విరసం రాష్ట్ర నాయకుడు కల్యాణరావు
విజయవాడ : నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు, ప్రముఖ రచయిత సి. కాశీంపై పెట్టిన రాజద్రోహం కేసు ఎత్తివేయాలని విరసం రాష్ట్ర నాయకుడు జి.కల్యాణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో కళ్యాణ్రావు విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులకు లేఖలు రాశారన్న అభియోగంమోపి గత నెల 20న ములుగు స్టేషన్‌లో కాశీంపై రాజద్రోహం కేసు నమోదు చేశారన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఊపా) కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిషేధిత సంస్థలో సభ్యుడుతోపాటు పలు అభియోగాలు మోపారని వివరించారు.
అప్రజాస్వామిక ఊపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ పాలకులు తెచ్చిన కాలం చెల్లిన ఈ చట్టాన్ని నేటికీ అమలు చేయడం అప్రజాస్వామికమన్నారు. కాశీం విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రజాస్వామిక తెలంగాణ కోరుకున్నవారిలో ఆయన ఒకరని.... అటువంటి వ్యక్తిపై రాజద్రోహం కేసు నమోదు చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నమోదైన తొలి కుట్ర కేసు ఇదేనని కల్యాణ్‌రావు స్పష్టం చేశారు.
పోలీసులు లేఖలు సృష్టించడమే కాకుండా, మావోయిస్టు అనుబంధ పత్రిక అంటూ నడుస్తున్న తెలంగాణ పత్రికపైనా కుట్ర చేశారన్నారు. ప్రభుత్వ గ్రంథాలయాలు, యూనివర్సిటీలు సహా తెలంగాణ రాష్ట్రమంతటా ఎంతో మంది చదివే పత్రికపైనా అభియోగాలు మోపడం అన్యాయమన్నారు. ప్రభుత్వ అణచివేత విధానాన్ని నిరసించాలని రచయితలూ, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులకు కల్యాణ్రావు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తాటి శ్రీకృష్ణ, కొండపల్లి మాధవరావు, నారాయణ, అరసవల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.