అడ్డుగా ఉన్నాడని అంతం చేయించింది! | Murder of the husband in the background of the fornication | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉన్నాడని అంతం చేయించింది!

Published Wed, Apr 11 2018 2:51 AM | Last Updated on Wed, Apr 11 2018 9:14 AM

Murder of the husband in the background of the fornication - Sakshi

ఎండీ ఖాజాతో సలేహా బేగం (ఫైల్‌)

హైదరాబాద్‌: ప్రియుడి వ్యామోహంలో పడిన భార్య అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని భావించింది. ఈ ‘బాధ్యతల్ని’ తీసుకున్న ప్రియుడు ఓ పాత నేరగాడికి రూ.2 లక్షలకు సుపారీ ఇచ్చాడు. రైలు పట్టాల వద్ద హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరోవైపు తన భర్త కనిపించట్లేదంటూ ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లి రైల్వే పోలీస్‌స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా, ఎస్సార్‌నగర్‌ ఠాణాలో అదృశ్యంగా నమోదైన ఈ కేసుల్ని సనత్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించి ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు బాలానగర్‌ డీసీపీ సాయిశేఖర్‌ మంగళవారం వెల్లడించారు. 

భర్తే అడ్డుగా మారాడని భావించి.. 
బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన ఎండీ ఖాజా(46)కు అదే ప్రాంతానికి చెందిన సలేహా బేగం(26)తో 2007లో వివాహమైంది. వీరికి నవాజ్‌(9), లతీఫ్‌(7) కుమారులున్నారు. సమీపంలోని ఓ మాంసం దుకాణంలో పనిచేసే ఎండీ తబ్రేజ్‌ఖురేషీ(33)తో సలేహాకు కొన్నాళ్ల క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలిసిన ఖాజా అనేకసార్లు భార్యను మందలించ డంతో పాటు తబ్రేజ్‌తోనూ గొడవపడ్డాడు. ఈ పరిణామాలతో భర్తే అడ్డుగా మారుతున్నాడని భావించిన సలేహా.. అతడిని అంతం చేయా లని ఖురేషీతో చెప్పింది. దీనికోసం ఇతగాడు బోరబండ సఫ్దర్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు సయ్యద్‌ ముజీబ్‌ను సంప్రదించాడు. ఖాజాను చంపేస్తే రూ.2 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం కుదుర్చుకుని రూ.30 వేలు అడ్వా న్స్‌ ఇచ్చాడు. రంగంలోకి దిగిన ముజీబ్‌.. ఖాజా తరచూ వెళ్లే మద్యం దుకాణాలకే వెళ్తూ స్నేహం చేశాడు. దీంతో వీరిద్దరూ కలసి మద్యం తాగడం మొదలైంది. 

హత్యచేసిన ప్రాంతంలో రక్తం 

మరో ముగ్గురితో రంగంలోకి దిగి.. 
ఖాజాను హత్య చేయాలని నిర్ణయించుకున్న ముజీబ్‌ అందుకు సహకరించడానికి బోరబండకు చెందిన ఎండీ అయాజ్, ఎర్రగడ్డకు చెందిన మీర్జా అక్బర్‌ బేగ్, బోరబండ సైట్‌ 3 అంబేడ్కర్‌నగర్‌కు చెందిన షేక్‌ జహీర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఫిబ్రవరి 20న  మాదాపూర్‌లోని ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ముజీబ్, ఖాజా.. అక్కడ మద్యం ఖరీదు చేసి, పర్మిట్‌రూమ్‌లో కూర్చుని తాగారు. తిరిగి వస్తూ మద్యం, బీరు ఖరీదు చేశారు. సమీ పంలో వేచి ఉన్న రియాజ్, అక్బర్, జహీర్‌ వీరిని అనుసరించారు. రాత్రి 9.40 సమయంలో బోరబండ వివేకానందనగర్‌ కమాన్‌ వద్ద ఆగిన ముజీబ్, ఖాజా తమ వెంట ఉన్న మద్యం తాగాలని భావించారు. ఇక్కడైతే పోలీసుల కంటపడతామని చెప్పిన ముజీబ్‌.. ఖాజాను సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు తీసుకువెళ్లి ఎక్కువ మద్యం తాగేలా చేశాడు. 

చంపేసి రైలు పట్టాలపై పడేసి.. 
ఖాజా మద్యం మత్తులోకి జారుకోవడంతో మిగిలిన ముగ్గురినీ పిలిచిన ముజీబ్‌.. వారితో కలసి బండరాయితో ఖాజాను చంపేసి.. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ముఖాన్ని నుజ్జునుజ్జు చేశారు. మద్యం మత్తులో పట్టాలు దాటుతూ రైలు ఢీ కొట్టడంతో చనిపోయినట్లు చిత్రీకరించడానికి మృతదేహాన్ని పట్టాలపై పడేశారు. రైళ్ల రాకపోకల ధాటికి మృతదేహం ఛిద్రమైంది. బోరబండ–హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్ల మధ్య ఓ మృతదేహం పడి ఉన్నట్లు ఓ మహిళ ఫిబ్రవరి 21న నాంపల్లి రైల్వే పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చింది. ఘటనాస్థలికి వచ్చిన రైల్వే పోలీసులు ఇది ప్రమాదంగా భావించినా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇది జరిగిన తర్వాత ఓ వారం పాటు భర్త కోసం గాలిస్తున్నట్లు నటించిన సలేహా.. ఆపై ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. 

అనుమానం పుట్టించిన గాయాలు.. 
మృతదేహానికి పంచనామా నిర్వహించిన రైల్వే పోలీసులు పోస్టుమార్టం సైతం చేయించారు. హతుడి తలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గాయాలు ఉన్నట్లు ఈ నివేదికలు స్పష్టం చేశాయి. అనుమానం వచ్చిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించగా.. మృతదేహం లభించిన ప్రాంతానికి సమీపంలో ట్రాక్‌ పక్కన రక్తపు మడుగు, ఇతర ఆధారాలను గుర్తించి హత్యగా తేల్చారు. మిస్సింగ్‌ కేసు వీరి దృష్టికి రావడంతో హతుడు ఖాజాగా గుర్తించారు. మృతదేహం లభించిన ప్రాంతం సనత్‌నగర్‌ ఠాణా పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. సనత్‌నగర్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం సాలేహా పాత్రను అనుమానించారు. ఆమె కాల్‌ డిటేల్స్‌లో ఖాజా తర్వాత ఎక్కువగా తబ్రేజ్‌తో మాట్లాడినట్లు తేలింది. 

లోతుగా ఆరా తీయగా.. 
ఖాజా హత్య జరిగిన రోజు వీరిలో ఎవరెవరు? ఎక్కడెక్కడ ఉన్నారు? అనే వివరాలు ఆరా తీశారు. తబ్రేజ్‌ ఎక్కువగా ముజీబ్‌తో ఫోన్‌లో సంప్రదించడం.. ముజీ బ్‌ హత్యాస్థలంలో ఉన్నట్లు అతడి సెల్‌ఫోన్‌ డిటేల్స్‌ బయటపెట్టడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు కొలిక్కి రావడంతో మిగిలిన ముగ్గురు నిందితుల్నీ పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన బాలానగర్‌ ఏసీపీ గోవర్ధన్, సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డిలను డీసీపీ అభినందించారు. ఖాజా ఇంటి ఎదురుగానే అతడి భార్య సలేహా తల్లిదండ్రులు నివసిస్తుంటారు. తండ్రి హత్యకు గురికావ డం, తల్లి జైలుకెళ్లడంతో వీరి కుమారులు నవాజ్, లతీఫ్‌లను వారికి అప్పగించారు.

వివరాలు వెల్లడిస్తున్న బాలానగర్‌ డీసీపీ సాయిశేఖర్‌. చిత్రంలో నిందితులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement