
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తున్నారు. దేశ జనాభాలో 90 శాతం ముస్లింలు ఉన్నందున.. సెక్యులర్ పదాన్ని తొలగించడంతో సహా రాజ్యాంగంలో గణనీయమైన మార్పుల తీసుకురాలని అన్నారాయన. ఈ మేరకు రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీం కోర్టులో జరగుతున్న విచారణ సందర్భంగా ఏజీ హోదాలో తన వాదనలను వినిపించారు.
న్యాయమూర్తులు ఫరా మహబూబ్, దేబాశిష్ రాయ్ చౌదరిలు 15వ సవరణ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తూ.. ‘‘సవరణలు ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలి. కానీ నిరంకుశత్వానికి కాదు. ఆర్టికల్ 2Aలో దేశంలో అన్ని మతాల ఆచరణలో సమాన హక్కులు, సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 9 ‘బెంగాలీ జాతీయవాదం’ గురించి చెబుతుంది. ఇది విరుద్ధమైంది. షేక్ ముజిబుర్ రెహమాన్‌ను ‘జాతి పిత’గా పేర్కొనడంతోపాటు అనేక రాజ్యాంగ సవరణలు జాతీయ విభజనకు దోహదపడతాయని , వాక్ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేస్తాయి. దేశ విభజనలో షేక్ ముజిబుర్ రెహమాన్ సహకారాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. అయితే..
సెక్యులర్ అనే పదాన్ని చట్టం ద్వారా అమలు చేయడం విభజనను సృష్టిస్తుంది. లిబరేషన్ వార్, జాతీయ ఐక్యత విలువలను ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలి. 15వ సవరణ రాజ్యాంగబద్ధతను కోర్టు పరిశీలించాలి’ అని వాదనలు వినిపించారు.
మరోవైపు.. తాత్కాలిక ప్రభుత్వం దాడులు, వేధింపుల నుంచి తమను రక్షించాలని, హిందూ నాయకులపై దేశద్రోహ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెలలో పదివేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 30,000 మంది నిరసనకారులు చటోగ్రామ్‌లో తమ హక్కులను డిమాండ్ చేశారు. విపక్ష విద్యార్థుల నేతృత్వంలోని నిరసనల నడుమ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్‌కు వెళ్లిపోయిన అనంతరం.. హిందూవులు టార్గెట్‌గా దాడులు జరిగిన పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని దాదాపు 170 మిలియన్ల జనాభాలో కేవలం 8 శాతం మంది మాత్రమే ఉన్న హిందువులపై ఆగష్టు 4 నుంచి సుమారు 2,000 కంటే ఎక్కువ దాడులను జరిగినట్లు వార్తలు వచ్చాయి.