శివసాగర్(అస్సాం): పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక ఉద్యమకారుడు, సమాచార హక్కు చట్టం కార్యకర్త అఖిల్ గొగోయ్(46) జైల్లో ఉంటూ అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తొలినేతగా గుర్తింపు పొందారు. ఆయన శివసాగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి సురభీ రాజ్‌కొన్వారీపై 11,875 ఓట్ల తేడాతో నెగ్గడం విశేషం. దేశద్రోహం ఆరోపణలతో 2019 డిసెంబర్‌లో అఖిల్ గొగోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉంటున్నారు.
రాయ్‌జోర్ దళ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 57,219 ఓట్లు సాధించారు. పోలైన మొత్తంలో ఓట్లలో 46.06 ఓట్లు దక్కించుకోవడం గమనార్హం. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ తొలుత అఖిల్‌కి మద్దతు ప్రకటించింది. పార్టీ టికెట్‌ను మాత్రం శుభ్రమిత్ర గొగోయ్‌కు కేటాయించింది. శుభ్రమిత్ర మూడో స్థానంలో నిలిచారు.
జైలు నుంచి బహిరంగ లేఖలు
అఖిల్ జైల్లో ఉంటూనే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. తరచుగా అస్సాం ప్రజలకు బహిరంగ లేఖలు రాశారు. ప్రజా సమస్యలను లేవనెత్తేవారు. ఆయన తల్లి ప్రియద 85 ఏళ్ల వృద్ధురాలు. కుమారుడి గెలుపు కోసం శివసాగర్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు.
ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేధా పాట్కర్, సందీప్ పాండే అఖిల్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. వందలాది మంది రాయ్‌జోర్ దళ్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు. అఖిల్ గొగోయ్‌ను గెలిపించాలని కోరారు. ఆయన చేతిలో డబ్బులేవీ లేవు. రూ.60,497 బ్యాంకు డిపాజిట్లు మాత్రమే ఉన్నాయి. అఖిల్ గొగోయ్ గౌహతిలోని కాటన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1995–96లో కాటన్ కాలేజీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment