Navy Officials
-
దౌత్య విజయం
అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా సాగించిన వివిధ దౌత్యయత్నాలు ఫలప్రదమయ్యాయి. భారత ప్రధానికీ, ఖతార్ అమీర్‌కూ మధ్య నిరుడు సాగిన సమావేశం ఫలించింది. మరణశిక్ష పడ్డ 8 మంది నౌకాదళ సీనియర్ సిబ్బందిని ఖతార్ ఎట్టకేలకు విడుదల చేసింది. వారిలో ఏడుగురు సోమ \వారం స్వదేశానికి చేరుకోగా, ఎనిమిదో వ్యక్తిని సైతం సాధ్యమైనంత త్వరగా భారత్ రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏణ్ణర్ధం పైగా అక్కడి జైలులో మగ్గుతూ, మరణదండనతో మృత్యుముఖం దాకా వెళ్ళి, చివరకు అన్ని అభియోగాల నుంచి విముక్తమై వారు తిరిగి రావడం అసాధారణం. ఇది భారత దౌత్య విజయం. బుధవారం ఖతార్‌లో భారత ప్రధాని మోదీ పర్యటించనున్న వేళ వెలువడ్డ ఈ ప్రకటన విశేషమైనది. అంతర్జాతీయంగా మన దేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యానికీ, అరబ్ దేశాలతో మనం నెరపుతున్న స్నేహసంబంధాల సాఫల్యానికీ ఇది ఓ మచ్చుతునక. జరిగిన కథలోకి వెళితే, విడుదలైన ఈ 8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బంది ఇజ్రాయెల్ పక్షాన గూఢచర్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినవచ్చాయి. అందులో నిజం లేదంటూ, వారిని విడుదల చేయాలని భారత్ ప్రయత్నిస్తూ వచ్చింది. గత ఏడాది కాలంగా భారత విదేశాంగ శాఖ అజెండాలో ఓ ప్రధానాంశం – ఈ నౌకాదళ మాజీ అధికారుల విడుదల. అందుకు తగ్గట్టే మంత్రిత్వ శాఖలో సంబంధిత విభాగం, అలాగే ఖతార్‌లోని భారత దౌత్య కార్యాలయం నిర్విరా మంగా శ్రమించాయి. ప్రచారానికి దూరంగా తమ పని తాము చేస్తూ, చివరకు ఆశించిన ఫలితాన్ని సాధించాయి. విదేశాంగ శాఖ గల్ఫ్ డివిజన్‌కు మునుపు సారథ్యం వహించిన విపుల్ గత ఏడాది ఖతార్‌కు వెళ్ళి, ఆ దేశంలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టడం సైతం కలిసొచ్చింది. ఆయన సంబంధిత వర్గాలన్నిటితో మాట్లాడి, ఒప్పించగలిగారు. అదే సమయంలో, జాతీయ భద్రతా సల హాదారైన అజిత్ దోవల్ సారథ్యంలోని జాతీయ భద్రతా మండలి సచివాలయం సైతం ఖతార్ రాజ ధాని దోహాలోని తన సన్నిహితులతో మంతనాలు సాగించింది. ఓర్పుగా, నేర్పుగా వ్యవహారం నడి పిస్తూ, మన మాజీ అధికారులు విడుదలై, తిరిగివచ్చేవరకు కథను గుట్టుగా నడిపించడం విశేషం. అసలు ఈ వివాదం ఏణ్ణర్ధం క్రితం మొదలైంది. 2022 ఆగస్ట్ 30న ఈ 8 మందిని అరెస్ట్ చేసి, ఏకాంతవాస శిక్ష విధించారు. ఖైదీలుగా ఉన్న మనవాళ్ళను ఆ ఏడాది అక్టోబర్ మొదట్లోనే భారత దౌత్య సిబ్బంది కలిశారు. నిజానికి, అరెస్టయినవారిలో అధికులు దహ్రా గ్లోబల్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు పనిచేస్తూ వచ్చారు. ఖతారీ నౌకాదళంలో ఇటాలియన్ యూ212 రహస్య జలాంతర్గాముల్ని ప్రవేశపెట్టడంలో సాయపడేందుకు వారు ఖతార్‌కు వచ్చారన్నది కథనం. జైల్లో పడ్డ తమ సిబ్బందికి సాయం చేసేందుకు సదరు ప్రైవేట్ సంస్థ సీఈఓ సైతం ప్రయత్నించక పోలేదు. కానీ, ఆయనా జైల్లో పడి, రెండు నెలలు ఒంటరి చెరను అనుభవించి, అనంతరం జామీను మీద బయటపడాల్సి వచ్చింది. గడచిన 2023 మార్చి వచ్చేసరికి మన అధికారులు పెట్టుకున్న పలు జామీను అభ్యర్థనలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. ఆ నెలాఖరున వారిపై ఖతార్ చట్టప్రకారం విచారణ మొదలైంది. చిత్రమేమంటే ఈ అధికారుల్లో ఒకరైన కెప్టెన్ నవ్‌తేజ్ గిల్ లాంటి వారు భారత నేవల్ అకాడెమీ నుంచి పట్టభద్రులైనప్పుడు తమ ప్రతిభా ప్రదర్శనకు ఏకంగా రాష్ట్రపతి స్వర్ణపతకం అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో బోధకుడిగా పనిచేశారు. మొదట్లో గత అక్టోబర్‌లో ఈ నౌకాదళ మాజీ అధికారులందరికీ మరణ దండన విధించారు. ఆపైన మన దౌత్య యత్నాలు, భారత ప్రభుత్వ జోక్యం కారణంగా దాన్ని నిరవధిక జైలు శిక్షగా మార్చారు. బందీలుగా ఉన్న అధికారుల క్షేమం కోసం మన దేశం ఖతార్ అమీర్ కార్యాలయంతో సంప్రతింపులు సాగిస్తూ వచ్చింది. గత ఏడాది దుబాయ్‌లో ‘కాప్–28’ సదస్సు వేళ భారత ప్రధాని మోదీ, ఖతార్ అమీర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇరు ప్రభుత్వాధినేతల స్నేహబంధం చివరకు పరిష్కారం చూపింది. మరోపక్క వీరు పనిచేసిన దహ్రా గ్లోబల్ సంస్థ నిరుడు మేలోనే దోహాలో తన కార్యకలాపాలకు స్వస్తి చెప్పింది. ఆ సంస్థలో అత్యధికులు భారతీయులే. వారు అప్పుడే భారత్‌కు తిరిగొచ్చేశారు. లెక్కచూస్తే, ఒక్క ఖతార్‌లోనే 8 లక్షల మంది భారతీయులు, 6 వేల భారతీయ కంపెనీలున్నాయి. రెండేళ్ళ క్రితమే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15.03 బిలియన్ డాలర్లుంది. ఇక, భారత్ చేసుకొనే ద్రవీభూత సహజవాయు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో 40 శాతం ఖతార్ నుంచే! వచ్చే 2048 దాకా ఆ దిగుమతుల కోసం 78 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని గత వారమే ఖతార్‌తో భారత్ కుదుర్చుకుంది. ఇవన్నీ ఇప్పుడు కలిసొచ్చాయి. మొత్తం పశ్చిమాసియా సంగతికొస్తే 90 లక్షల మంది భారతీయులున్నారు. కొన్నేళ్ళుగా పశ్చి మాసియాలో, ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్‌ల వైపు భారత్ నిరంతరం స్నేహహస్తం చాస్తోంది. తాజా దౌత్య పరిష్కారం మన ఆ స్నేహానికి ఫలితం. పెరుగుతున్న భారత ప్రాబల్యానికి నిదర్శనం. ఈ ప్రాంత దేశాలన్నీ ఇంధన సరఫరాలో భారత్‌కు చిరకాలంగా సన్నిహితమైనా, విదేశాంగ విధానంలో పాకిస్తాన్ వైపు మొగ్గేవి. కొన్ని దశాబ్దాలుగా పాక్ అదృష్టం తలకిందులవడంతో, ఆర్థిక, భద్రతా అంశాల రీత్యా ఈ ప్రాంతంలో భారత్‌తో బలమైన సంబంధాలు అవసరమనే ఎరుక వాటికి కలిగింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో సమష్టి దౌత్య, భద్రతా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, భారత్‌ను అవి ఇప్పుడు విశ్వసనీయ మిత్రదేశంగా భావిస్తున్నాయి. నౌకాదళ అధికారుల విడుదలకు అదీ ఓ కారణమే. ఏమైనా ఇదే అదనుగా పశ్చిమా సియా దేశాలతో భారత్ దోస్తీ బలపడితే, మరిన్ని దౌత్య, వ్యూహాత్మక ప్రయోజనాలు తథ్యం. -
గవర్నర్‌ను కలిసిన తూర్పు నావికాదళం విభాగాధిపతి
సాక్షి, హైదరాబాద్: తూర్పు నావికాదళం విభాగాధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తీరప్రాంతాల రక్షణకు తూర్పు నావికాదళం సంసిద్ధతతో పాటు వచ్చే ఏడాది నిర్వహించనున్న నావికా విన్యాసాలకు ఏర్పాట్ల గురించి ఆయన గవర్నర్‌కు వివరించారు. కరోనా మహమ్మారి సమయంలో ఇతర దేశాల నుంచి ఆక్సిజన్‌ను సమీకరించడంలో నావికాదళం చేసిన సేవలను ఈ సందర్భంగా తమిళిసై కొనియాడారు. భేటీలో నేవీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు ప్రాంత అధ్యక్షురాలు చారు సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సైనికులకు అండగా సీఎం జగన్: హోం మంత్రి సుచరిత
-
మాజీ సైనికులకు అండగా సీఎం జగన్: హోం మంత్రి సుచరిత
