ఏటీఎంలో రూ. 12 లక్షలు మాయం
సేలం : ఏటీఎంలో నగదు మాయం సంఘటన ఓ ప్రైవేటు బ్యాంక్ వర్గాల్లో కలకలం రేపింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు 24 గంటల్లో నిందితుడ్ని అరెస్టు చేశాయి. నామక్కల్ జిల్లా తిరుచంగోడు-సేలం రోడ్డులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం ఉంది. ఇక్కడ సోమవారం మధ్యాహ్నం నగదు నింపడానికి సిబ్బంది వచ్చారు. ఏటీఎంలో ఉన్న నగదు వివరాల్ని సేకరించగా అందులో రూ. 12 లక్షల డబ్బు తగ్గి ఉండడం సిబ్బంది గమనించారు. దీంతో అనుమానం చెందిన వారు తిరుచంగోడు డీఎస్పీ విష్ణు ప్రియకు ఫిర్యాదు చేశారు. తిరుచంగోడు ఇన్‌స్పెక్టర్ కుల శేఖరన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తనిఖీలను ముమ్మరం చేసింది.
నిందితుణ్ని వెంటాడి పట్టుకున్న పోలీసులు
సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి బ్యాంక్ పరిసరాల్లో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. పోలీసుల్ని చూసి ఆ వ్యక్తి ఉడాయించాడు. అతడ్ని సినీ ఫక్కీలో వెంటాడి పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా శాలపురం గ్రామానికి చెందిన ప్రభాకరన్ అని తేలింది. గతంలో ఇతను సదరు బ్యాంక్ ఏటీఎంలకు నగదు ఫిల్లింగ్ చేసినట్లు, ఆ సమయంలో రూ. యాభై వేలు డబ్బును దొంగలించడంతో సస్పెండ్ అయినట్లు తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించడంతో అస్సలు బండారం బయట పడింది.
అత్యాశతో దొరికిపోయాడు
సోమవారం వేకువ జామున నాలుగున్నర గంటల సమయంలో ఏటీఎం వాచ్‌మన్ టీ తాగేందుకు వె ళ్లడాన్ని అదునుగా తీసుకుని ప్రభాకరన్ ఏటీఎంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాను పనిచేయకుండా చేసి, తన వద్దనున్న సీక్రెట్ పాస్‌వర్‌డ ఆధారంగా ఏటీఎం లాకర్ తెరిచి అందులో ఉన్న రూ. 12,23,0100 డబ్బు తీసుకుని ఉడాయించాడు. అత్యాశతో ఏటీఎంలో మిగిలిన డబ్బును దొంగలించడానికి మళ్లీ రాత్రి వచ్చాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేసి కట కటాల్లోకి తరలించారు. అతడి వద్ద నుంచి దొంగలించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసు చేధించిన పోలీసుల్ని జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ అభినందించారు.