నేవీ రాడార్‌కు లైన్ క్లియర్
- త్వరలో పనులు ప్రారంభం
- ప్రాజెక్టు వ్యయం 1,800 కోట్లు
పరిగి: ఇండియన్ నేవీ రాడార్ ప్రాజెక్టుకు లైన్ క్లియరైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం సమీపంలో త్వరలో పనులు ప్రారంభించనున్నారు. సోమవారం పూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో నేవీ అధికారులు ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. రిజర్వ్ ఫారెస్టు అధీనంలో ఉన్న 2,700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం ఫారెస్టు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పంచాయతీతో ఒప్పందాలు చేసుకున్నారు. 2011–12లో ప్రక్రియ ప్రారంభం కాగా 2014లో ఈ ప్రాజె క్టు ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంచనాకు వచ్చాయి. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచంలోనే ఐదో అధునాతన వ్యవస్థ ఏర్పాటుకు దామ గుండం అటవీ ప్రాంతం కేంద్రం కానుంది.
రూ.1,800 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు
హైదరాబాద్ నుంచి సరిగ్గా 60 కిలోమీటర్ల దూరంతో పాటు సముద్ర మట్టానికి 350కి పైగా మీటర్ల ఎత్తయిన ప్రాంతాన్ని ఇండియన్ నేవీ ఎంచుకుంది. ఇందుకోసం దామగుండం అటవీ ప్రాంతంలో ఉన్న 2,700 ఎకరాల భూమిని గుర్తించిన ఇండియన్ నేవీ 2011–12లో ప్రతిపాదనలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచింది. ఆ భూ భాగం రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించింది. దీంతో ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రిజర్వ్ ఫారెస్టుకు రూ.133 కోట్లు చెల్లించిన నేవీ అధికారులు సూత్రప్రాయంగా ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో 400 ఏళ్ల చరిత్ర గల పురాతన దేవాలయాన్ని యథాతథంగా కొనసాగించ టంతో పాటు పూడూరకు దగ్గరగా అలాం టిదే రూ.5 కోట్ల ఖర్చుతో మరో ఆలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.