మావోలతో సంబంధాలు చూపండి | High Court Commands To AG Over Kasim Case | Sakshi

మావోలతో సంబంధాలు చూపండి

Published Mon, Jan 20 2020 3:01 AM | Last Updated on Mon, Jan 20 2020 3:01 AM

High Court Commands To AG Over Kasim Case - Sakshi

విచారణ అనంతరం కాశింను తిరిగి జైలుకు తరలిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలతో అరెస్టు చేస్తే కుదరదని, ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఉస్మానియా వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చింతకింద కాశిం ను పోలీసులు అరెస్ట్‌ చేసిన కేసులో హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసుల రిమాండ్‌ డైరీ రిపోర్టు ప్రకారం కాశింపై 5 వేర్వేరు క్రిమినల్‌ కేసులున్నాయని, 2006–2019 వరకూ క్రిమినల్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నారని చెబుతున్న పోలీసులు 14 ఏళ్లుగా కాశింను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని నిలదీసింది. నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు, డబ్బులు వసూలు చేసినట్లు 2016లో ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో యిస్టు మందల శ్యాంసుందర్‌రెడ్డి వాంగ్మూలంలో చెబితే మూడేళ్లుగా ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించింది.

ఆయనను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్‌ పోలీసులు ధర్మాసనం ఎదుట హాజరుపర్చారు. ఆదివారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి నివాసంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం కాశింతో మాట్లాడి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

తలుపులు పగులగొట్టి..
తొలుత కాశిం తనకు మాయివోస్టు పార్టీతో సంబంధాలు లేవని ధర్మాసనానికి తెలిపారు. ఆ పార్టీ కోసం నిధుల సేకరణగానీ, పంపిణీగానీ, భావజాలప్రచారం గానీ చేయలేదన్నారు. తన ప్రసంగాలు యూట్యూబ్‌లో, పుస్తకాలు మార్కెట్‌లో ఉన్నాయని, వాటిలో ఎక్కడా మావో యిస్టు పార్టీకి అనుకూలంగా లేవన్నారు. 18న ఉదయం 6.30 గంటలకు పోలీసులు ఓయూ క్యాంపస్‌ లోని తన ఇంటి తాళాన్ని పగులగొట్టి మావోయిస్టు సాహిత్యాన్ని వాళ్లే పెట్టి సోదాలు చేశాక దొరికినట్లుగా చెప్పారని ఆరోపించారు. వచ్చిన పోలీసులు ముగ్గురు యూనిఫాంలో ఉంటే 30 మంది సివిల్‌ దుస్తుల్లో ఉన్నారని వివరించారు.

ములుగు తీసుకువెళ్లాక శిక్షణలో ఉన్న పోలీసు అధికారి అఖిల్‌ మహాజన్‌ తనను కుల వ్యవస్థ గురించి ప్రశ్నించారే గానీ మావో యిస్టు పార్టీ గురించి అడగలేదన్నారు. మరో ముగ్గురు పోలీసుల విచారణలో మావోయిస్టులతో తాను మాట్లాడినట్లు, డబ్బులు వసూళ్లు చేసినట్లుగా తన చేత బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు. తనను పోలీసులు హింసించలేదని వివరించారు. చాలా నిరుపేదల కుటుంబం నుంచి వచ్చానని, తనపై ఏడుగురు కుటుంబ సభ్యులు ఆధారపడ్డారని, పోలీసుల చర్యల వల్ల తన ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని, కాబట్టి తనను విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని కాశిం హైకోర్టును కోరారు. ఈ వివరాలన్నింటినీ ధర్మాసనం రికార్డు చేసింది. 

ఆందోళన కలిగిస్తున్నాయి..
‘మావోయిస్టు సానుభూతిపరులని అరెస్ట్‌ చేసే కేసుల్ని తరుచుగా విచారించాల్సి వస్తోంది. తెల్లవారుజామున అరెస్టులు చేసి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చడం.. మేజిస్ట్రేట్‌ వారిని జ్యుడీషి యల్‌ కస్టడీకి పంపడం పరిపాటైంది. పోలీసులే తనిఖీల పేరుతో ఇళ్లలోకి వచ్చి మావోయిస్టు సాహిత్యాన్ని ఇళ్లలో పెట్టి, మావోయిస్టులతో తమకు సంబంధం ఉందని బలవంతంగా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇవన్నీ మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాశిం విషయంలో ఏళ్లుగా కేసులున్నా పట్టించుకోని పోలీసులు ఇటీవల ఓయూలో కుల రాజకీయాలను ప్రశ్నిస్తూ  పుస్తకాన్ని ప్రచురించాకే అరెస్ట్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2006–2019 వరకూ కేసులుంటే ఇప్పుడు ఒక్కసారిగా ఆయనను సమాజానికి ప్రమాదకారిగా చూపించే ప్రయత్నం కనబడుతోంది.

ఇన్నేళ్లుగా ఉన్న కేసుల పురోగతి వివరించండి. 2016లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 44 మంది నిందితుల జాబితాలో కాశిం భార్య పేరు కూడా ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్‌ చేశారు. గత 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నందునే పట్టుకోలేకపోయామని పోలీసులు ఈ నెల 18న చెప్పారు. పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించేందుకు పోలీసులు సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో లేదో చెప్పాలి. కాశిం లైబ్రరీ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సాహిత్యం, పత్రాలు మొదలైన వాటిపై రికవరీ మెమోను మా ముందుంచండి. మావోయిస్టు పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారన్న ఆరోపణలకు సైతం పోలీసులు ఆధారాలు సమర్పించాలి.

దీని వల్ల మావోయిస్టు సానుభూతిపరులంటూ పోలీసులు చేసిన అరెస్టులపై పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలపై ఓ ప్రొఫెసర్‌నే అరెస్ట్‌ చేసినప్పుడు, ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి నిరసన గళాలను నిశ్శబ్ధంగా అణిచివేస్తుందా? అన్నది మేం చూడాలి. ఈ కోర్టు ముందున్న ప్రశ్న ఓ పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛే కాదు, రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విద్య నేర్పే వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకోవడం కూడా. మానవ, రాజ్యాంగ హక్కుల్ని ప్రభుత్వాలు ఉల్లంఘించేందుకు ఆస్కారం లేదు’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ నెల 23 కల్లా కౌంటర్‌ దాఖలు చేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. అప్పటివరకు కాశింను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రఘునాథ్‌ కల్పించుకుని, సంగారెడ్డి జిల్లాలో సరైన వసతులు లేవని, అందువల్ల చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు కాశింను తరలించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కాశింను చర్లపల్లి జైలుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా పడింది.

కంది జైలుకు ప్రొఫెసర్‌ కాశిం
సంగారెడ్డి అర్బన్‌: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కాశింను సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తీసుకువచ్చినట్లు జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్‌ గౌడ్‌ తెలిపారు. రిమాండ్‌లో ఉన్న కాశింను ఆదివారం ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌ ముందు హాజరు పరిచినట్లు వివరించారు. సాయంత్రం 3.30 గంటలకు తిరిగి జైలుకు తీసుకువచ్చామన్నారు. 2016 సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌ స్టేషన్‌లో కాశింపై కేసు నమోదు కాగా.. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై శనివారం గజ్వేల్‌ పోలీసులు  అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement