సాక్షి, న్యూఢిల్లీ : అది కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా, తిరూర్ సమితి ప్రాంతం. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 12 వేల మంది రైతు కుటుంబాలు ఏప్రిల్ రెండోవారం వచ్చిందంటే వర్షాలు పడాలని కోరుకుంటారు. అంతకన్నా ఎక్కువగా భారత్–పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడరాదని, ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు కొనసాగాలని కోరుకుంటారు. అందుకు కారణం వారి జీవితాలు ఇరు దేశాల సంబంధాలపై ఆధారపడి ఉండడమే. వారంతా తరతరాలుగా తమల పాకులు పండిస్తూ, వాటిని పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తూ వచ్చే ఆదాయంపై ఆధారపడి బతుకుతున్నారు.
తమలపాకులను పాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారంటే పాకిస్తాన్ అక్కడికి పక్కనే ఉందనుకుంటే పొరపాటే. పాక్‌కు ఆనుకున్న భారత సరిహద్దు అక్కడికి దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా ఆ రైతు కుటుంబాలు పాక్ మార్కెట్‌తోనే తమల పాకుల వ్యాపారం చేయడానికి బలమైన కారణాలే ఉన్నాయి. తిరూర్ సమితిలోని ఒజూర్, తనల్లూర్, చెంబ్రా, మోరీ, పయ్యాపురం గ్రామాల రైతులు రెండు రకాల తమల పాకును పండిస్తున్నారు. తిరూర్ లంకా పాన్, నదాన్ రకాలను పండిస్తున్నారు. లంకా పాన్ అంటే వారి భాషలో పురోభివద్ధి, నదాన్ స్థానిక వెరైటీ అట. లంకా పాన్‌ను పాకిస్తాన్‌కు ఎగుమతి చేస్తూ నదాన్ పాన్‌ను మాత్రం దేశీయ మార్కెట్‌కు పంపిస్తున్నారు.
లంకా పాన్ వంద తమలపాకుల కట్టకు 70 రూపాయలు పలుకుతుందట. డిమాండ్ ఉన్నప్పుడు అది 85 రూపాయల వరకు వెళుతుందట. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సరఫరా మందగించినప్పుడు, పాకిస్థాన్ దిగుమతి పన్ను విధించినప్పుడు ఆ కట్ట 20 రూపాయల వరకు పడిపోతుందట. 1965, 1971, 1999 పాక్‌తో యుద్ధాలు జరిగినప్పుడు కూడా లంకా పాన్ సరఫరా నిలిచిపోలేదని స్థానిక రైతులు తెలియజేశారు. దేశంలో విపీ సింగ్ ప్రభుత్వం హయాంలో ఈ తమలపాకులపై వారికి ఎక్కువ లాభాలు వచ్చాయట. 2016, జూన్‌లో ఒక్కసారిగా పాకిస్థాన్ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ దిగుమతులపై సుంకాన్ని 140 శాతానికి పెంచడంతో కట్టకు తమకు 20 రూపాయలకు మించి రాలేదని తమలపాకుల వ్యాపారస్థుల సంఘం అధ్యక్షుడు ఎయాని హాజి తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచి పాక్‌తో ఈ తమలపాకు బంధం మరింత బలంగా ఉండేది. చెన్నై, ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి గూడ్సు రైలుకు తిరూర్ రైల్వే స్టేషన్లో ఓ తమల పాకుల బోగీని అమర్చేవారట. తిరూర్ నుంచి పాక్‌కు కార్గో విమానం కూడా నడిచేదట. దేశ విభజన సందర్భంగా మొహమ్మద్ అలీ జిన్నా బంగ్లాదేశ్‌లోని కొంత ప్రాంతాన్ని తీసుకొని తిరూర్‌ను తమ దేశానికి ఇవ్వాల్సిందిగా కోరారని, అందుకు స్థానిక ముస్లిం కుటుంబాలతోపాటు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిరాకరించారని స్థానికులు చెబుతారు. యుద్ధాలు జరిగినా తమలపాకులా సరఫరా పాక్‌కు ఆగిపోదని కూడా నెహ్రూ నాడు భరోసా ఇచ్చారట.
కానీ ఇటీవల సరిహద్దుల్లో ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితులు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి భారతీయ మార్కెట్‌కు తమలపాకులను తరలించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవచ్చుకదా! అని అడిగితే, తమకు ప్రత్యామ్నాయ మార్కెట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక్కటేనని, అయితే తమిళనాడు నుంచి వస్తున్న రాణివెల్లోర్ తమలపాకులు, పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్న దేశీ తమల పాకులు తమకు గట్టి పోటీస్తున్నాయని స్థానిక రైతులు తెలిపారు. ప్రస్తుతం తిరూర్ నుంచి పాక్‌కు వారానికి ఆరు టన్నుల తమలపాకులు ఎగుమతి అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment