సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశింకు నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కాశింను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, కాశింపై పోలీసులు పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్ సహాయ పోలీస్ కమిషనర్ పి.నారాయణ కౌంటర్ దాఖలు చేశారు. రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలం వ్యాప్తి కోసమే కాశిం ప్రొఫెసర్, జర్నలిస్ట్ అనే ముసుగులు వేసుకున్నారని పేర్కొన్నారు.
ప్రొఫెసర్‌గా ఉంటూ విద్యార్థుల్లో మావోయిస్టు పార్టీ భావజాలాన్ని నూరిపోసి ఆ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు. బలమైన ఆధారాలు ఉన్నందునే పోలీసులు కాశింను అరెస్టు చేశామని, అంతా చట్ట ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. పలువురు నేతలను పొట్టనబెట్టుకున్న నేర చరిత్ర కూడా మావోయిస్టు పార్టీకి ఉందని, అందుకే ప్రభుత్వం సీపీఎం (మావోయిస్టు) పార్టీని గతంలోనే నిషేధించిందని వివరించారు. అలాంటి పార్టీతో కాశింకు సంబంధాలు ఉన్నాయని గతంలో పట్టుబడిన మావోయిస్టులు చెప్పారని తెలిపారు.
మావోయిస్టులకు సహకారం అందించడమే కాకుండా తెర ముందు ఆ పార్టీ భావజాలాన్ని వినిపించే సంస్థల్లో కాశిం ప్రముఖుడని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారుణాలకు పాల్పడే మావోయిస్టులతో కాశింకు సంబంధాలు ఉన్నట్లుగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే చట్ట ప్రకారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాశింపై పోలీసులు నమోదు చేసిన కేసు చట్టబద్ధమేనని.. గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన రిట్‌ను కొట్టేయాలని కోరారు.
కార్తీక్ పేరుతో మావోలతో కార్యకలాపాలు..
‘కాశిం గళాన్ని అణచివేయడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక గొంతుకల్ని నొక్కేయడం లేదు. మావోయిస్టుల పేరుతో చందాలు వసూలు చేశారు. 2016లో ఉన్న కేసులు అరెస్టు చేయకపోవడం వల్లే పరారీలో ఉన్నట్లు పేర్కొన్నాం. కాశిం ఇంట్లో సోదాలు ఆయన భార్య స్నేహలత సమక్షంలోనే చేశాం. సోదాల సమయంలో వీడియో చిత్రీకరణ కూడా చేశాం. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, కంప్యూటర్ వంటి వాటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాం. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల ఆ పరీక్షల్లో ఏమీ తేలలేదు. కాశింపై మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి.
మరో రెండు కేసుల్లో నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. మావోయిస్టుల పేరుతో చేస్తున్న కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అన్ని సాక్ష్యాధారాలను సేకరించాకే కాశింను అరెస్టు చేశాం. అండర్ గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులతో కార్తీక్ అనే పేరుతో కాశిం సంప్రదిస్తున్నారు. 2018లో శ్యాంసుందర్‌రెడ్డి అనే మావోయిస్టు ఇచ్చిన వాంగ్మూలంలో ద్వారా కాశిం గురించి మరిన్ని వివరాలు తెలిశాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి కూతురే కాశిం భార్య స్నేహలత. ఆమె కూడా అదే కేసులో నిందితురాలు. అత్యాధునిక ఆయుధాలతో 150 మంది తీవ్రవాదులు రహస్యంగా ఉన్నారు. వారందరి భావజాలాన్ని కాశిం ప్రొఫెసర్ ముసుగులో వ్యాప్తి చేస్తున్నారు’అని పోలీసులు కౌంటర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment