AG
-
‘‘సెక్యులర్‌ను రాజ్యాంగం నుంచి తొలగించాల్సిందే’’
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తున్నారు. దేశ జనాభాలో 90 శాతం ముస్లింలు ఉన్నందున.. సెక్యులర్ పదాన్ని తొలగించడంతో సహా రాజ్యాంగంలో గణనీయమైన మార్పుల తీసుకురాలని అన్నారాయన. ఈ మేరకు రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీం కోర్టులో జరగుతున్న విచారణ సందర్భంగా ఏజీ హోదాలో తన వాదనలను వినిపించారు. న్యాయమూర్తులు ఫరా మహబూబ్, దేబాశిష్ రాయ్ చౌదరిలు 15వ సవరణ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తూ.. ‘‘సవరణలు ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలి. కానీ నిరంకుశత్వానికి కాదు. ఆర్టికల్ 2Aలో దేశంలో అన్ని మతాల ఆచరణలో సమాన హక్కులు, సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 9 ‘బెంగాలీ జాతీయవాదం’ గురించి చెబుతుంది. ఇది విరుద్ధమైంది. షేక్ ముజిబుర్ రెహమాన్‌ను ‘జాతి పిత’గా పేర్కొనడంతోపాటు అనేక రాజ్యాంగ సవరణలు జాతీయ విభజనకు దోహదపడతాయని , వాక్ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేస్తాయి. దేశ విభజనలో షేక్ ముజిబుర్ రెహమాన్ సహకారాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. అయితే.. సెక్యులర్ అనే పదాన్ని చట్టం ద్వారా అమలు చేయడం విభజనను సృష్టిస్తుంది. లిబరేషన్ వార్, జాతీయ ఐక్యత విలువలను ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలి. 15వ సవరణ రాజ్యాంగబద్ధతను కోర్టు పరిశీలించాలి’ అని వాదనలు వినిపించారు. మరోవైపు.. తాత్కాలిక ప్రభుత్వం దాడులు, వేధింపుల నుంచి తమను రక్షించాలని, హిందూ నాయకులపై దేశద్రోహ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెలలో పదివేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 30,000 మంది నిరసనకారులు చటోగ్రామ్‌లో తమ హక్కులను డిమాండ్ చేశారు. విపక్ష విద్యార్థుల నేతృత్వంలోని నిరసనల నడుమ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్‌కు వెళ్లిపోయిన అనంతరం.. హిందూవులు టార్గెట్‌గా దాడులు జరిగిన పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని దాదాపు 170 మిలియన్ల జనాభాలో కేవలం 8 శాతం మంది మాత్రమే ఉన్న హిందువులపై ఆగష్టు 4 నుంచి సుమారు 2,000 కంటే ఎక్కువ దాడులను జరిగినట్లు వార్తలు వచ్చాయి. -
పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు ప్రదానం
ఏజీ వర్సిటీ: ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్–ఐఐఆర్‌ఆర్‌లోని రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఈ అవార్డును కూడా అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇప్పటివరకు 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డీజీ డీఏఆర్ఈ కార్యదర్శి హిమాన్షు పాఠక్, డీఏఆర్ఈ కార్యదర్శి ఆర్ఎస్ పరోడా, ఐసీఏఆర్ మాజీ డీడీజీ ఈఏ సిద్దిఖ్, నూజివీడ్స్ సీఏండీ ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘కూల్చివేతల బులిటెన్ విడుదల చేయొచ్చుగా’
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేతలను కవరేజ్ చేయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. కూల్చివేతల వద్దకు ఎవ్వరిని అనుమతించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఎందుకు అనుమతి ఇవ్వరో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. సెక్షన్ 180ఇ ప్రకారం సైట్లో పని చేసే వారు మాత్రమే ఉండాలి.. కానీ మిగిలిన వారు ఉండటానికి అనుమతి లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కూల్చివేతల అంశంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. (కేబినెట్ ఆమోద ప్రతిని ఇవ్వండి) కోవిడ్ బులిటెన్లను ఏవిధంగా విడుదల చేస్తున్నారో కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ కూడా అలానే విడుదల చేయొచ్చు కదా అని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే 95 శాతం కూల్చివేత పనులు పూర్తి అయ్యాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ అంశం గురించి ప్రభుత్వాన్ని సంప్రదించి సోమవారం చెప్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే సోమవారం వరకు గడువు ఇవ్వలేమన్న హైకోర్టు.. రేపటిలోగా ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. -
మీడియాను ఎందుకు అనుమతించడం లేదు?
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని భవనాల కూల్చివేత ప్రక్రియను కవర్ చేసేందుకు మీడియాను ఎందుకు అనుమతించడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వాతంత్య్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. కూల్చివేత ప్రక్రియను కవర్ చేసేందుకు మీడియాను అనుమతించడం లేదంటూ వీఐఎల్ మీడియా తరఫున జి.సంపత్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి కూల్చివేతలను రహస్యంగా చేపడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. పేల్చివేతల ద్వారా భవనాలను కూల్చివేస్తున్నామని, ప్రమాదాలు జరుగుతాయనే మీడియాను అనుమతించడం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. మీడియాను అనుమతిస్తే సాధారణ ప్రజలు కూడా వచ్చి కూల్చివేత ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతోపాటు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. యుద్ధం జరుగుతున్న ప్రదేశాల్లోకే మీడియాను అనుమతిస్తున్న పరిస్థితి ఉందని, కూల్చివేత పనులు అంత రహస్యంగా చేపట్టాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. గుప్తనిధులున్నాయని, అందుకే రహస్యంగా కూల్చివేతలు చేపడుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కూల్చివేత ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనే హక్కు ప్రజలకుందన్నారు. కూల్చివేత వీడియోలను ప్రభుత్వమే తీసి మీడియాకు ఇవ్వొచ్చుగా అని ఏజీని ప్రశ్నించారు. మీడియాకు ఒక పాయింట్‌ను కేటాయించి..వివరాలు తెలియజేయవచ్చని, పనులు ఆపిన సమయంలో వారిని అక్కడికి తీసుకెళ్లవచ్చని సూచించారు. అలాగే కోవిడ్ బులెటిన్ ఇస్తున్న తరహాలో ప్రతిరోజూ కూల్చివేతలకు సంబంధించిన సమాచారాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఇవ్వొచ్చునని, ఇందుకు అభ్యంతరం ఏముందని ఏజీని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వివరణ తీసుకుని చెబుతానని, వారం రోజుల సమయం కావాలని ఏజీ కోరగా..అందుకు వారం సమయం ఎందుకని నేటిలోగా తెలియజేయాలని సూచిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
మావోలతో సంబంధాలు చూపండి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలతో అరెస్టు చేస్తే కుదరదని, ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఉస్మానియా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశిం ను పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసుల రిమాండ్ డైరీ రిపోర్టు ప్రకారం కాశింపై 5 వేర్వేరు క్రిమినల్ కేసులున్నాయని, 2006–2019 వరకూ క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొన్నారని చెబుతున్న పోలీసులు 14 ఏళ్లుగా కాశింను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీసింది. నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు, డబ్బులు వసూలు చేసినట్లు 2016లో ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో యిస్టు మందల శ్యాంసుందర్‌రెడ్డి వాంగ్మూలంలో చెబితే మూడేళ్లుగా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లో హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్ పోలీసులు ధర్మాసనం ఎదుట హాజరుపర్చారు. ఆదివారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి నివాసంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం కాశింతో మాట్లాడి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తలుపులు పగులగొట్టి.. తొలుత కాశిం తనకు మాయివోస్టు పార్టీతో సంబంధాలు లేవని ధర్మాసనానికి తెలిపారు. ఆ పార్టీ కోసం నిధుల సేకరణగానీ, పంపిణీగానీ, భావజాలప్రచారం గానీ చేయలేదన్నారు. తన ప్రసంగాలు యూట్యూబ్‌లో, పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయని, వాటిలో ఎక్కడా మావో యిస్టు పార్టీకి అనుకూలంగా లేవన్నారు. 18న ఉదయం 6.30 గంటలకు పోలీసులు ఓయూ క్యాంపస్ లోని తన ఇంటి తాళాన్ని పగులగొట్టి మావోయిస్టు సాహిత్యాన్ని వాళ్లే పెట్టి సోదాలు చేశాక దొరికినట్లుగా చెప్పారని ఆరోపించారు. వచ్చిన పోలీసులు ముగ్గురు యూనిఫాంలో ఉంటే 30 మంది సివిల్ దుస్తుల్లో ఉన్నారని వివరించారు. ములుగు తీసుకువెళ్లాక శిక్షణలో ఉన్న పోలీసు అధికారి అఖిల్ మహాజన్ తనను కుల వ్యవస్థ గురించి ప్రశ్నించారే గానీ మావో యిస్టు పార్టీ గురించి అడగలేదన్నారు. మరో ముగ్గురు పోలీసుల విచారణలో మావోయిస్టులతో తాను మాట్లాడినట్లు, డబ్బులు వసూళ్లు చేసినట్లుగా తన చేత బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు. తనను పోలీసులు హింసించలేదని వివరించారు. చాలా నిరుపేదల కుటుంబం నుంచి వచ్చానని, తనపై ఏడుగురు కుటుంబ సభ్యులు ఆధారపడ్డారని, పోలీసుల చర్యల వల్ల తన ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని, కాబట్టి తనను విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని కాశిం హైకోర్టును కోరారు. ఈ వివరాలన్నింటినీ ధర్మాసనం రికార్డు చేసింది. ఆందోళన కలిగిస్తున్నాయి.. ‘మావోయిస్టు సానుభూతిపరులని అరెస్ట్ చేసే కేసుల్ని తరుచుగా విచారించాల్సి వస్తోంది. తెల్లవారుజామున అరెస్టులు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చడం.. మేజిస్ట్రేట్ వారిని జ్యుడీషి యల్ కస్టడీకి పంపడం పరిపాటైంది. పోలీసులే తనిఖీల పేరుతో ఇళ్లలోకి వచ్చి మావోయిస్టు సాహిత్యాన్ని ఇళ్లలో పెట్టి, మావోయిస్టులతో తమకు సంబంధం ఉందని బలవంతంగా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇవన్నీ మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాశిం విషయంలో ఏళ్లుగా కేసులున్నా పట్టించుకోని పోలీసులు ఇటీవల ఓయూలో కుల రాజకీయాలను ప్రశ్నిస్తూ పుస్తకాన్ని ప్రచురించాకే అరెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2006–2019 వరకూ కేసులుంటే ఇప్పుడు ఒక్కసారిగా ఆయనను సమాజానికి ప్రమాదకారిగా చూపించే ప్రయత్నం కనబడుతోంది. ఇన్నేళ్లుగా ఉన్న కేసుల పురోగతి వివరించండి. 2016లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మొత్తం 44 మంది నిందితుల జాబితాలో కాశిం భార్య పేరు కూడా ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు. గత 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నందునే పట్టుకోలేకపోయామని పోలీసులు ఈ నెల 18న చెప్పారు. పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించేందుకు పోలీసులు సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో లేదో చెప్పాలి. కాశిం లైబ్రరీ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సాహిత్యం, పత్రాలు మొదలైన వాటిపై రికవరీ మెమోను మా ముందుంచండి. మావోయిస్టు పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారన్న ఆరోపణలకు సైతం పోలీసులు ఆధారాలు సమర్పించాలి. దీని వల్ల మావోయిస్టు సానుభూతిపరులంటూ పోలీసులు చేసిన అరెస్టులపై పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలపై ఓ ప్రొఫెసర్‌నే అరెస్ట్ చేసినప్పుడు, ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి నిరసన గళాలను నిశ్శబ్ధంగా అణిచివేస్తుందా? అన్నది మేం చూడాలి. ఈ కోర్టు ముందున్న ప్రశ్న ఓ పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛే కాదు, రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విద్య నేర్పే వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకోవడం కూడా. మానవ, రాజ్యాంగ హక్కుల్ని ప్రభుత్వాలు ఉల్లంఘించేందుకు ఆస్కారం లేదు’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 23 కల్లా కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. అప్పటివరకు కాశింను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ కల్పించుకుని, సంగారెడ్డి జిల్లాలో సరైన వసతులు లేవని, అందువల్ల చర్లపల్లి సెంట్రల్ జైలుకు కాశింను తరలించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కాశింను చర్లపల్లి జైలుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా పడింది. కంది జైలుకు ప్రొఫెసర్ కాశిం సంగారెడ్డి అర్బన్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశింను సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తీసుకువచ్చినట్లు జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ తెలిపారు. రిమాండ్‌లో ఉన్న కాశింను ఆదివారం ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ముందు హాజరు పరిచినట్లు వివరించారు. సాయంత్రం 3.30 గంటలకు తిరిగి జైలుకు తీసుకువచ్చామన్నారు. 2016 సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో కాశింపై కేసు నమోదు కాగా.. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై శనివారం గజ్వేల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారం టీఆర్ఎస్లోనే అసంతృప్తిని రాజేస్తోందా? వీడియో ఫుటేజీల నేపథ్యంలో ఏజీ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికీ చెడ్డపేరు తెస్తుందని అధికార పార్టీ నేతలే భావిస్తున్నారా? వీటికి టీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఈ వరుస పరిణామాలు ప్రభుత్వానికి ఇబ్బందికరమేనని మంత్రులే తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తలెత్తిన ఘటనలు మరిచిపోకముందే ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని వివిధ పార్టీలే కాకుండా ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్లు, సామాజిక, ప్రజా సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. వీడియో ఫుటేజీలను ప్రతిపక్ష పార్టీల నేతలకు చూపించకుండా, సరైన ప్రొసీజర్ పాటించకుండానే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని ఒకరిద్దరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద తప్పుబడుతున్నారు. ‘‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనం వ్యవహరిం చిన తీరు ప్రపంచానికి అంతా తెలుసు. ఇదే గవర్నర్, ఇలాంటి ప్రసంగం సందర్భంగానే జరిగిన ఘటనలకు సభలో నేను ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు అధికారంలో ఉన్నవారూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే మేం సభలో ఉండేవాళ్లమా? ఇలాంటి నిర్ణయాన్ని ఊహించ లేదు’’అని మంత్రివర్గంలోని ముఖ్యుడొకరు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. వేటు వేయడం ద్వారా ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు తావిచ్చినట్టుగా ఉంటుందని, ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని ఒకరిద్దరు మంత్రులు సున్నితంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు. అయితే ఆ నిర్ణయంపై ఒత్తిడి పెంచే అవకాశం ఇవ్వకుండానే ఖాళీలను ప్రకటిస్తూ శాసనసభ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘానికి అదేరోజు లేఖను పంపించారని వెల్లడించారు. కోమటిరెడ్డి, సంపత్‌లపై సానుభూతిని పెంచామేమో.. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌పై వివిధ వర్గాల్లో సానుభూతిని తామే పెంచామని టీఆర్ఎస్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఏకంగా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో వారిపట్ల కాంగ్రెస్‌లోనే కాకుండా తెలంగాణవాదులు, ప్రజల్లో సానుభూతి పెరగడానికి కారణమైందని విశ్లేషించారు. ‘‘అణచివేతకు గురైనవారిపై ఏ సమాజానికైనా సానుభూతి ఉంటుంది. తెలంగాణలో ఇది కొంచెం ఎక్కువ. ఉద్యమం సందర్భంగా రాష్ట్ర ఆకాంక్షలతో పాటు వివిధ సందర్భాల్లో అప్పటి ప్రభుత్వం అనుసరించిన నిర్బంధం కూడా టీఆర్ఎస్పై సానుభూతి పెరగడానికి ప్రధాన కారణమే. అప్పుడు టీఆర్ఎస్పై నిర్బంధానికి వ్యతిరేకంగా పనిచేసిన వర్గాలు.. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకున్న అంతకంటే తీవ్రమైన నిర్ణయంతో ఏకీభవిస్తాయా? రాజకీయ వ్యూహం ఏమున్నా సభ్యత్వంపై వేటు వేయడం పార్టీలోనూ చాలామందికి నచ్చడం లేదు. దీంతో ఎవరు అధికారంలో ఉన్నా, ఎప్పుడైనా ప్రతిపక్ష సభ్యులను శాసనసభ్యత్వానికి అనర్హులుగా చేయొచ్చన్న సందేశాన్ని ఇచ్చినవాళ్లం అవుతున్నం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది’’అని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. దాంతోనే ఎక్కువ నష్టం.. ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయస్థానంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో, శాసనసభ ఎలా ప్రతిస్పందిస్తుందో అన్న అంశాల కంటే ఏజీ రాజీనామా వ్యవహారమే ఎక్కువ నష్టం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇది ఎమ్మెల్యేలపై వేటు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పేనన్న సంకేతాలిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరిస్తే వీడియో ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదన్న ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామికంగా, ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలను ఇంత సునాయాసంగా తొలగించవచ్చన్న అభిప్రాయం కూడా మంచిది కాదని వారంటున్నారు. ఇదంతా ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నామన్న విమర్శలకు అవకాశం కల్పించినట్టుగా ఉందంటూ అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
ఏజీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా నియమితులైన దేశా య్ ప్రకాశ్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టులోని ఏజీ చాం బర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయవాదులు అభినందించారు. అ నంతరం ప్రకాశ్‌రెడ్డిని తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఘనంగా సన్మానించాయి. కార్యక్ర మంలో ఇరు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు జెల్లి కనకయ్య, చల్లా ధనంజయ, పాశం సుజాత, గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కె.జ్యోతిప్రసాద్, బాచిన హనుమం తరావు తదితరులు పాల్గొన్నారు. -
జీవో 123 కొట్టివేతపై నేడు అప్పీల్
సాక్షి, హైదరాబాద్: జీవో 123ని కొట్టేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ రూపంలో అప్పీల్‌ను దాఖలు చేయనుంది. ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఇందుకు సంబంధించి ప్రస్తావన చేయనున్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం స్వయంగా ఏజీతో మాట్లాడినట్లు సమాచారం. ఈ అప్పీల్లో హాజరై వాదనలు వినిపించే బాధ్యతలను ఏజీకి అప్పగించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఏజీ.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, ఈ విషయంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తర్వులు, వాటి తీరు తెన్నులు తదితర అంశాలపై అధ్యయనం మొదలుపెట్టారు. భూములను అమ్మే, కొనే అధికారం ప్రభుత్వానికి ఉందన్న కోణంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిశీలించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములను ఎలా సేకరిస్తోంది.. దానిపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు.. వాటిపై ధర్మాసనం ఇచ్చిన తీర్పులు.. తదితర అంశాలపైనా ఏజీ బృందం దృష్టి సారించింది. ఇప్పటికే జీవో 123పై అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా అప్పీల్లో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. గురువారం సాయంత్రం వరకు జీవో కొట్టివేత తాలుకు తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో స్వయంగా ఏజీనే రంగంలోకి దిగారు. సాయంత్రం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ కోర్టుకు వెళ్లి.. తీర్పు కాపీ కోసం న్యాయమూర్తిని అభ్యర్థించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశమని, అందువల్ల తీర్పు కాపీ వీలైనంత త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఏజీ స్వయంగా వచ్చి కోరడంతో సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. తన ఢిల్లీ విమాన ప్రయాణ సమయాన్ని కూడా మార్చుకున్నారు. బెంచ్ దిగిన తర్వాత న్యాయమూర్తి.. తన తీర్పు కాపీలో ఏవైనా అక్షర దోషాలు ఉన్నాయో పరిశీలించి వాటిని సరిచేసే పని పూర్తిచేశారు. అనంతరం రిజిస్ట్రీలో తీర్పు కాపీ బయటకు వచ్చేందుకు అన్ని ప్రక్రియలు పూర్తయి, ఏజీ చేతికి కాపీ వచ్చే సరికి రాత్రి 8.30 అయింది. అప్పటి వరకు రామకృష్ణారెడ్డి హైకోర్టులోనే ఉన్నారు. తీర్పు కాపీ తీసుకుని ఇంటికి వెళ్లారు.