ముంబై: ‘ఎల్గార్ పరిషత్’ కేసుకు సంబంధించి జైళ్లో ఉన్న ప్రముఖ తెలుగు విప్లవ కవి వరవర రావును తక్షణమే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణశయ్యపై ఉన్న వ్యక్తి చికిత్స కోసం అభ్యర్థిస్తుంటే కుదరదని ఎలా చెప్పగలుగుతున్నారని జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ మాధవ్ జమ్‌దార్‌ల ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. దాంతో వరవర రావును ప్రత్యేక కేసుగా పరిగణించి, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చి, 15 రోజుల పాటు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆసుపత్రిలో వరవరరావును చూసేందుకు ఆసుపత్రి నిబంధనల మేరకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోర్టు స్పష్టం చేసింది.
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వరవరరావు నవీముంబైలోని తలోజా జైళ్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వరవర రావును తలోజా జైలు ఆసుపత్రి నుంచి తక్షణమే నానావతి ఆసుపత్రికి మార్చి, మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన భార్య హేమలత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. వరవరరావు ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు మరణశయ్యపై ఉన్న ఒక 80 ఏళ్ల వ్యక్తికి తలోజా జైళ్లోనే చికిత్స అందిస్తామని ఎలా చెప్తారు?’ అని ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రి అయిన నానావతి హాస్పిటల్‌లో వరవర రావు చికిత్సకు అయిన ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. చికిత్సకు అయ్యే ఖర్చును వరవర రావే భరించాలన్న ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే వాదనను.. వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర జైసింగ్ తోసిపుచ్చారు.
పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించలేకపోవడానికి డబ్బులు లేవన్న కారణాన్ని ప్రభుత్వాలు చూపకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఉటంకించారు. ఆమె వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ‘ప్రస్తుతం ఆయన మీ కస్టడీలో ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మీ కస్టడీలో ఉన్నట్లుగానే భావించాలి. అందువల్ల చికిత్స ఖర్చును మీరే భరించాలి’ అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాంతో, ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే రాష్ట్ర హోం మంత్రిని ఫోన్‌లో సంప్రదించారు. అనంతరం, వరవరరావుకు 15 రోజుల పాటు నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కోర్టుకు తెలిపారు.
దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించాలని, భవిష్యత్తులో ఈ తరహా కేసులకు దీన్ని ఉదాహరణగా చూపకూడదని అభ్యర్థించారు. ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)ను.. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. దానికి, ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగాలను నమోదు చేయాల్సి ఉందని ఎన్‌ఐఏ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ సమాధానమిచ్చారు. అభియోగాల నమోదుకు ఇంకా కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకంటే ఆ అభియోగాలన్నీ ప్రాథమికంగా కంప్యూటర్ సాక్ష్యాలపై ఆధారపడి ఉన్నాయని వరవరరావు తరఫున జైసింగ్‌తో పాటు వాదనలు వినిపించిన ఆనంద్ గ్రోవర్ కోర్టుకు వివరించారు.
చనిపోతే ఎవరిది బాధ్యత?
విచారణ ఇలాగే కొనసాగితే వరవరరావు జైళ్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఇందిర జైసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు పారిపోకూడదనే ఉద్దేశంతోనే విచారణ ఖైదీలను జైళ్లో పెడతారని, కానీ, మానసికంగా దుర్బలమై, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వీవీ పారిపోయే అవకాశమే లేదని ఆమె వివరించారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆయన చనిపోతే ఎవరిది బాధ్యత? ఆసుపత్రిలో ఆయనకేమైనా అయితే, అది కస్టోడియల్ మరణమే అవుతుంది’ అని స్పష్టం చేశారు. జైళ్లో సహచరులు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా వరవరరావును చూసుకుంటున్నారని, కానీ, వారు వైద్యంలో శిక్షణ పొందినవారు కాదని కోర్టుకు వివరించారు.
ఆసుపత్రిలో ఉండగా, వరవరరావుకు చేసిన వైద్య పరీక్షలపై కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అవి తప్పై ఉండొచ్చని, వాటిపై ఆయన వయసు 54 ఏళ్లు అని ఉందని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్న లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. నానావతి హాస్పిటల్‌లో జరిపిన వైద్య పరీక్షల నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. కోర్టుకు తెలియజేయకుండా ఆయనను ఆసుపత్రి నుంచి పంపించేయవద్దని ఆదేశించింది. వీవీ భార్య హేమలత వేసిన రిట్ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఆయనను నానావతి ఆసుపత్రికి మార్చే అంశానికే బుధవారం నాటి వాదనలను పరిమితం చేద్దామని కోర్టు సూచించడంతో, బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగలేదు. విచారణను డిసెంబర్ 3కి కోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment