Gold biscuits Smuggling
-
భాగ్యనగరంలో బంగారం చోరీ.. హీరో సూర్యా గ్యాంగ్ మూవీ లెవెల్లో..
హైదరాబాద్:సూర్య గ్యాంగ్ మూవీ చూశారుగా?. ఐటీ అధికారులుగా వెళ్లి.. నిమిషాల్లో కోట్ల సంపదను దోచేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఐటీ అధికారులుగా గోల్డ్ షాపులోకి వెళ్లి 1.7కిలోల బంగారాన్ని నిమిషాల్లోనే దర్జాగా ఎత్తుకెళ్లారు కెటుగాళ్లు. మోండా మార్కెట్లో ఓ బంగారం షాపు రోజూలాగే ఉదయం ప్రారంభమైంది. యజమాని వేరే ఊరికి వెళ్లిన కారణంగా దగ్గరి బంధువు షాప్‌ను చూసుకుంటున్నారు. కస్టమర్లు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. ఈ క్రమంలోనే సూటు.. బూటు ధరించిన కొంతమంది షాపులోకి ప్రవేశించి హడావిడి చేశారు. ఐటీ అధికారలమంటూ.. ఫేక్ ఐడీలను చూపించి దుకాణంలోని స్టాఫ్‌ను పక్కకు కూర్చోబెట్టారు. అధికారుల లాగే స్వరం పెంచి షాపులోని బంగారం అమ్మకాల అకౌంట్ బుక్కులను చెక్ చేశారు. ట్యాక్స్ చెల్లించలేదంటూ 1.7కిలోల బంగారం బిస్కెట్లను దుండగులు తీసుకువెళ్లారు. అనుమానం వచ్చిన సిబ్బంది ఇతర షాపు ఓనర్లకు ఫోన్ చేసి కనుక్కోగా అసలు విషయం బయటపడింది. ఐటీ అధికారులు నేరుగా షాపులోకి వచ్చేయరని, ముందు నోటీసులు ఇస్తారని ఇతర షాపు యజమానులు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు సికింద్రబాద్ నుంచి ఉప్పల్ మార్గంలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి:టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..: -
రూ.6.86 కోట్ల బంగారం స్వాధీనం
కర్నూలు: ఎస్ఈబీ తనిఖీల్లో పన్ను రశీదుల్లేని రూ.6.86 కోట్ల బంగారం పట్టుబడింది. కర్నూలు శివారు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్ఈబీ సిబ్బంది గురువారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో 14.8 కిలోల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. శుక్రవారం కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ వెల్లడించిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా తాళ్లప్రొద్దుటూరుకు చెందిన రాతి మిద్దెరాజు.. తాడిపత్రి పట్టణం అంబటి పుల్లారెడ్డి జ్యువెలర్స్‌లో గుమాస్తా. ఆయన హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ గోల్డ్ షాప్‌లో 163 బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. వాటిలో 15 బిస్కెట్లను హైదరాబాద్‌లోని వేర్వేరు చోట్ల అప్పగించాడు. మిగిలిన 148 బిస్కెట్లను బ్యాగ్‌లో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో తాడిపత్రికి వెళుతున్నాడు. పన్ను చెల్లింపు బిల్లులు చూపకపోవడంతో చెక్‌పోస్టు వద్ద ఎస్ఈబీ సిబ్బంది వాటిని స్వాదీనం చేసుకున్నారు. -
పోలీస్ వేషంలో టీడీపీ నేత దోపిడీ
కావలి (నెల్లూరు): అతడో టీడీపీ నాయకుడు. బంగారం బిస్కెట్లను అక్రమంగా తరలించే ముఠాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బంగారం బిస్కెట్లు కొనేందుకు వెళ్లే వారినుంచి పోలీస్ వేషంలో నగదు దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. ఇదే తరహాలో రూ.56 లక్షలు ఎత్తుకెళ్లాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు కీలక సూత్రధారైన, నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మర్రి రవిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు రూ.36 లక్షలను రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. కావలిలో కొందరు బంగారు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా, బిల్లులు లేకుండా చెన్నైలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి కావలిలో విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వ్యాపారి బంగారం బిస్కెట్లు కొనుగోలు నిమిత్తం సీజన్ బాయ్‌కి రూ.56 లక్షలు ఇచ్చాడు. పోలీసులు, ఐటీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఇద్దరు మహిళలను తోడుగా పంపించాడు. ఆ ముగ్గురూ చెన్నై వెళ్లేందుకు బుధవారం కావలిలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. పోలీసులమంటూ కొందరు అగంతకులు ఆ ముగ్గుర్నీ అటకాయించారు. భయపెట్టి వారివద్ద ఉన్న రూ.56 లక్షలను దోచుకెళ్లారు. సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. సీజన్ బాయ్‌తోపాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మహిళల్లో ఒకరి ఫోన్ నుంచి టీడీపీ నాయకుడు మర్రి రవి ఫోన్‌కు పెద్దఎత్తున కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. మర్రి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం అతడిని వెంటబెట్టుకుని చెన్నాయపాళెం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో అతడు చూపించిన ప్రదేశాల నుంచి రూ.22 లక్షలు, కావలిలో రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.20 లక్షలు ఎక్కడ దాచాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. సూత్రధారి రవి.. పాత్రధారి మహిళ టీడీపీ నాయకుడు మర్రి రవి సెంట్రింగ్ సామగ్రిని బాడుగకు ఇచ్చే వ్యాపారంతో పాటు కూలీలతో సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేయిస్తుంటాడు. ఈ క్రమంలో భర్తకు దూరమైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా, ఆ మహిళకు చెన్నై నుంచి బిల్లులు లేకుండా బంగారం బిస్కెట్లు తీసుకొచ్చే ఒక వ్యాపారితో సంబంధాలున్నాయి. మర్రి రవితో సాన్నిహిత్యం ఏర్పడినప్పటి నుంచి అతని ఒత్తిడి మేరకు.. తరచూ బంగారం కొనేందుకు తీసుకెళ్లిన సొమ్ము పోలీసులకు పట్టుబడిందంటూ వ్యాపారికి టోకరా వేస్తుండేది. ఇలా స్కెచ్చేశాడు ఈ నేపథ్యంలో మర్రి రవి దోపిడీకి ఓ బృందాన్ని తయారు చేశాడు. బంగారం కొనేందుకు ఎవరెవరు వెళుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు. బస్సులో వెళ్తున్నారా, కారులోనా లేక రైలులో ప్రయాణిస్తున్నారా, ఏ సమయానికి ఎక్కడ ఉన్నారనే వివరాలను సదరు మహిళ ఫోన్‌ద్వారా మర్రి రవికి చేరువేస్తుండేది. దానిని బట్టి రవి వారిని వెంబడించి.. పోలీసులమని భయపెట్టి నగదు ఎత్తుకెళ్లేవాడు. ఇదే తరహాలో స్కెచ్ వేసి బుధవారం చెన్నైకు వెళ్తున్న వారినుంచి రూ.56 లక్షలు దోపిడీ చేసినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు
సాక్షి, విశాఖపట్నం: దుబాయ్ నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ1-952 దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా సోమవారం విశాఖ చేరుకుంది. దానిలో నుంచి దిగిన ఏడుగురు తమ శరీరం లోపల బంగారం బిస్కెట్లు దాచి స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. సెక్యూరిటీ విజిల్ మోగడంతో కస్టమ్స్ అధికారులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.