హరీశ్‌ x షబ్బీర్‌ | Shabbir Ali fires on harish rao | Sakshi
Sakshi News home page

హరీశ్‌ x షబ్బీర్‌

Published Sat, Nov 4 2017 1:26 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Shabbir Ali fires on harish rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీ, వ్యవసాయ సమస్యలపై శుక్రవారం శాసనమండలిలో జరిగిన లఘు చర్చలో మంత్రి హరీశ్‌రావు, ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు కోర్టులకెక్కుతున్నారని అధికారపక్షం ఆరోపించగా సకాలంలో విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌ మాట తప్పారని కాంగ్రెస్‌ ఎదురుదాడి చేసింది. చైర్మన్‌ స్వామిగౌడ్‌ జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

రాజీనామాకు సిద్ధమా...? 
చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ తీరుపై మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ‘‘మీ హయాం లో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్‌ఎస్‌ తరఫున కోర్టులకు వెళ్లినట్లు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు కోర్టుకు వెళ్లినట్లు రుజువు చేస్తా. మీరు రాజీనామాకు సిద్ధమా?’’అని షబ్బీర్‌ అలీకి సవాల్‌ విసిరారు. ప్రాజెక్టులను అడ్డుకునే చరిత్ర మీదని, స్వాగతించిన చరిత్ర తమదన్నారు. హరీశ్‌ వ్యాఖ్యలపై షబ్బీర్‌ కూడా తీవ్రంగా స్పందించారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేస్తామంటూ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేస్తానన్నారు. సభలో ఉద్రిక్త పరిస్థితిని గమనించిన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ జోక్యం చేసుకొని రాజీనామా చేసేందుకు సభ్యులు ఇక్కడకు రాలేదని, ప్రజా సమస్యలపై చర్చించాలని పేర్కొనడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

రైతులపై వడ్డీ భారం మోపారు... 
అంతకుముందు చర్చ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ 2004లో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే విద్యుత్‌ బకాయిలు తీర్చేందుకు రూ. 1,200 కోట్లు చెల్లించిందన్నారు. ముఖ్యంగా రుణమాఫీ చేసిందని, రుణమాఫీ కాలేదని పలువురు ఫిర్యాదు చేస్తే ఒక్కో రైతుకు రూ. 5 వేలు ఇచ్చిందని, మొత్తంగా రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని షబ్బీర్‌అలీ తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసినా నాలుగేళ్లు కిస్తులతో చెల్లించడం వల్ల రైతులపై వడ్డీ భారం పడిందని, దాన్ని రైతులే చెల్లిస్తున్నారని విమర్శించారు. వడ్డీ చెల్లించని రైతులకు బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు.

అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ 2004లో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే తాము జేజేలు పలికామని, మరి తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఇప్పటి కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేయరా అని ప్రశ్నించారు. ఆనాడు 7 గంటల ఉచిత విద్యుత్, రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నందునే కాంగ్రెస్‌కు 2009లో ప్రజలు మళ్లీ అధికారం ఇచ్చారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement