ప్రకారమే కాశీంను అరెస్ట్ చేశారని, ఇప్పటికే కాశీంను గజ్వేల్ కోర్టులో హాజరుపర్చి ఉంటారని ప్రభుత్వ న్యాయవాదులు హరేందర్ పరిషద్, జె.సాయికృష్ణలు వాదించారు. ఆదేశిస్తే నిందితుడు కాశీంను ధర్మాసనం ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకుని..ఐదేళ్ల నాటి కేసులో నిందితుడు ఇన్నాళ్లూ కాలేజీకి వెళ్లి విద్యాబోధన చేస్తుంటే కనబడటంలేదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఇన్నాళ్లు ఆగి తెల్లవారుజామున అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు అయ్యాక గజ్వేల్ కోర్టులో హాజరుపరుస్తారా? ఇదే మాదిరిగా గతంలో రాజస్థాన్‌లో ఒక కేసులో జరిగితే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశామని, ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలా.. అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ ఆదివారం ఉదయానికి వాయిదా పడింది. -
ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్టు
సాక్షి, సిద్దిపేట: ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ ఆర్ట్స్ కాలేజీ తెలుగు డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ కాశింను శనివారం ఉదయం హైదరాబాద్‌లోని యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్‌లో అరెస్టు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ రెవల్యూషనరీ డాక్టర్ చింతకింది కాశిం అలియాస్ కార్తీక్‌కు కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టు స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ నేతలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై 2016లో సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయినట్లు వివరించారు. ఈ కేసు పరిశోధనలో భాగంగా గజ్వేల్ కోర్టు నుంచి సెర్చ్ వారంట్ తీసుకున్నారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో స్పెషల్ టీం శనివారం ఉదయం 7 గంటల నుంచి 10–05 గంటల వరకు కాశీం నివాసం ఉంటున్న ఉస్మానియా క్యాంపస్ హైదరాబాద్ క్వార్టర్ ఆరో బ్లాక్, 9వ ప్లాట్‌లో అతని భార్య, బంధువుల సమక్షంలో సెర్చ్ చేశారని జోయల్ డేవిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన సీపీఐ (మావోయిస్టు) పార్టీల విప్లవ సాహిత్యం, కరపత్రాలు, సీడీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకొని, సీజ్ చేసి, అరెస్టు చేస్తున్నట్లు అతని భార్యకు తెలిపినట్లు సీపీ పేర్కొన్నారు. అదే విధంగా సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ కమిటీ సెక్రటరీ హరిభూషణ్ అలియాస్ జగన్, ఇతర నేతలతో, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులతో సంబంధాలు కొనసాగిస్తూ, వారు ఇచ్చే డబ్బులతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆరు కేసుల్లో కాశిం నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. కాశింను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. కాశిం అరెస్టు అన్యాయం సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కాశిం అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్‌ను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసిందని, అగ్రకుల అహంకారంతో ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అతనిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాశీంపై రాజద్రోహం కేసు ఎత్తివేయాలి
విరసం రాష్ట్ర నాయకుడు కల్యాణరావు విజయవాడ : నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు, ప్రముఖ రచయిత సి. కాశీంపై పెట్టిన రాజద్రోహం కేసు ఎత్తివేయాలని విరసం రాష్ట్ర నాయకుడు జి.కల్యాణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో కళ్యాణ్‌రావు విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులకు లేఖలు రాశారన్న అభియోగంమోపి గత నెల 20న ములుగు స్టేషన్లో కాశీంపై రాజద్రోహం కేసు నమోదు చేశారన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఊపా) కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిషేధిత సంస్థలో సభ్యుడుతోపాటు పలు అభియోగాలు మోపారని వివరించారు. అప్రజాస్వామిక ఊపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ పాలకులు తెచ్చిన కాలం చెల్లిన ఈ చట్టాన్ని నేటికీ అమలు చేయడం అప్రజాస్వామికమన్నారు. కాశీం విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రజాస్వామిక తెలంగాణ కోరుకున్నవారిలో ఆయన ఒకరని.... అటువంటి వ్యక్తిపై రాజద్రోహం కేసు నమోదు చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నమోదైన తొలి కుట్ర కేసు ఇదేనని కల్యాణ్‌రావు స్పష్టం చేశారు. పోలీసులు లేఖలు సృష్టించడమే కాకుండా, మావోయిస్టు అనుబంధ పత్రిక అంటూ నడుస్తున్న తెలంగాణ పత్రికపైనా కుట్ర చేశారన్నారు. ప్రభుత్వ గ్రంథాలయాలు, యూనివర్సిటీలు సహా తెలంగాణ రాష్ట్రమంతటా ఎంతో మంది చదివే పత్రికపైనా అభియోగాలు మోపడం అన్యాయమన్నారు. ప్రభుత్వ అణచివేత విధానాన్ని నిరసించాలని రచయితలూ, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులకు కల్యాణ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తాటి శ్రీకృష్ణ, కొండపల్లి మాధవరావు, నారాయణ, అరసవల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాసీంపై రాజద్రోహ నేరాన్ని వెంటనే ఎత్తేయ్యాలి
తెలంగాణ ఏర్పడ్డాక కూడా బడుగులపైనే రాజ్యద్రోహం కేసులు పెడతారా అని బీసీసంక్షేమసంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జకృష్ణ ప్రశ్నించారు.. ప్రజాస్వామ్య పరిధిలో యూనివర్శిటీలో ఆచార్యుడిగా ఒకవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, సామాజిక అసమానతలపై రచనలు చేస్తూ 'నడుస్తున్న తెలంగాణ' పత్రికను నడుపుతున్న కాసీంపై ప్రభుత్వం పెట్టిన రాజ్యద్రోహం కేసును వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులకు గురైన బడుగులు, బలహీనవర్గాల వారిని ఆదుకోవాల్సింది పోయి.. నక్సలైట్లతో సంబంధాలున్నాయని రాజద్రోహం కేసును పెట్టడం ప్రభుత్వానికి ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే నక్సల్స్ అజెండాను అమలుచేస్తామన్న సీఎం కేసీఆర్, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న వారిపై రాజద్రోహం కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. కాసీం అడవుల్లో అజ్ఞాతంగా ఉండడం లేదని, తుపాకి పట్టలేదని అటువంటి వారిపై రాజద్రోహం కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ అక్రమకేసును వెంటనే ఎత్తేయక పోతే తమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు.