Cash Robbery
-
లుధియానాలో రూ.7 కోట్ల దోపిడీ
లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులకు సేవలందించే సీఎంఎస్ సెక్యూరిటీస్ కార్యాలయం నుంచి సుమారు రూ.7 కోట్ల నగదును ఆగంతకులు ఎత్తుకుపోయారు. న్యూ రాజ్‌గురు నగర్లో ఉన్న సంస్థ ఆఫీసులోకి శనివారం అర్ధరాత్రి దాటాక సుమారు 10 మంది ముసుగులు ధరించిన దుండగులు ప్రవేశించారు. భద్రతా సిబ్బందిని తుపాకీతో బెదిరించి, గదిలో బంధించారు. వారి సెల్ఫోన్లను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ దొరికిన సుమారు రూ.7 కోట్ల నగదుతో సీఎంఎస్‌కు చెందిన వ్యానులోనే ఉడాయించారు. సీసీ టీవీ కెమెరాలను కూడా వెంట తీసుకెళ్లారు. చోరీ సమాచారం ఉదయం 7 గంటల సమయంలో పోలీసులకు అందింది. లుధియానా పోలీస్ కమిషనర్ మన్దీప్ సింగ్ సిద్ధు ఘటనాస్థలిని పరిశీలించారు. తీసుకెళ్లిన వ్యానును ముల్లన్పూర్ దాఖా వద్ద దొంగలు వదిలేసి వెళ్లారని, అందులో రెండు ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. ‘సీఎంఎస్ సంస్థ నిర్లక్ష్యం వల్లే దోపిడీ జరిగింది. లాకర్లలో భద్రపరచాల్సి ఉండగా నగదును వ్యానుల్లోనూ, కార్యాలయం గదిలోనూ అజాగ్రత్తగా వదిలేసినట్లు తేలింది. ఘటన సమయంలో సంస్థ సిబ్బందిలో ఇద్దరి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. ఎంత నగదు పోయిందనే విషయంలో బాధిత సంస్థ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఘటనలో లోపలి వ్యక్తుల ప్రమేయం పైనా దర్యాప్తు జరుపుతున్నాం’అని తెలిపారు. కేసును ఛేదించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సాయం కూడా తీసుకుంటున్నామన్నారు. -
చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం
శాంటియాగో: చిలీ రాజధాని శాంటియాగోలో వందల కోట్ల నగదును దోచుకునేందుకు సాయుధ దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అమెరికాలోని మియామి నుంచి శాంటియాగో విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న విమానంలో 32 మిలియన్ డాలర్ల (రూ.262 కోట్ల) నగదు ఉంది. బ్యాంకుల్లో పంపిణీ చేయాల్సిన ఆ నగదును ట్రక్కులోకి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, 10 మంది సాయుధ దుండగులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న దుండగులు నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో కొద్దిసేపు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు, ఒక దుండగుడు చనిపోయారు. దుండగులు వెంటనే తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన మరో రెండు వాహనాలు కనిపించాయి. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఈ భారీ దోపిడీని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నగదును తీసుకువచ్చిన లాతమ్ విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి అపాయం కలగలేదన్నారు. ఇదే శాంటియాగో ఎయిర్‌పోర్టులో గతంలో రెండుసార్లు దోపిడీ దొంగలు తెగబడి మొత్తం 25 మిలియన్ డాలర్ల నగదును ఎత్తుకెళ్లారు. -
పోలీస్ వేషంలో టీడీపీ నేత దోపిడీ
కావలి (నెల్లూరు): అతడో టీడీపీ నాయకుడు. బంగారం బిస్కెట్లను అక్రమంగా తరలించే ముఠాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బంగారం బిస్కెట్లు కొనేందుకు వెళ్లే వారినుంచి పోలీస్ వేషంలో నగదు దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. ఇదే తరహాలో రూ.56 లక్షలు ఎత్తుకెళ్లాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు కీలక సూత్రధారైన, నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మర్రి రవిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు రూ.36 లక్షలను రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. కావలిలో కొందరు బంగారు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా, బిల్లులు