సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ సభ్యడు, సీనియర్ నేత డి.శ్రీనివాస్‌పై జిల్లా నేతతు తిరుగుబాటు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నేతలు భగ్గుమన్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లో ఎంపీ కవిత నివాసంలో బుధవారం పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. డీఎస్ వ్యవహారశైలిపై చర్చించిన నేతలు ఆయనపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రికి సిఫార్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌కు లేఖ రాశారు. గత మూడు రోజులుగా డీఎస్ ఢిల్లీలో ఉన్నారని, అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపాలరని నేతలు ఆరోపించారు. ఈ భేటీకి బీబీ పాటిల్, ప్రశాంత్‌రెడ్డి, తుల ఉమ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హనుమంతు షిండే హాజరయ్యారు.
జిల్లా నేతల ఆగ్రహం
సీనియర్ నాయకుడిగా డీఎస్‌కు గౌరవమిచ్చి పార్టీలో క్యాబినేట్ హోదా కల్పించారని, కానీ ఆయన మాత్రం మొదట నుంచి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని జిల్లా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరవీలు, అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడానికి ఢిల్లీ పెద్దలతో మంతనాలు ప్రారంభించారన్నారు. డీఎస్ వల్ల టీఆర్‌ఎస్‌కు ఎలాంటి ప్రయోజనం లేదని, ద్రోహానికి పాల్పడుతున్న ఆయనపై సత్వరమే క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలని నేతలంతా కేసీఆర్‌ను కోరారు.
వేటుకు రంగం సిద్దం
డీఎస్ తీరుతో పార్టీ అధిష్టానం కూడా ఆయనపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా డీఎస్ పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోనున్నారని సమాచారం.
స్పందించని డీఎస్ వర్గం
అయితే జిల్లాలో తాజా పరిణామాలపై డీఎస్ వర్గీయులు స్పందించడం లేదు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు చేస్తున్న ఆరోపణలపై వారు నోరుమెదపడం లేదు. అధికార ప్రకటన వచ్చేంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని డీఎస్ వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
సంబంధిత కథనం
ఎంపీ కవితపై డీఎస్ కుమారుడి మండిపాటు!
Comments
Please login to add a commentAdd a comment