సోమవారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితను గజమాలతో సత్కరిస్తున్న కార్యకర్తలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ‘అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. కాంగ్రెస్‌లో కుర్చీల కొట్లాటలే తప్ప ఆ పార్టీకి ప్రజల సంక్షేమం పట్టదు’ అని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర ఓ విహార యాత్ర అని ఎద్దేవా చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్, కేంద్ర జలసంఘం చైర్మన్ వంటి వారితో పాటు దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నొచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కొత్తగా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తే.. తమ మూడున్నరేళ్ల పాలనలో 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తొలి ఫలితం నిజామాబాద్ జిల్లాకే దక్కుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పెట్టుబడి ఇస్తామంటే మింగుడుపడటంలేదు?: ఎంపీ కవిత
దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడటం లేదని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. రైతులకు సాగునీరు కూడా అందితే తమకు మనుగడ ఉండదని కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలంటూ మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి రైతులను రెచ్చగొడుతున్నారని కవిత ఆరోపించారు. నిజాంషుగర్స్ కార్మికులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment