భారత్‌తో చర్చలు రద్దు
పాక్ రాయబారి బాసిత్ వెల్లడి
* ఎన్‌ఐఏ పాక్ పర్యటన లేనట్లే..
న్యూఢిల్లీ: భారత్‌తో ఇప్పట్లో ఎలాంటి చర్చలు ఉండవని పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ చెప్పారు. ప్రస్తుతం చర్చల ప్రక్రియ నిలిచిపోయిందని, చర్చలకు భారత్ సిద్ధంగా లేదని గురువారం విలేకరులతో అన్నారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారం కోసం విస్తృత, అర్థవంతమైన చర్చల్ని పాకిస్తాన్ కోరుకుంటుందన్నారు. ఢిల్లీలో ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో మాట్లాడుతూ... పాక్‌లో భారత గూఢచారి కుల్‌భూషణ్ జాదవ్ అరెస్టుతో బలోచిస్తాన్ అస్థిరతలో భారత్ పాత్రపై ఆరోపణలు నిజమని తేలాయన్నారు. పాకిస్తాన్‌లో అశాంతి సృష్టించే వారి విషయంలో అప్రమత్తంగా ఉన్నామని బాసిత్ తెలిపారు.
తన దృష్టిలో పఠాన్‌కోట్ విచారణ పరస్పర ఒప్పందానికి సంబంధించింది కాదని, అంతకుమించి రెండు దేశాల మధ్య విస్తృత సహకారం ఉంటేనే విచారణ ముందుకు సాగుతుందన్నారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై విచారణకు భారత బృందాన్ని పాక్‌లోకి ప్రస్తుతానికి అనుమతించమంటూ పరోక్షంగా వెల్లడించారు. భారత్ నుంచి ఎన్‌ఐఏ బృందం పాక్‌కు వెళ్తుందని విదేశాంగ శాఖ కూడా గురువారం ప్రకటించింది. భారత్ బృందం పర్యటనకు పాక్ అంగీకరించిందని విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. పాకిస్తాన్ ఏకపక్ష నిర్ణయం దురదృష్టకరమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. దీని నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలన్నారు.