ఎన్‌ఐఏ సోదాలు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని దాడికి కుట్రపన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులకు ఢిల్లీలో పట్టుబడిన తమిళనాడుకు చెందిన 14 మంది ఉగ్రవాదులు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ‘వాగాద్–ఇ–ఇస్లామీ హింద్’ ఉగ్రసంస్థ చీఫ్ సయ్యద్ బుఖారీ, మిగతా ఉగ్రవాదులు అసన్ అలీ, ఆరిష్ మహమ్మద్ అలీ, తవ్‌హీద్ అహ్మద్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో అసన్ అలీ, ఆరిష్ మహమ్మద్ అలీ అనే ఇద్దరిని చెన్నై పూందమల్లిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 25వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది.
మిగిలిన ఇద్దరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించగా ఢిల్లీలో 14 మంది ఉన్నట్లు వాంగ్మూలం ఇచ్చారు. ఉగ్రవాదులు ఢిల్లీ, అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటూ భారత్‌లో విధ్వంసాలకు కుట్రపన్నినట్టు తెలిపారు. ఈ విధ్వంసాలకు పాల్పడేందుకే ఈ 14 మంది అరబ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నట్టు వివరించారు. ఈ ఉగ్రసంస్థ తమిళనాడుతోపాటు మోదీని టార్గెట్ చేసేందుకే వెలిసినట్లు చెప్పారు. ఢిల్లీలో పట్టుబడిన ఈ 14 మందిని ప్రత్యేక విమానంలో చెన్నైకి తీసుకొచ్చి మంగళవారం చెన్నై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment