అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా సాగించిన వివిధ దౌత్యయత్నాలు ఫలప్రదమయ్యాయి. భారత ప్రధానికీ, ఖతార్ అమీర్‌కూ మధ్య నిరుడు సాగిన సమావేశం ఫలించింది. మరణశిక్ష పడ్డ 8 మంది నౌకాదళ సీనియర్ సిబ్బందిని ఖతార్ ఎట్టకేలకు విడుదల చేసింది. వారిలో ఏడుగురు సోమ \వారం స్వదేశానికి చేరుకోగా, ఎనిమిదో వ్యక్తిని సైతం సాధ్యమైనంత త్వరగా భారత్ రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏణ్ణర్ధం పైగా అక్కడి జైలులో మగ్గుతూ, మరణదండనతో మృత్యుముఖం దాకా వెళ్ళి, చివరకు అన్ని అభియోగాల నుంచి విముక్తమై వారు తిరిగి రావడం అసాధారణం. ఇది భారత దౌత్య విజయం. బుధవారం ఖతార్‌లో భారత ప్రధాని మోదీ పర్యటించనున్న వేళ వెలువడ్డ ఈ ప్రకటన విశేషమైనది. అంతర్జాతీయంగా మన దేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యానికీ, అరబ్ దేశాలతో మనం నెరపుతున్న స్నేహసంబంధాల సాఫల్యానికీ ఇది ఓ మచ్చుతునక.
జరిగిన కథలోకి వెళితే, విడుదలైన ఈ 8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బంది ఇజ్రాయెల్ పక్షాన గూఢచర్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినవచ్చాయి. అందులో నిజం లేదంటూ, వారిని విడుదల చేయాలని భారత్ ప్రయత్నిస్తూ వచ్చింది. గత ఏడాది కాలంగా భారత విదేశాంగ శాఖ అజెండాలో ఓ ప్రధానాంశం – ఈ నౌకాదళ మాజీ అధికారుల విడుదల. అందుకు తగ్గట్టే మంత్రిత్వ శాఖలో సంబంధిత విభాగం, అలాగే ఖతార్‌లోని భారత దౌత్య కార్యాలయం నిర్విరా మంగా శ్రమించాయి.
ప్రచారానికి దూరంగా తమ పని తాము చేస్తూ, చివరకు ఆశించిన ఫలితాన్ని సాధించాయి. విదేశాంగ శాఖ గల్ఫ్ డివిజన్‌కు మునుపు సారథ్యం వహించిన విపుల్ గత ఏడాది ఖతార్‌కు వెళ్ళి, ఆ దేశంలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టడం సైతం కలిసొచ్చింది. ఆయన సంబంధిత వర్గాలన్నిటితో మాట్లాడి, ఒప్పించగలిగారు. అదే సమయంలో, జాతీయ భద్రతా సల హాదారైన అజిత్ దోవల్ సారథ్యంలోని జాతీయ భద్రతా మండలి సచివాలయం సైతం ఖతార్ రాజ ధాని దోహాలోని తన సన్నిహితులతో మంతనాలు సాగించింది. ఓర్పుగా, నేర్పుగా వ్యవహారం నడి పిస్తూ, మన మాజీ అధికారులు విడుదలై, తిరిగివచ్చేవరకు కథను గుట్టుగా నడిపించడం విశేషం.
అసలు ఈ వివాదం ఏణ్ణర్ధం క్రితం మొదలైంది. 2022 ఆగస్ట్ 30న ఈ 8 మందిని అరెస్ట్ చేసి, ఏకాంతవాస శిక్ష విధించారు. ఖైదీలుగా ఉన్న మనవాళ్ళను ఆ ఏడాది అక్టోబర్ మొదట్లోనే భారత దౌత్య సిబ్బంది కలిశారు. నిజానికి, అరెస్టయినవారిలో అధికులు దహ్రా గ్లోబల్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు పనిచేస్తూ వచ్చారు. ఖతారీ నౌకాదళంలో ఇటాలియన్ యూ212 రహస్య జలాంతర్గాముల్ని ప్రవేశపెట్టడంలో సాయపడేందుకు వారు ఖతార్‌కు వచ్చారన్నది కథనం.
జైల్లో పడ్డ తమ సిబ్బందికి సాయం చేసేందుకు సదరు ప్రైవేట్ సంస్థ సీఈఓ సైతం ప్రయత్నించక పోలేదు. కానీ, ఆయనా జైల్లో పడి, రెండు నెలలు ఒంటరి చెరను అనుభవించి, అనంతరం జామీను మీద బయటపడాల్సి వచ్చింది. గడచిన 2023 మార్చి వచ్చేసరికి మన అధికారులు పెట్టుకున్న పలు జామీను అభ్యర్థనలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. ఆ నెలాఖరున వారిపై ఖతార్ చట్టప్రకారం విచారణ మొదలైంది. చిత్రమేమంటే ఈ అధికారుల్లో ఒకరైన కెప్టెన్ నవ్‌తేజ్ గిల్ లాంటి వారు భారత నేవల్ అకాడెమీ నుంచి పట్టభద్రులైనప్పుడు తమ ప్రతిభా ప్రదర్శనకు ఏకంగా రాష్ట్రపతి స్వర్ణపతకం అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో బోధకుడిగా పనిచేశారు.
మొదట్లో గత అక్టోబర్‌లో ఈ నౌకాదళ మాజీ అధికారులందరికీ మరణ దండన విధించారు. ఆపైన మన దౌత్య యత్నాలు, భారత ప్రభుత్వ జోక్యం కారణంగా దాన్ని నిరవధిక జైలు శిక్షగా మార్చారు. బందీలుగా ఉన్న అధికారుల క్షేమం కోసం మన దేశం ఖతార్ అమీర్ కార్యాలయంతో సంప్రతింపులు సాగిస్తూ వచ్చింది. గత ఏడాది దుబాయ్‌లో ‘కాప్–28’ సదస్సు వేళ భారత ప్రధాని మోదీ, ఖతార్ అమీర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇరు ప్రభుత్వాధినేతల స్నేహబంధం చివరకు పరిష్కారం చూపింది. మరోపక్క వీరు పనిచేసిన దహ్రా గ్లోబల్ సంస్థ నిరుడు మేలోనే దోహాలో తన కార్యకలాపాలకు స్వస్తి చెప్పింది.
ఆ సంస్థలో అత్యధికులు భారతీయులే. వారు అప్పుడే భారత్‌కు తిరిగొచ్చేశారు. లెక్కచూస్తే, ఒక్క ఖతార్‌లోనే 8 లక్షల మంది భారతీయులు, 6 వేల భారతీయ కంపెనీలున్నాయి. రెండేళ్ళ క్రితమే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15.03 బిలియన్ డాలర్లుంది. ఇక, భారత్ చేసుకొనే ద్రవీభూత సహజవాయు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతుల్లో 40 శాతం ఖతార్ నుంచే! వచ్చే 2048 దాకా ఆ దిగుమతుల కోసం 78 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని గత వారమే ఖతార్‌తో భారత్ కుదుర్చుకుంది. ఇవన్నీ ఇప్పుడు కలిసొచ్చాయి.
మొత్తం పశ్చిమాసియా సంగతికొస్తే 90 లక్షల మంది భారతీయులున్నారు. కొన్నేళ్ళుగా పశ్చి మాసియాలో, ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్‌ల వైపు భారత్ నిరంతరం స్నేహహస్తం చాస్తోంది. తాజా దౌత్య పరిష్కారం మన ఆ స్నేహానికి ఫలితం. పెరుగుతున్న భారత ప్రాబల్యానికి నిదర్శనం. ఈ ప్రాంత దేశాలన్నీ ఇంధన సరఫరాలో భారత్‌కు చిరకాలంగా సన్నిహితమైనా, విదేశాంగ విధానంలో పాకిస్తాన్ వైపు మొగ్గేవి.
కొన్ని దశాబ్దాలుగా పాక్ అదృష్టం తలకిందులవడంతో, ఆర్థిక, భద్రతా అంశాల రీత్యా ఈ ప్రాంతంలో భారత్‌తో బలమైన సంబంధాలు అవసరమనే ఎరుక వాటికి కలిగింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో సమష్టి దౌత్య, భద్రతా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, భారత్‌ను అవి ఇప్పుడు విశ్వసనీయ మిత్రదేశంగా భావిస్తున్నాయి. నౌకాదళ అధికారుల విడుదలకు అదీ ఓ కారణమే. ఏమైనా ఇదే అదనుగా పశ్చిమా సియా దేశాలతో భారత్ దోస్తీ బలపడితే, మరిన్ని దౌత్య, వ్యూహాత్మక ప్రయోజనాలు తథ్యం.
దౌత్య విజయం
Published Wed, Feb 14 2024 12:27 AM | Last Updated on Wed, Feb 14 2024 12:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment