
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నేవీ అధికారులకు యువతులను ఎరవేసి సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు పన్నిన హనీ ట్రాప్ వెనుక పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్ల కుట్ర దాగి ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఇమ్రాన్ యాకూబ్‌పై విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. భారత రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకుని నావికాదళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా దేశ సైనిక రహస్యాలను తెలుసుకోడానికి పాకిస్తాన్ నిఘా అధికారులు పన్నిన కుట్రను 2019లో కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టి దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. దీనిపై 2019 నవంబర్ 16న విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
గూఢచర్యం ద్వారా దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించగా 2019 డిసెంబర్ 12న కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్‌తో వ్యాపార సంబంధాలున్న ముగ్గురు పౌరులతో పాటు 11 మంది నావికాదళ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ వారిని అరెస్ట్ చేసింది. వారిపై 2020 జూన్ 15న ఎన్‌ఐఏ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అనంతర దర్యాప్తులో గుజరాత్‌లోని గోద్రాకు చెందిన యాకూబ్ ఇమ్రాన్‌కు పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు.
నావికాదళ రహస్యాలు, సమాచారం సేకరించేందుకు పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్ల సూచనల మేరకు ఇమ్రాన్ యాకూబ్ నేవీ అధికారుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్టు ఆధారాలు సేకరించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇమ్రాన్ చట్టవిరుద్ధంగా వస్త్ర వ్యాపారం పేరుతో నిధులను సమీకరించినట్టు ఎన్‌ఐఏ దర్యాప్తులో రుజువైంది. ఈ విషయాలతో అతడిపై అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment