
భూపాలపల్లి: ‘కాంగ్రెసోళ్లు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కూర్చొని పూటకో ప్రెస్‌మీట్‌కే పరిమితమవుతున్నారు.. అక్కడ కూర్చుంటే ఏమీ కనిపించదు. ప్రజల్లోకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలాంటి పనులను చూస్తే అభివృద్ధి అంటే ఏమిటో కనిపిస్తది’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండల కేంద్రంలో రూ.54 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో హరీశ్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ కోతలు కనిపించాయని, తాము నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరు ఒక్కోమాట మాట్లాడుతున్నారన్నారు. తమ ప్రజాప్రతినిధులు పొలం గట్లు, కాల్వలు, చెరువుల వెంట ఉంటున్నారని, కాంగ్రెస్ నాయకులు ఏనాడైనా ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు.
మరో 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందన్నారు. బీజేపీ మంత్రి ఒకరు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని చూసి పొగిడారని, బెంగాల్, కేరళ, ఒడిషా మంత్రులు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను చూసి నేర్చుకున్నారని అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ప్రశంసించారని, ‘పనుల పరిశీలన కాదు.. తాము నేర్చుకొని వెళ్తున్నాం’ అని కొనియాడారన్నారు. తెలంగాణ ఇంజనీర్లు చాలా కష్టపడుతున్నారని ప్రశంసించారని తెలిపారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సాగుకు రెండు, మూడు గంటల విద్యుత్ ఇచ్చిన కాంగ్రెస్ సన్నాసులకు ఇప్పుడు మాట్లాడేందుకు సిగ్గుండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment