సాక్షి, ముంబై: హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన స్థలం బైకలా రైల్వే స్టేషన్‌లో లభించింది. ఈ స్థలాన్ని నేవీ అధికారులు సందర్శించి, అందుకు అవసరమైన ప్రతిపాదన నేవి చీఫ్‌కు పంపించారు. ఇది కార్యరూపం దాలిస్తే గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లడం సులభతరం కానుంది. నగరం, శివారు ప్రాంతాల్లో నిత్యం రైలు పట్టాలు దాటుతూ, నడిచే రైలులోంచి కిందపడుతూ ఇలా ఎక్కడో ఒక చోటా, ఏదో ఒక స్టేషన్‌లో ప్రయాణికులు ప్రమాదాలకు లోనవుతూనే ఉంటారు.
ఇలాంటి ప్రమాదాల వల్ల నగరంలోని అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రతీరోజు సరాసరి ముగ్గురు లేదా నలుగురు చనిపోతుండగా, పది మంది వరకుగాయపడుతున్నారు. ఇలా తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే వైద్య సేవలు అందితే వారి ప్రాణాలు దక్కే అవకాశముంటుంది. కాగా, వారిని సమీప ఆస్పత్రిలో తరలించడానికి ఏర్పాటుచేసిన అంబులెన్సులు నగర ట్రాఫిక్‌లో తప్పించుకుంటూ సరైన సమయానికి బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో విఫలమవుతున్నాయి. దీంతో సమయానికి సరైన వైద్యం అందక సదరు బాధితుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇక వీటికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే విభాగంగా హెలికాప్టర్ల సాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే హెలికాప్టర్‌ను రప్పిస్తారు.
కాగా, హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి అవసరమైన హెలిప్యాడ్‌లను నగరంలోని కీలకమైన స్టేషన్ల ఆవరణల్లో నిర్మించాలని రైల్వే పరిపాలనా విభాగంగా నిర్ణయించింది. అందుకు 14 స్టేషన్లను ఎంపిక చేసింది. అందులో బైకలా ఒకటి. ఇక్కడ స్టేషన్ బయట రైల్వే సొంత స్థలం ఉంది. అందులో హెలిప్యాడ్ నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని చూపించడంతో నేవీ అధికారులు సందర్శించి వెళ్లారు. ప్రతిపాదనలు కూడా పంపడంతో త్వరలో అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి.
ఇదిలాఉండగా రైలు ప్రమాదంలో గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి అంబులెన్స్‌లు, ఆటో, ట్యాక్సీలు, ఇతర వాహనాలు దొరకడం లేదు. దీంతో కొన్ని ప్రముఖ స్టేషన్ల బయట అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. కాని ట్రాఫిక్ జాంలో ఇవి కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో హెలికాప్టర్ ద్వారా బాధితులను వెంటనే ఆస్పత్రికి చేరవేయవచ్చని రైల్వే భావించింది. అందుకు అవసరమైన హెలిప్యాడ్‌ల నిర్మాణానికి అవసరమైన స్థలం వేటలో పడింది.
బైకలాలో హెలీప్యాడ్‌కు స్థలం లభ్యం
Published Fri, Oct 17 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement
Advertisement