
దుబాయ్ టు బెంగళూరు..
భారీగా బంగారం స్మగ్లింగ్
సినిమా తరహాలో కార్యాచరణ
నటిని ప్రశ్నిస్తోన్న డీఆర్‌ఐ
ఆమె ఇంటిలో రూ.17 కోట్ల బంగారం, నగదు సీజ్
చందనాన్ని స్మగ్లింగ్ చేస్తాడు. ఈ అందాల నటి నిజ జీవితంలో బంగారాన్ని దొంగ రవాణా చేయసాగింది. తరచూ విమానాల్లో ప్రయాణాలు, చుట్టరికాల మద్దతుతో హాలీవుడ్ సినిమా స్థాయిలో కేజీల కొద్దీ బంగారం బిస్కెట్లు, నగలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. విధి వక్రించి అరెస్టయ్యింది.
బనశంకరి: అరబ్ దేశాలనుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ వర్ధమాన నటి, ఓ డీజీపీ బంధువు రన్య రావు విచారణలో డొంకంతా కదులుతోంది. ఆమె నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.17.29 కోట్ల విలువైన పసిడి, నగదును సీజ్ చేశారు. ఈమె దుబాయ్ నుంచి 14.8 కేజీల బంగారాన్ని తీసుకొస్తూ సోమవారం రాత్రి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో దొరికిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ఆమెను డీఆర్‌ఐ అధికారులు విచారిస్తున్నారు.
ఇంటిలో బంగారం నిల్వలు
బెంగళూరు ల్యావెల్లీ రోడ్డు నందవాణి మ్యాన్సన్ నివాసంలో నటి రన్య రావు నివసిస్తోంది. ఆమె నెలకు రూ.4.5 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆ ఇంటిలో వెతికేకొద్దీ బంగారు బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాలు లభించాయి. మంగళవారం నుంచి సోదాలు నిర్వహించి రూ.2.06 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.67 కోట్ల నగదు కూడా లభించింది. ఆమె నుంచి రూ.12.56 కోట్ల విలువచేసే 14.2 కిలోల విదేశీ బంగారం, రూ.4.73 కోట్ల విలువచేసే ఇతర ఆస్తులను జప్తు చేసుకున్నామని డీఆర్‌ఐ ప్రకటించింది.
14 రోజుల రిమాండు
ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో రన్య ను హాజరుపరచగా 14 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. ఆమెను హెచ్‌ఆర్‌బీఆర్ లేఔట్‌లోని డీఆర్‌ఐ కేంద్రకార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. ఆమె బంగారం స్మగ్లింగ్ దందాకు కొందరు పోలీసులు, పారిశ్రామికవేత్తలు సహకారం అందించినట్లు అనుమానం వ్యక్తమైంది.
తరచూ దుబాయ్ టూర్లు
నటి రన్యారావ్ తరచూ దుబాయ్‌కి వెళ్లి వస్తోంది. వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో బంగారు నగలను ధరించి అక్రమంగా తీసుకువచ్చేది. కస్టమ్స్ , భద్రతా సిబ్బంది తనిఖీలు చేయకుండా డీజీపీ పేరును చెప్పేది. అనధికారికంగా పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి వెళ్లేది. తరచూ దుబాయ్‌కి వెళ్లి గుట్టుగా బంగారాన్ని తీసుకు వస్తుండడం వెనుక పెద్ద ముఠానే ఉండవచ్చని డీఆర్‌ఐ ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది.
ఇలా తరలిస్తోంది
విమానం దిగగానే రన్యను డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా గుట్టు రట్టయింది, 14 బంగారు బిస్కెట్లను తొడ భాగంలో గమ్‌తో అంటించి టేప్ చుట్టినట్లు గుర్తించారు. ఆ టేప్ పై క్రేప్ బ్యాండేజ్‌ను చుట్టుకుందని తెలిపారు. ఇలాగైతే స్కానర్ల తనిఖీలో దొరకనని అనుకుంది. శ్యాండల్‌వుడ్‌లో స్టార్‌గా ఎదగాలంటే ఆర్ అనే అక్షరంతో పేరు ఉండాలనుకుని ఆమె రన్య రావుగా పేరు మార్చుకుంది. ఆమె అసలు పేరు హర్షవరి్ధని యఘ్నేశ్, మాణిక్య సినిమా టైంలో రన్య అయ్యింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఆర్ అక్షరం పేరుతో స్టార్లు అయ్యారని, తనకూ ఆర్ కలిసొస్తుందని భావించింది.
ఒక్కొక్కరు ఎంత బంగారం తేవచ్చు..
⇒ దుబాయి నుంచి భారత్ కు వచ్చే పురుష ప్రయాణికులు కస్టమ్స్ ఫీజు లేకుండా 20 గ్రాముల బంగారం, మహిళలైతే 40 గ్రాములు బంగారం తీసుకురావచ్చు.
⇒ ఒకవేళ పురుషులు 50 గ్రాములు తెస్తే 3 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి. 50 గ్రాముల కంటే ఎక్కువైతే 6 శాతం , 100 గ్రాములకు మించితే 10 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి.
⇒మహిళా ప్రయాణికులు 100 గ్రాములు బంగారానికి 3 శాతం, 100 గ్రాములు మించితే 6 శాతం కస్టమ్స్ రుసుమును చెల్లించాలి. 200 గ్రాముల కంటే ఎక్కువైతే 10 శాతం కస్టమ్స్ ఫీజు వేస్తారు. బంగారం కొనుగోలు చేసిన రసీదులను తప్పక చూపించాలి.
హీరోయిన్ అరెస్ట్.. నాలుగునెలలుగా ఇంటికి రాలేదన్న తండ్రి డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment