‘కాంగ్రెస్’ కేసుల మీద త్వరలో పుస్తకం
మంత్రి హరీశ్‌రావు వెల్లడి
వెల్దుర్తి (తూప్రాన్): చీటికిమాటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేస్తున్న కేసుల మీద త్వరలో పుస్తకాల రూపంలో వెల్లడిస్తామని మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మెదక్ జిల్లాలో డిప్యూటీ స్పీక ర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ తాము చేపడుతున్న అభివృద్ధిని చూసి అడ్రస్ గల్లంతవుతుందనే భయంతో ఇప్పటిదాకా 150 కేసులు వేసి, అభివృద్ధి పనులకు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు.
ఇంజనీర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, పనులు ఎలా సాగేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాల నలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉంటే గోదా వరి నుంచి 216 టీఎంసీల నీరు సముద్రం లోని వృథాగా పోయేది కాదన్నారు. 21 లక్షల ఎకరాలకు నీరు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
బంగారు తెలంగాణ కోసం కార్యాచరణ
బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని మంత్రి తెలిపారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటును సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న 45 వేల చెరువులు, కుంటలలో 75 శాతం వరకు పునరుద్ధరించామని తెలిపారు.