హిజ్రాభవన్‌లో 2 కిలోల బంగారం, నగదు చోరీ!
⇒ చుడీబజార్‌లో పట్టపగలే దోపిడీ
⇒ లబోదిబోమంటున్న హిజ్రాలు
హైదరాబాద్: పెళ్లిళ్లు... పేరంటాలు... దుకాణాలు తిరిగి హిజ్రాలు కూడబెట్టుకున్న సొత్తును దుండగులు దోచుకెళ్లారు. పట్టపగలే చుడీబజార్‌లోని హిజ్రా భవన్‌లోకి చొరబడి దాదాపు రెండు కిలోల బంగారం, పెద్దమొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని 25 మంది హిజ్రాలు తాము రోజూ సంపాదించే డబ్బులు, బంగారం హిజ్రాభవన్‌లో నివసించే వారి నాయకురాలు జ్యోతినాయక్ (చౌదరి) వద్ద దాచుకుంటారు.
ఈ భవనంలో కొందరు హిజ్రాలు కూడా నివాసముంటున్నారు. వీరు దాచుకున్న సొత్తుపై కన్నేసిన దుండగులు... భవనంలో ఎవరూ లేని సమయం చూసి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలు, పెట్టెలు, కప్‌బోర్డుల్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని ఉడాయించారు. ఈ మేరకు హిజ్రాలు షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాము కష్టపడి దాచుకున్నదంతా దోచుకెళ్లారంటా లబోదిబోమన్నారు. గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు, ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.
అంతా అయోమయం...
ఈ ఘటనలో ఎంత బంగారం చోరీ అయిందన్నది హిజ్రాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ముందు 5కిలోల బంగారం, రూ.50 లక్షల నగదు పోయిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు సోదా చేస్తున్న క్రమంలో 2 కిలోల బంగారం దోచుకెళ్లారన్నారు.
వివరాలు సేకరిస్తున్నాం...
చోరీకి గురైన బంగారంలో అసలెంతో... నకిలీ ఎంతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. హిజ్రాభవన్‌ను పరిశీలించిన ఆయన... హిజ్రాలు రోజూ తిరుగుతూ జమ చేసుకునే ఆభరణాలు చోరీకి గురికావడం విచారకరమన్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకుని, సొత్తును వారికి అప్పగిస్తామన్నారు. వాస్తవంగా ఎంత బంగారం, నగదు చోరీ అయ్యాయో లెక్క తేలాల్సి ఉందన్నారు.