సాక్షి, విశాఖపట్టణం: మాజీ సైనికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి సుచరిత తెలిపారు. రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు రాయితీ ద్వారా పరిశ్రమలు.. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్‌పై భారత్ విజయానికి సూచికగా చేపట్టిన స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని శుక్రవారం ఆర్కే బీచ్‌లోని విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నౌకదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజెంద్ర బహుదుర్ హోంమంత్రికి అందజేశారు. నాటి విజయంలో భాగస్వాములైన నేవీ సిబ్బందిని మంత్రి సత్కరించారు. స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో నేవీ అవసరాలు తీర్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని తెఉలిపారు. భారత్ రక్షణలో విశాఖ తీరం కీలకమని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు నాటి యుద్ధ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? చదవండి: ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి -
నేవీ ‘హనీ ట్రాప్’ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల కుట్రే
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నేవీ అధికారులకు యువతులను ఎరవేసి సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు పన్నిన హనీ ట్రాప్ వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల కుట్ర దాగి ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఇమ్రాన్ యాకూబ్‌పై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. భారత రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకుని నావికాదళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా దేశ సైనిక రహస్యాలను తెలుసుకోడానికి పాకిస్తాన్ నిఘా అధికారులు పన్నిన కుట్రను 2019లో కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టి దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. దీనిపై 2019 నవంబర్ 16న విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గూఢచర్యం ద్వారా దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించగా 2019 డిసెంబర్ 12న కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్‌తో వ్యాపార సంబంధాలున్న ముగ్గురు పౌరులతో పాటు 11 మంది నావికాదళ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ వారిని అరెస్ట్ చేసింది. వారిపై 2020 జూన్ 15న ఎన్ఐఏ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అనంతర దర్యాప్తులో గుజరాత్‌లోని గోద్రాకు చెందిన యాకూబ్ ఇమ్రాన్‌కు పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. నావికాదళ రహస్యాలు, సమాచారం సేకరించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల సూచనల మేరకు ఇమ్రాన్ యాకూబ్ నేవీ అధికారుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్టు ఆధారాలు సేకరించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇమ్రాన్ చట్టవిరుద్ధంగా వస్త్ర వ్యాపారం పేరుతో నిధులను సమీకరించినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో రుజువైంది. ఈ విషయాలతో అతడిపై అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ ప్రకటించింది. -
నేవీ రాడార్‌కు లైన్ క్లియర్
- త్వరలో పనులు ప్రారంభం - ప్రాజెక్టు వ్యయం 1,800 కోట్లు పరిగి: ఇండియన్ నేవీ రాడార్ ప్రాజెక్టుకు లైన్ క్లియరైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం సమీపంలో త్వరలో పనులు ప్రారంభించనున్నారు. సోమవారం పూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో నేవీ అధికారులు ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. రిజర్వ్ ఫారెస్టు అధీనంలో ఉన్న 2,700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం ఫారెస్టు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పంచాయతీతో ఒప్పందాలు చేసుకున్నారు. 2011–12లో ప్రక్రియ ప్రారంభం కాగా 2014లో ఈ ప్రాజె క్టు ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంచనాకు వచ్చాయి. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచంలోనే ఐదో అధునాతన వ్యవస్థ ఏర్పాటుకు దామ గుండం అటవీ ప్రాంతం కేంద్రం కానుంది. రూ.1,800 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు హైదరాబాద్ నుంచి సరిగ్గా 60 కిలోమీటర్ల దూరంతో పాటు సముద్ర మట్టానికి 350కి పైగా మీటర్ల ఎత్తయిన ప్రాంతాన్ని ఇండియన్ నేవీ ఎంచుకుంది. ఇందుకోసం దామగుండం అటవీ ప్రాంతంలో ఉన్న 2,700 ఎకరాల భూమిని గుర్తించిన ఇండియన్ నేవీ 2011–12లో ప్రతిపాదనలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచింది. ఆ భూ భాగం రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించింది. దీంతో ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రిజర్వ్ ఫారెస్టుకు రూ.133 కోట్లు చెల్లించిన నేవీ అధికారులు సూత్రప్రాయంగా ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో 400 ఏళ్ల చరిత్ర గల పురాతన దేవాలయాన్ని యథాతథంగా కొనసాగించ టంతో పాటు పూడూరకు దగ్గరగా అలాం టిదే రూ.5 కోట్ల ఖర్చుతో మరో ఆలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. -
విశాఖలో యుద్ధనౌక విన్యాసాలు ప్రారంభం
నగరానికి చేరుకున్న సింగపూర్ యుద్ధ నౌక సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో భారత్- సింగపూర్ దేశాలకు చెందిన నావికాదళాలు సంయుక్తంగా నిర్వహించే సిమ్‌బెక్స్-16 విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నవంబర్ 2 వరకు ఈ విన్యాసాలు సాగనున్నాయి. దీనికి సంబంధించి సింగపూర్ నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఆదివారం విశాఖకు చేరుకుంది. కల్నల్ ఖో అక్ లీయోంగ్ ఆల్బర్ట్ నేతృత్వంలో 185 మంది స్క్వాడ్రాన్ సిబ్బందితో ఈ నౌక భారత్‌కు చేరుకుంది. భారత్-సింగపూర్ నావికా దళాల మధ్య వృత్తిపరమైన, సాంస్కృతిక, సాంఘిక, క్రీడారంగాల్లో పరస్పర సహకారానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని నేవీ అధికారులు పేర్కొన్నారు. యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ (ఏఎస్‌డబ్ల్యూ), ఇంటిగ్రేడెట్ ఆపరేషన్స్ విత్ సర్ఫేస్, ఎయిర్ అండ్ సబ్‌సర్ఫేస్ ఫోర్సెస్, ఎయిర్ డిఫెన్స్ అండ్ సర్వేస్ ఎన్కౌంటర్ వంటి అంశాల్లో విన్యాసాలు సాగనున్నాయి. భారత్ తరఫున ఐఎన్‌స్ రన్విజయ్, ఐఎన్‌స్ కమోర్త్ యుద్ధనౌకలు పాల్గొననున్నాయి. -
ఉలవపాడుబీచ్కు కొట్టుకొచ్చిన బోటు
ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు బీచ్‌కు సోమవారం ఉదయం ఓ బోటు కొట్టుకు వచ్చింది. బోటుపై తమిళ అక్షరాలు ఉండటంతో తమిళనాడుకు చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. తీరానికి బోటు వచ్చిన సమయానికి అందులో ఎవరూ లేరు. బోటును గమనించిన మత్స్యకారులు తీర ప్రాంత అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బోటు ఎవరిదై ఉంటుంది.. బంగాళా ఖాతంలో నెలకొని ఉన్న పరిస్థితుల రీత్యా ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అనే కోణంలో విచారణ ప్రారంభించారు. -
అణు భద్రతకు ‘ఈసీఐఎల్’ అస్త్రం
ఆర్డీఈ పరికరం రూపకల్పన హైదరాబాద్: అణు ఇంధన పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అత్యాధునిక పరికరాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) అరుదైన ఘనత సాధించింది. రెడియోలాజికల్ డిటెక్షన్ ఇక్వూప్మెంట్ (ఆర్డీఈ) గా పిలిచే ఈ పరికరాన్ని ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్టీటీ) కి అందజేసినట్లు సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. సోమవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ సుధాకర్.. జేఎన్పీటీ చైర్మన్ నీరజ్ బన్సాల్‌కు ఈ పరికరాన్ని అందజేసినట్లు వెల్లడించాయి. వివిధ వాహనాల్లో అక్రమంగా తరలించే అణుఇంధన పదార్థాలను ఈ పరికరం ఇట్టే గుర్తిస్తుందని తెలిపాయి. పోర్టుల వద్ద ఏర్పాటు చేసిన ఆర్డీఈ పరికరం వాహనాలను పూర్తిగా స్కాన్ చేసి నిషేధిత పదార్థాలు ఉంటే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ పరికరంలో అమర్చిన కెమెరా.. వాహనాల ఫొటోలు, నంబర్ ప్లేట్ వివరాలను, వ్యక్తిని చిత్రీకరించి నేవీ అధికారులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తుందని తెలిపాయి. -
బైకలాలో హెలీప్యాడ్‌కు స్థలం లభ్యం
సాక్షి, ముంబై: హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన స్థలం బైకలా రైల్వే స్టేషన్లో లభించింది. ఈ స్థలాన్ని నేవీ అధికారులు సందర్శించి, అందుకు అవసరమైన ప్రతిపాదన నేవి చీఫ్‌కు పంపించారు. ఇది కార్యరూపం దాలిస్తే గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లడం సులభతరం కానుంది. నగరం, శివారు ప్రాంతాల్లో నిత్యం రైలు పట్టాలు దాటుతూ, నడిచే రైలులోంచి కిందపడుతూ ఇలా ఎక్కడో ఒక చోటా, ఏదో ఒక స్టేషన్లో ప్రయాణికులు ప్రమాదాలకు లోనవుతూనే ఉంటారు. ఇలాంటి ప్రమాదాల వల్ల నగరంలోని అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రతీరోజు సరాసరి ముగ్గురు లేదా నలుగురు చనిపోతుండగా, పది మంది వరకుగాయపడుతున్నారు. ఇలా తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే వైద్య సేవలు అందితే వారి ప్రాణాలు దక్కే అవకాశముంటుంది. కాగా, వారిని సమీప ఆస్పత్రిలో తరలించడానికి ఏర్పాటుచేసిన అంబులెన్సులు నగర ట్రాఫిక్‌లో తప్పించుకుంటూ సరైన సమయానికి బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో విఫలమవుతున్నాయి. దీంతో సమయానికి సరైన వైద్యం అందక సదరు బాధితుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇక వీటికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే విభాగంగా హెలికాప్టర్ల సాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే హెలికాప్టర్‌ను రప్పిస్తారు. కాగా, హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి అవసరమైన హెలిప్యాడ్లను నగరంలోని కీలకమైన స్టేషన్ల ఆవరణల్లో నిర్మించాలని రైల్వే పరిపాలనా విభాగంగా నిర్ణయించింది. అందుకు 14 స్టేషన్లను ఎంపిక చేసింది. అందులో బైకలా ఒకటి. ఇక్కడ స్టేషన్ బయట రైల్వే సొంత స్థలం ఉంది. అందులో హెలిప్యాడ్ నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని చూపించడంతో నేవీ అధికారులు సందర్శించి వెళ్లారు. ప్రతిపాదనలు కూడా పంపడంతో త్వరలో అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా రైలు ప్రమాదంలో గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి అంబులెన్స్‌లు, ఆటో, ట్యాక్సీలు, ఇతర వాహనాలు దొరకడం లేదు. దీంతో కొన్ని ప్రముఖ స్టేషన్ల బయట అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. కాని ట్రాఫిక్ జాంలో ఇవి కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో హెలికాప్టర్ ద్వారా బాధితులను వెంటనే ఆస్పత్రికి చేరవేయవచ్చని రైల్వే భావించింది. అందుకు అవసరమైన హెలిప్యాడ్ల నిర్మాణానికి అవసరమైన స్థలం వేటలో పడింది.