లేకుండా చెన్నైలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి కావలిలో విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వ్యాపారి బంగారం బిస్కెట్లు కొనుగోలు నిమిత్తం సీజన్ బాయ్‌కి రూ.56 లక్షలు ఇచ్చాడు. పోలీసులు, ఐటీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఇద్దరు మహిళలను తోడుగా పంపించాడు. ఆ ముగ్గురూ చెన్నై వెళ్లేందుకు బుధవారం కావలిలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. పోలీసులమంటూ కొందరు అగంతకులు ఆ ముగ్గుర్నీ అటకాయించారు. భయపెట్టి వారివద్ద ఉన్న రూ.56 లక్షలను దోచుకెళ్లారు. సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. సీజన్ బాయ్‌తోపాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మహిళల్లో ఒకరి ఫోన్ నుంచి టీడీపీ నాయకుడు మర్రి రవి ఫోన్‌కు పెద్దఎత్తున కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. మర్రి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం అతడిని వెంటబెట్టుకుని చెన్నాయపాళెం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో అతడు చూపించిన ప్రదేశాల నుంచి రూ.22 లక్షలు, కావలిలో రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.20 లక్షలు ఎక్కడ దాచాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. సూత్రధారి రవి.. పాత్రధారి మహిళ టీడీపీ నాయకుడు మర్రి రవి సెంట్రింగ్ సామగ్రిని బాడుగకు ఇచ్చే వ్యాపారంతో పాటు కూలీలతో సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేయిస్తుంటాడు. ఈ క్రమంలో భర్తకు దూరమైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా, ఆ మహిళకు చెన్నై నుంచి బిల్లులు లేకుండా బంగారం బిస్కెట్లు తీసుకొచ్చే ఒక వ్యాపారితో సంబంధాలున్నాయి. మర్రి రవితో సాన్నిహిత్యం ఏర్పడినప్పటి నుంచి అతని ఒత్తిడి మేరకు.. తరచూ బంగారం కొనేందుకు తీసుకెళ్లిన సొమ్ము పోలీసులకు పట్టుబడిందంటూ వ్యాపారికి టోకరా వేస్తుండేది. ఇలా స్కెచ్చేశాడు ఈ నేపథ్యంలో మర్రి రవి దోపిడీకి ఓ బృందాన్ని తయారు చేశాడు. బంగారం కొనేందుకు ఎవరెవరు వెళుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు. బస్సులో వెళ్తున్నారా, కారులోనా లేక రైలులో ప్రయాణిస్తున్నారా, ఏ సమయానికి ఎక్కడ ఉన్నారనే వివరాలను సదరు మహిళ ఫోన్‌ద్వారా మర్రి రవికి చేరువేస్తుండేది. దానిని బట్టి రవి వారిని వెంబడించి.. పోలీసులమని భయపెట్టి నగదు ఎత్తుకెళ్లేవాడు. ఇదే తరహాలో స్కెచ్ వేసి బుధవారం చెన్నైకు వెళ్తున్న వారినుంచి రూ.56 లక్షలు దోపిడీ చేసినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బ్యాంకు ఎదుట దోపిడీ యత్నం
ఆంధ్ర యువకుడికి దేహశుద్ధి వేలూరు: గుడియాత్తంలో బ్యాంకు ఆవరణలో రైతు వద్ద నగదు దోపిడీకి యత్నించిన ఆంధ్ర యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపం కల్లపాడికి చెందిన రైతు కార్తికేయన్. ఇతడు బంగారు నగలను కుదవ పెట్టి నగదు తీసుకునేందుకు గుడియాత్తంలోని ఇండియన్ బ్యాంకుకు గురువారం బైక్‌పై వెళ్లాడు. బ్యాంకులో రూ.55వేలు నగదు తీసుకొని బైక్‌పై పెట్టుకొని ఇంటికి బయలు దేరాడు. దీన్ని గమనించిన ఓ యువకుడు నగదు ఉన్న సంచిని లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. కార్తికేయన్ కేకలు వేయడంతో అక్కడున్న వారు అప్రమత్తమై యువకుడిని పట్టుకొని నగదు సంచిని కార్తికేయన్‌కు అప్పగించారు. యువకుడిని సమీపంలోని విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి జరిపి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో సదరు యువకుడు ఆంధ్ర రాష్ట్రం విజయవాడలోని ఆటోనగర్‌కు చెందిన శ్రీనివాసన్ అని, పెయింటింగ్ పనుల కోసం గుడియాత్తం వచ్చినట్లు తెలిసింది. అతని వద్ద పోలీసులు విచారణ చేస్తున్నారు. -
హిజ్రాభవన్లో 2 కిలోల బంగారం, నగదు చోరీ!
⇒ చుడీబజార్‌లో పట్టపగలే దోపిడీ ⇒ లబోదిబోమంటున్న హిజ్రాలు హైదరాబాద్: పెళ్లిళ్లు... పేరంటాలు... దుకాణాలు తిరిగి హిజ్రాలు కూడబెట్టుకున్న సొత్తును దుండగులు దోచుకెళ్లారు. పట్టపగలే చుడీబజార్లోని హిజ్రా భవన్‌లోకి చొరబడి దాదాపు రెండు కిలోల బంగారం, పెద్దమొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని 25 మంది హిజ్రాలు తాము రోజూ సంపాదించే డబ్బులు, బంగారం హిజ్రాభవన్లో నివసించే వారి నాయకురాలు జ్యోతినాయక్ (చౌదరి) వద్ద దాచుకుంటారు. ఈ భవనంలో కొందరు హిజ్రాలు కూడా నివాసముంటున్నారు. వీరు దాచుకున్న సొత్తుపై కన్నేసిన దుండగులు... భవనంలో ఎవరూ లేని సమయం చూసి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలు, పెట్టెలు, కప్‌బోర్డుల్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని ఉడాయించారు. ఈ మేరకు హిజ్రాలు షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాము కష్టపడి దాచుకున్నదంతా దోచుకెళ్లారంటా లబోదిబోమన్నారు. గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు, ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అంతా అయోమయం... ఈ ఘటనలో ఎంత బంగారం చోరీ అయిందన్నది హిజ్రాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ముందు 5కిలోల బంగారం, రూ.50 లక్షల నగదు పోయిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు సోదా చేస్తున్న క్రమంలో 2 కిలోల బంగారం దోచుకెళ్లారన్నారు. వివరాలు సేకరిస్తున్నాం... చోరీకి గురైన బంగారంలో అసలెంతో... నకిలీ ఎంతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. హిజ్రాభవన్ను పరిశీలించిన ఆయన... హిజ్రాలు రోజూ తిరుగుతూ జమ చేసుకునే ఆభరణాలు చోరీకి గురికావడం విచారకరమన్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకుని, సొత్తును వారికి అప్పగిస్తామన్నారు. వాస్తవంగా ఎంత బంగారం, నగదు చోరీ అయ్యాయో లెక్క తేలాల్సి ఉందన్నారు. -
కవ్వించి... కత్తితో బెదిరించి
♦ నగదు అపహరించిన దుండగులు ♦ కటకటాల్లోకి ముగ్గురు మహిళలు, యువకుడు నిజామాబాద్ కైం : కవ్వించి, కత్తితో బెదిరించి నగదు దోచుకున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఒకటవ టౌన్ ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. లింగంపేట్ మండలం లింగంపల్లికి చెందిన మన్నే బాబయ్య బుధవారం కుల సంఘం పని నిమిత్తం నిజామాబాద్‌కు వచ్చాడు. పని పూర్తయ్యాక తిరిగి రాత్రి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌లోని కామారెడ్డి బస్టాప్ వద్ద వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో నగరంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మహిళలు డొక్క రాణి, డొక్క సరస్వతి, సాదుల స్వప్న, బాబయ్యకు సైగలు చేసి బస్టాండ్ వెనుక రైల్వే కాంపౌండ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ రాణి భర్త యుగంధర్ తోడయ్యాడు. నలుగురు కలిసి బాబయ్యను కత్తితో బెదిరించి అతని వద్దనున్న రూ.1600 తీసుకొని, పరారయ్యారు. బాధితుడు అర్ధరాత్రి ఒకటో టౌన్ ఠాణాకు వచ్చి జరిగిన ఫిర్యాదు చేశాడు.పోలీసులు గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో బాబయ్యను తీసుకుని బస్టాండ్ వద్దకు వచ్చారు. అక్కడ నలుగురు మరికొంత మందిని మోసం చేసేందుకు తిరుగుతుండటంతో బాబయ్యను వారిని గుర్తు పట్టాడు. పోలీసులు వారిని అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. వారి నుంచి కత్తిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. -
అయ్యో పాపం.. లాయర్ కుటుంబాన్ని దోచేశారు!
ముజఫర్ నగర్: పట్టపగలే దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. లాయర్ కుటుంబాన్ని నిలువుదోపిడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మథురకు చెందిన లాయర్ మన్మోహన్ శర్మ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై వెళ్తుండగా నలుగురు గుర్తుతెలియని దుండగులు వారి కారును అడ్డగించారు. ఈ విషయాలపై మండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మథుర నుంచి హరిద్వార్ కు వెళ్తుండగా అడ్డగించారని, అనంతరం తమ వద్ద ఉన్న నగదు, బంగారం, విలువైన అన్ని వస్తువులను దోచుకున్నారని తన ఫిర్యాదులో లాయర్ శర్మ పేర్కొన్నారు. చివరికి కారు కూడా తమకు దక్కకుండా చేసి, అందులో పరారయ్యారని తెలిపారు. వర్మఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ సంతోష్ కుమార్ వివరించారు. -
ఏటీఎంలో రూ. 12 లక్షలు మాయం
సేలం : ఏటీఎంలో నగదు మాయం సంఘటన ఓ ప్రైవేటు బ్యాంక్ వర్గాల్లో కలకలం రేపింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు 24 గంటల్లో నిందితుడ్ని అరెస్టు చేశాయి. నామక్కల్ జిల్లా తిరుచంగోడు-సేలం రోడ్డులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం ఉంది. ఇక్కడ సోమవారం మధ్యాహ్నం నగదు నింపడానికి సిబ్బంది వచ్చారు. ఏటీఎంలో ఉన్న నగదు వివరాల్ని సేకరించగా అందులో రూ. 12 లక్షల డబ్బు తగ్గి ఉండడం సిబ్బంది గమనించారు. దీంతో అనుమానం చెందిన వారు తిరుచంగోడు డీఎస్పీ విష్ణు ప్రియకు ఫిర్యాదు చేశారు. తిరుచంగోడు ఇన్స్పెక్టర్ కుల శేఖరన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తనిఖీలను ముమ్మరం చేసింది. నిందితుణ్ని వెంటాడి పట్టుకున్న పోలీసులు సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి బ్యాంక్ పరిసరాల్లో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. పోలీసుల్ని చూసి ఆ వ్యక్తి ఉడాయించాడు. అతడ్ని సినీ ఫక్కీలో వెంటాడి పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా శాలపురం గ్రామానికి చెందిన ప్రభాకరన్ అని తేలింది. గతంలో ఇతను సదరు బ్యాంక్ ఏటీఎంలకు నగదు ఫిల్లింగ్ చేసినట్లు, ఆ సమయంలో రూ. యాభై వేలు డబ్బును దొంగలించడంతో సస్పెండ్ అయినట్లు తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించడంతో అస్సలు బండారం బయట పడింది. అత్యాశతో దొరికిపోయాడు సోమవారం వేకువ జామున నాలుగున్నర గంటల సమయంలో ఏటీఎం వాచ్‌మన్ టీ తాగేందుకు వె ళ్లడాన్ని అదునుగా తీసుకుని ప్రభాకరన్ ఏటీఎంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాను పనిచేయకుండా చేసి, తన వద్దనున్న సీక్రెట్ పాస్వర్డ ఆధారంగా ఏటీఎం లాకర్ తెరిచి అందులో ఉన్న రూ. 12,23,0100 డబ్బు తీసుకుని ఉడాయించాడు. అత్యాశతో ఏటీఎంలో మిగిలిన డబ్బును దొంగలించడానికి మళ్లీ రాత్రి వచ్చాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేసి కట కటాల్లోకి తరలించారు. అతడి వద్ద నుంచి దొంగలించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసు చేధించిన పోలీసుల్ని జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ అభినందించారు. -
తుపాకీతో బెదిరించి రూ. 46 లక్షల నగలు, నగదు లూటీ
బెంగళూరు: నగరంలో రివాల్వర్‌తో బెదిరించి రూ. 40 లక్షల విలువైన నగలు, రూ. ఆరు లక్షల నగదు లూటీ చేసిన సంఘటన ఇక్కడి హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... శనివారం సాయంత్రం ఇక్కడి నగర్తపేటలో రోహిణి డైమండ్స్ యజమాని రూ. 40 లక్షల విలువైన ఆభరణాలు, 6 లక్షల నగదు తీసుకుని స్కూటర్లో బయలుదేరారు. నగర్త పేట సమీపంలో ముగ్గురు దుండగులు వాహనాన్ని అడ్డగించారు. అన ంతరం రివాల్వర్‌తో బెదిరించి బంగారు, నగదుతో ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కారు అద్దం పగులగొట్టి బంగారం, నగదు చోరీ
ఏలూరు : వివాహ వేదిక వద్ద నిలిపివుం చిన కారు అద్దాన్ని పగులగొట్టి 23 కాసుల బంగారం, రూ.15 వేల నగదు అపహరించుకుపోయిన ఘటన కొయ్యలగూడెంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలవరం సీఐ జీఆర్ఆర్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వట్టికూటి ప్రవీణ్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కొయ్యల గూడెంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగిన బంధువుల వివాహానికి కారులో వచ్చారు. తొలుత నల్లజర్లలో ఓ వివాహానికి హాజరై అనంతరం కొయ్యల గూడెంలో చేరుకున్నారు. ఆ సందర్భంలో ప్రవీణ్‌కుమార్ భార్య, అతని తల్లి, కుటుంబ సభ్యులు తాము ధరిం చిన ఆభరణాలను తీసి వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లలో ఉంచారు. ఆ బ్యాగ్‌లను కల్యాణ మండపం ఎదురుగా పార్క్ చేసిన తమ కారులో ఉంచి డోర్ లాక్‌చేసి వివాహానికి హాజరయ్యూరు. అర్ధరాత్రి ఒంటిగంటకు కల్యాణ మం డపం నుంచి బయటకు వచ్చిన ప్రవీ ణ్‌కుమార్, అతని కుటుంబ సభ్యులు కారు వెనుక అద్దం పగిలిపోయి ఉండటాన్ని గుర్తించారు. కారులోని ఐదు బ్యాగ్‌లు కనపడకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అక్కడకు సమీపంలోని ప్రకాశం, వీఎస్ఎన్ కళాశాలల మధ్యగల జామాయిల్ తోటలో ఆ బ్యాగులు కనిపించాయి. వాటిలోని దుస్తులు, సామగ్రి చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. వాటిలో పెట్టిన 23 కాసుల బంగారు ఆభరణాలు, రూ.15వేల నగదు కనిపించలేదు. వివాహ వేదిక వద్ద ఖరీదైన కార్లు అనే కం ఉన్నప్పటికీ దొంగలు ఆ కారునే ఎంచుకోవడాన్ని చూస్తే నల్లజర్ల నుంచే ఆ కారును వెంబడించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కారు అద్దాలకు ఫిల్మ్ లేకపోవడంతో అందులోని బ్యాగ్‌లు బయటకు కనిపిస్తున్నాయని, దీంతో దుండగులు కారు అద్దాలను పగుల గొట్టి చోరీకి పాల్పడి ఉంటారని బాధితులు పేర్కొంటున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ జీఆర్ఆర్ మోహన్ పరిశీలించారు. స్థానికులే చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఏలూరు నుంచి క్లూస్‌టీం సభ్యులు రంగంలోకి దిగారు. ఎస్సై ఎస్ఆర్ఆర్ గంగాధర్ కేసు నమోదు చేశారు.