మర్రి రవి
కావలి (నెల్లూరు): అతడో టీడీపీ నాయకుడు. బంగారం బిస్కెట్లను అక్రమంగా తరలించే ముఠాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బంగారం బిస్కెట్లు కొనేందుకు వెళ్లే వారినుంచి పోలీస్ వేషంలో నగదు దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. ఇదే తరహాలో రూ.56 లక్షలు ఎత్తుకెళ్లాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు కీలక సూత్రధారైన, నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మర్రి రవిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు రూ.36 లక్షలను రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. కావలిలో కొందరు బంగారు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా, బిల్లులు లేకుండా చెన్నైలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి కావలిలో విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వ్యాపారి బంగారం బిస్కెట్లు కొనుగోలు నిమిత్తం సీజన్ బాయ్‌కి రూ.56 లక్షలు ఇచ్చాడు. పోలీసులు, ఐటీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఇద్దరు మహిళలను తోడుగా పంపించాడు.
ఆ ముగ్గురూ చెన్నై వెళ్లేందుకు బుధవారం కావలిలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. పోలీసులమంటూ కొందరు అగంతకులు ఆ ముగ్గుర్నీ అటకాయించారు. భయపెట్టి వారివద్ద ఉన్న రూ.56 లక్షలను దోచుకెళ్లారు. సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. సీజన్ బాయ్‌తోపాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మహిళల్లో ఒకరి ఫోన్ నుంచి టీడీపీ నాయకుడు మర్రి రవి ఫోన్‌కు పెద్దఎత్తున కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. మర్రి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం అతడిని వెంటబెట్టుకుని చెన్నాయపాళెం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో అతడు చూపించిన ప్రదేశాల నుంచి రూ.22 లక్షలు, కావలిలో రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.20 లక్షలు ఎక్కడ దాచాడనే దానిపై విచారణ జరుపుతున్నారు.
సూత్రధారి రవి.. పాత్రధారి మహిళ
టీడీపీ నాయకుడు మర్రి రవి సెంట్రింగ్ సామగ్రిని బాడుగకు ఇచ్చే వ్యాపారంతో పాటు కూలీలతో సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేయిస్తుంటాడు. ఈ క్రమంలో భర్తకు దూరమైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా, ఆ మహిళకు చెన్నై నుంచి బిల్లులు లేకుండా బంగారం బిస్కెట్లు తీసుకొచ్చే ఒక వ్యాపారితో సంబంధాలున్నాయి. మర్రి రవితో సాన్నిహిత్యం ఏర్పడినప్పటి నుంచి అతని ఒత్తిడి మేరకు.. తరచూ బంగారం కొనేందుకు తీసుకెళ్లిన సొమ్ము పోలీసులకు పట్టుబడిందంటూ వ్యాపారికి టోకరా వేస్తుండేది.
ఇలా స్కెచ్చేశాడు
ఈ నేపథ్యంలో మర్రి రవి దోపిడీకి ఓ బృందాన్ని తయారు చేశాడు. బంగారం కొనేందుకు ఎవరెవరు వెళుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు. బస్సులో వెళ్తున్నారా, కారులోనా లేక రైలులో ప్రయాణిస్తున్నారా, ఏ సమయానికి ఎక్కడ ఉన్నారనే వివరాలను సదరు మహిళ ఫోన్‌ద్వారా మర్రి రవికి చేరువేస్తుండేది. దానిని బట్టి రవి వారిని వెంబడించి.. పోలీసులమని భయపెట్టి నగదు ఎత్తుకెళ్లేవాడు. ఇదే తరహాలో స్కెచ్ వేసి బుధవారం చెన్నైకు వెళ్తున్న వారినుంచి రూ.56 లక్షలు దోపిడీ చేసినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment