దేశంలో పాగాకు అల్‌కాయిదా కుట్ర | 9 Al Qaeda Terrorists Arrested In Kerala and Bengal Raids | Sakshi
Sakshi News home page

దేశంలో పాగాకు అల్‌కాయిదా కుట్ర

Published Sun, Sep 20 2020 3:58 AM | Last Updated on Sun, Sep 20 2020 7:15 AM

9 Al Qaeda Terrorists Arrested In Kerala and Bengal Raids - Sakshi

అరెస్ట్‌ అయిన అల్‌కాయిదా ఉగ్రవాదులు

న్యూఢిల్లీ/కోల్‌కతా: భారత్‌లో వేళ్లూనుకునేందుకు నిషేధిత అల్‌కాయిదా ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బట్టబయలు చేసింది. కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులు, కొందరు ముఖ్యులను చంపేందుకు సాగుతున్న యత్నాలను భగ్నం చేసింది.  పశ్చిమ బెంగాల్, కేరళలలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి ఈ ముఠాలోని 9 మందిని అరెస్ట్‌చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు, రాష్ట్రాలు పోలీసుల సాయంతో 18, 19 తేదీల్లో కేరళ, బెంగాల్‌లలో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌ఐఏ ప్రతినిధి తెలిపారు.

ముర్షీద్‌ హసన్, ఇయాకుబ్‌ బిశ్వాస్, మొసారఫ్‌ హొస్సేన్‌ అనే వారిని కేరళలోని ఎర్నాకులంలోను, నజ్ముస్‌ సకిబ్, అబూ సుఫియాన్, మైనుల్‌ మొండల్, లియు ఈన్‌ అహ్మద్, అల్‌ మమూన్‌ కమల్, అటిటుర్‌ రహ్మాన్‌లను ముర్షీదాబాద్‌లో అరెస్ట్‌చేశారు. ఈ ముఠాకు హసన్‌ నేతృత్వం వహిస్తున్నాడని చెప్పారు. కేరళలో పట్టుబడిన వారూ బెంగాల్‌ వాసులే. 11న అల్‌కాయిదా మాడ్యూల్‌పై కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది.

అరెస్టయిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్‌లోని అల్‌ కాయిదా ఉగ్రవాదుల బోధనల ప్రభావానికి లోనయ్యారు. ఢిల్లీ సహా దేశంలోని కీలకప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిపి భారీగా ప్రాణనష్టం కలిగించేందుకు, ప్రముఖులను చంపేందుకు పథకం వేశారు. ఇందుకు అవసరమైన డబ్బుతోపాటు ఆయుధాలు..ఆటోమేటిక్‌ రైఫిళ్లు, పిస్టళ్లు, పేలుడు పదార్థాల కోసం కశ్మీర్‌తోపాటు ఢిల్లీ వెళ్లాలని ఈ ముఠా పథకం వేసింది.

అంతేకాకుండా, కశ్మీర్‌ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్‌కాయిదా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. టపాసులను ఐఈడీ(ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌)గా మార్చేందుకు ఈ ముఠా ప్రయత్నిం చిందని సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న స్విచ్చులు, బ్యాటరీలను బట్టి తేలిందని ఎన్‌ఐఏ ప్రతినిధి తెలిపారు. దాడుల్లో జిహాదీ సాహిత్యం, కొన్ని ఆయుధాలు, దేశవాళీ తయారీ తుపాకులు, స్థానికంగా రూపొందించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్, పేలుడు పదార్థాల తయారీని తెలిపే సమాచారం, డిజిటల్‌ పరికరాలు లభించాయి.

ఆరుగురికి 24 వరకు రిమాండ్‌
పశ్చిమబెంగాల్‌లో అరెస్టు చేసిన అల్‌కాయిదా ముఠాలోని ఆరుగురు సభ్యులకు కోల్‌కతాలోని స్పెషల్‌ ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది.

బాంబుల తయారీ కేంద్రం బెంగాల్‌: గవర్నర్‌ ధన్‌కర్‌
పశ్చిమ బెంగాల్‌కు చెందిన అల్‌కాయిదా ఉగ్ర ముఠా సభ్యులను ఎన్‌ఐఏ అరెస్టు చేయడంపై రాష్ట్ర గవర్నర్‌ ధన్‌కర్‌ ట్విట్టర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. బాంబుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారిందని ధన్‌కర్‌ ఆరోపించారు. శాంతి, భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, డీజీపీ ఇందుకు బాధ్యత వహించకతప్పదని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement