సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని భవనాల కూల్చివేత ప్రక్రియను కవర్ చేసేందుకు మీడియాను ఎందుకు అనుమతించడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వాతంత్య్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. కూల్చివేత ప్రక్రియను కవర్ చేసేందుకు మీడియాను అనుమతించడం లేదంటూ వీఐఎల్ మీడియా తరఫున జి.సంపత్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు.
భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి కూల్చివేతలను రహస్యంగా చేపడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. పేల్చివేతల ద్వారా భవనాలను కూల్చివేస్తున్నామని, ప్రమాదాలు జరుగుతాయనే మీడియాను అనుమతించడం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. మీడియాను అనుమతిస్తే సాధారణ ప్రజలు కూడా వచ్చి కూల్చివేత ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతోపాటు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. యుద్ధం జరుగుతున్న ప్రదేశాల్లోకే మీడియాను అనుమతిస్తున్న పరిస్థితి ఉందని, కూల్చివేత పనులు అంత రహస్యంగా చేపట్టాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు.
గుప్తనిధులున్నాయని, అందుకే రహస్యంగా కూల్చివేతలు చేపడుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కూల్చివేత ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనే హక్కు ప్రజలకుందన్నారు. కూల్చివేత వీడియోలను ప్రభుత్వమే తీసి మీడియాకు ఇవ్వొచ్చుగా అని ఏజీని ప్రశ్నించారు. మీడియాకు ఒక పాయింట్‌ను కేటాయించి..వివరాలు తెలియజేయవచ్చని, పనులు ఆపిన సమయంలో వారిని అక్కడికి తీసుకెళ్లవచ్చని సూచించారు. అలాగే కోవిడ్ బులెటిన్ ఇస్తున్న తరహాలో ప్రతిరోజూ కూల్చివేతలకు సంబంధించిన సమాచారాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఇవ్వొచ్చునని, ఇందుకు అభ్యంతరం ఏముందని ఏజీని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వివరణ తీసుకుని చెబుతానని, వారం రోజుల సమయం కావాలని ఏజీ కోరగా..అందుకు వారం సమయం ఎందుకని నేటిలోగా తెలియజేయాలని సూచిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment