
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరిగిన నిరసనల్లో విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణలపై గత జనవరిలో అదుపులోకి తీసుకున్న పిల్లల వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్ భార్య షబీస్టా ఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జైలులో ఉన్న భర్తను కలిసిన అనంతరం ఆయన భద్రతపై ఆమె అనేక సందేహాలు వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహాని వుందని ఆందోళన వ్యక్తం చేస్తూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తన భర్త జైలుల్లోపల మానసిక వేధింపులకు గురవుతున్నారని, ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచివుందని పేర్కొన్నారు. జైలుకు తీసుకువచ్చిన ఐదు రోజుల పాటు ఆహారం కూడా ఇవ్వకుండా చాలా అమానవీయంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అంతేకాదు జైలు లోపలే తన భర్తను హత్య చేసే ప్రమాదం వుందని, తన భర్తకు భద్రత కల్పించాని విజ్ఞప్తి చేస్తూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాగే యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ హోమ్, యూపీ డీజీ( జైలు)కు కూడా తన లేఖను అందించారు.
కాగా 2017లో ప్రభుత్వ ఆస్పత్రిలో 60మంది చిన్నారులు ఆక్సిజన్ కొరతతో మృతిచెందిన ఘటనలో అరెస్టయి నిర్దోషిగా బయటపడ్డ డాక్టర్ కఫీల్ ఖాన్‌ను గతేడాది (డిసెంబర్ 12న) అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) లో సీఏఏ పై రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రజా భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) ప్రయోగించిన అనంతరం మధుర జైలుకు తరలించారు. గత వారం, ఖాన్ మామ నుస్రుల్లా అహ్మద్ వార్సీని రాజ్‌ఘాట్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులుకాల్చి చంపారు. 2018 లో ఖాన్ సోదరుడిపై హత్యా యత్నం జరిగింది. కాని అతను ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment