విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం (ఫైల్)
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన బంగారం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఆ స్కామ్‌లో సూత్రధారిగా ఉన్న మహమ్మద్ మన్సూర్‌ను జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరంగా సాగే అవకాశం ఉంది. ఈ బంగారం కుంభకోణం కేరళ రాజకీయంతో ముడిపడి ఉండడంతో ఎన్‌ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసింది.
అరెస్ట్ అనంతరం మహమ్మద్ మన్సూర్‌ను కొచ్చిలోని ఎన్‌ఐఏ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. మన్సూర్‌ను 5 రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 2020 జూలై 5వ తేదీన త్రివేండ్రం విమానాశ్రయంలో 30 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మన్సూర్ దుబాయ్ నుంచి కుంభకోణం మొత్తం నడిపాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్‌కు తెచ్చేందుకు మన్సూర్ ప్రణాళిక రచించాడని వెల్లడించారు. తిరువననంతపురంలో ఉన్న యూఏఈ కాన్సులేట్ చిరునామాకు కార్గో ద్వారా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అరెస్టయిన మన్సూర్ ఏం వివరాలు వెల్లడిస్తాడో.. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని కేరళలో హాట్ టాపిక్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment