టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కలకలం | Ruling Party Dissatisfied with AG Prakash Reddy Resign? | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కలకలం.. ‘వేటు’ వికటించిందా?

Published Thu, Mar 29 2018 2:12 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Ruling Party Dissatisfied with AG Prakash Reddy Resign? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారం టీఆర్‌ఎస్‌లోనే అసంతృప్తిని రాజేస్తోందా? వీడియో ఫుటేజీల నేపథ్యంలో ఏజీ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికీ చెడ్డపేరు తెస్తుందని అధికార పార్టీ నేతలే భావిస్తున్నారా? వీటికి టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఈ వరుస పరిణామాలు ప్రభుత్వానికి ఇబ్బందికరమేనని మంత్రులే తమ సన్నిహితుల వద్ద
వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇదే గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తలెత్తిన ఘటనలు మరిచిపోకముందే ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని వివిధ పార్టీలే కాకుండా ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్లు, సామాజిక, ప్రజా సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. వీడియో ఫుటేజీలను ప్రతిపక్ష పార్టీల నేతలకు చూపించకుండా, సరైన ప్రొసీజర్‌ పాటించకుండానే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని ఒకరిద్దరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద తప్పుబడుతున్నారు. 

‘‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనం వ్యవహరిం చిన తీరు ప్రపంచానికి అంతా తెలుసు. ఇదే గవర్నర్, ఇలాంటి ప్రసంగం సందర్భంగానే జరిగిన ఘటనలకు సభలో నేను ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు అధికారంలో
ఉన్నవారూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే మేం సభలో ఉండేవాళ్లమా? ఇలాంటి నిర్ణయాన్ని ఊహించ లేదు’’అని మంత్రివర్గంలోని ముఖ్యుడొకరు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. వేటు వేయడం ద్వారా 
ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు తావిచ్చినట్టుగా ఉంటుందని, ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని ఒకరిద్దరు మంత్రులు సున్నితంగా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు. అయితే ఆ నిర్ణయంపై ఒత్తిడి పెంచే అవకాశం ఇవ్వకుండానే ఖాళీలను ప్రకటిస్తూ శాసనసభ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘానికి అదేరోజు లేఖను పంపించారని వెల్లడించారు. 

కోమటిరెడ్డి, సంపత్‌లపై సానుభూతిని పెంచామేమో.. 
అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌పై వివిధ వర్గాల్లో సానుభూతిని తామే పెంచామని టీఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఏకంగా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో వారిపట్ల కాంగ్రెస్‌లోనే కాకుండా తెలంగాణవాదులు, ప్రజల్లో సానుభూతి పెరగడానికి కారణమైందని విశ్లేషించారు. ‘‘అణచివేతకు గురైనవారిపై ఏ సమాజానికైనా సానుభూతి ఉంటుంది. తెలంగాణలో ఇది కొంచెం ఎక్కువ. ఉద్యమం సందర్భంగా రాష్ట్ర ఆకాంక్షలతో పాటు వివిధ సందర్భాల్లో అప్పటి ప్రభుత్వం అనుసరించిన నిర్బంధం కూడా టీఆర్‌ఎస్‌పై సానుభూతి పెరగడానికి ప్రధాన కారణమే. 

అప్పుడు టీఆర్‌ఎస్‌పై నిర్బంధానికి వ్యతిరేకంగా పనిచేసిన వర్గాలు.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ తీసుకున్న అంతకంటే తీవ్రమైన నిర్ణయంతో ఏకీభవిస్తాయా? రాజకీయ వ్యూహం ఏమున్నా సభ్యత్వంపై వేటు వేయడం పార్టీలోనూ చాలామందికి నచ్చడం లేదు. దీంతో ఎవరు అధికారంలో ఉన్నా, ఎప్పుడైనా ప్రతిపక్ష సభ్యులను శాసనసభ్యత్వానికి అనర్హులుగా చేయొచ్చన్న సందేశాన్ని ఇచ్చినవాళ్లం అవుతున్నం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది’’అని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. 

దాంతోనే ఎక్కువ నష్టం.. 
ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయస్థానంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో, శాసనసభ ఎలా ప్రతిస్పందిస్తుందో అన్న అంశాల కంటే ఏజీ రాజీనామా వ్యవహారమే ఎక్కువ నష్టం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇది
ఎమ్మెల్యేలపై వేటు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పేనన్న సంకేతాలిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరిస్తే వీడియో ఫుటేజీని ఎందుకు
బయటపెట్టడం లేదన్న ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామికంగా, ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలను ఇంత సునాయాసంగా తొలగించవచ్చన్న అభిప్రాయం కూడా మంచిది కాదని
వారంటున్నారు. ఇదంతా ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నామన్న విమర్శలకు అవకాశం కల్పించినట్టుగా ఉందంటూ అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement