అఖిల్‌ను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు
గువాహటి: సమాచార హక్కు కార్యకర్త అఖిల్ గొగోయ్ ఇంట్లో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా ల్యాప్‌టాప్‌తో పాటు వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. డిసెంబర్ 12న ఎన్‌ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనల నేపథ్యంలో అనేక రైతు సంఘాలకు సలహాదారుగా ఉన్న గొగోయ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. గువాహటిలోని నిజరపరా ప్రాంతంలోని గొగోయ్ నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేశారు.
అతని పాన్ కార్డు, ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తనిఖీలు మూడు గంటలపాటు జరిగాయి. తనిఖీలు ముగిసిన అనంతరం గొగోయ్ భార్య గీతాశ్రీ తములీ స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను విలేకరులకు చూపించారు. కజిరంగలోని కేఎంఎస్‌ఎస్ ఆర్చిడ్ ఎన్విరాన్‌మెంట్ పార్కుకు సంబంధించిన పత్రాలను కూడా ఎన్‌ఐఏ బృందం కోరిందనీ, అయితే దానికి సంబంధించిన సమాచారం ఏమీ తన దగ్గర లేదని ఆమె వారికి చెప్పింది. కాగా, గొగోయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment