నేవీ ప్రాజెక్టుకు.. తొలగని విఘ్నాలు! | Disruptions to the Navy Radar Project in Vikarabad | Sakshi
Sakshi News home page

నేవీ ప్రాజెక్టుకు.. తొలగని విఘ్నాలు!

Published Tue, Sep 17 2019 10:46 AM | Last Updated on Tue, Sep 17 2019 10:47 AM

Disruptions to the Navy Radar Project in Vikarabad - Sakshi

ప్రాజెక్టు ఏర్పాటుకు నేవీ అధికారులు ఎంచుకున్న ప్రాంతం

రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు గుర్తించిన స్థలం: 2700 ఎకరాలు. ప్రాజెక్టు అంచనా విలువ: రూ.1,900 కోట్లు. రిజర్వ్‌ ఫారెస్ట్‌కు పరిహారం ఇస్తామన్న మొత్తం: రూ.133 కోట్లు
ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలుస్తుందనుకున్న జాతీయ ప్రాజెక్టు ఏర్పాటుకు విఘ్నాలు తొలగడం లేదు. పూడూరు మండలం దామగుండం సమీపంలో నేవీ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ఇండియన్‌ నేవీ 2012 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని రకాల అనుమతులు పొందింది. కానీ స్థల కేటాయింపు అంశం కొలిక్కి రాకపోవడంతో ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. గత శనివారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఈ అంశాన్ని లేవనెత్తడంతో.. ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది. నేవీ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు రిజర్వ్‌ ఫారెస్టు ఆధీనంలోని 2,700 ఎకరాల భూమిని ఇండియన్‌ నేవీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బైసన్‌ పోలో గ్రౌండ్‌ బదలాయింపు విషయంలో తలెత్తిన వివాదం.. నేవీ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు అడ్డంకిగా మారింది.  


పరిగి: లో ఫ్రీక్వెన్సీ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుతో జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందనుకున్న ఈ ప్రాంత ప్రజల ఆశలు నెరవేరడం లేదు. 2011– 12 సంవత్సరంలో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రాజెక్టు ఏర్పాటుపై 2014లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంచనాకు వచ్చాయి. దీంతో నేవీ ఏర్పాటు చేయనున్న లో ఫ్రీక్వెన్సీ రాడార్‌ వ్యవస్థకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఇది ఏర్పాటైతే  ప్రపంచంలోనే ఐదో అధునాతన వ్యవస్థకు పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతం కేరాఫ్‌గా నిలిచేది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో ఏర్పడి, పూర్తిగా వెనుకబడిన జిల్లాగా చర్చ జరుగుతున్న వికారాబాద్‌కు ఇలాంటి ప్రాజెక్టు రావడం అదృష్టంగా కనిపించింది. ఇది సాకారమైతే పూడూరు, పరిగి, వికారాబాద్‌ మండలాలకు చెందిన 10 గ్రామాలకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా మేలు చేకూరేది.

రూ.1,900 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు... 
హైదరాబాద్‌ నుంచి సరిగ్గా 60 కిలోమీటర్ల దూరంతో పాటు సముద్ర మట్టానికి 350 మీటర్ల ఎతైన ప్రాంతంలో రాడార్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఇండియన్‌ నేవీ నిర్ణయించింది. రూ.1,900 కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందించేందుకు సిద్ధమైంది. పూడూరు మండల పరిధిలోని దామగుండ అటవీ ప్రాంతంలో ఉన్న 2,700 ఎకరాల భూమిని గతంలోనే గుర్తించిన ఆ విభాగం 2011– 12 సమయంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచింది. ఈ భూభాగం రిజర్వ్‌ ఫారెస్టుకు సంబంధించినది కావడంతో పాటు అక్కడ పురాతన దామగుండ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉండటంతో పలు అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో సదరు భూమిని స్వాధీనం చేసుకునేందుకు రిజర్వ్‌ ఫారెస్టుకు రూ.133 కోట్లు చెల్లిస్తామని నేవీ అధికారులు హామీ ఇచ్చారు.

దీంతో ఈ భూములను అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇదే సమయంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయాన్ని యథాతథంగా ఉంచడంతో పాటు పూడూరు సమీపంలో రూ.5 కోట్లు వెచ్చించి అలాంటి ఆలయాన్నే నిర్మించి ఇస్తామని నేవీ అధికారులు హామీ ఇచ్చారు. అయితే దామగుండం భూములను నేవీకి అప్పగించాలంటే తమకు హైదరాబాద్‌లోని బైసన్‌ పోలో గ్రౌండ్‌ స్థలాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మెలికపెట్టింది. ఇందుకు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం.. సదరు స్థలం భారత ఆర్మీ పరిధిలో ఉందని, దీనిపై తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ఈ సమాధానంతో సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం.. దామగుండం భూములను నేవీకి అప్పగించే విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది.
 
మరోసారి చర్చకు.. 
రెండు రోజుల క్రితం ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ విషయాన్ని విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు అంశం మరోసారి జిల్లాలో చర్చనీయాంశమైంది.
 
సీఎంకు వివరించాను 
దామగుండం వద్ద నేవీ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటైతే ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. గ్రామీణ నేపథ్యమున్న, పేదరికంలో మగ్గుతున్న జిల్లాకు ఇలాంటి ప్రాజెక్టులు అత్యవసరం. ప్రాజెక్టు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న ఇండియన్‌ నేవీ ఇప్పటికే అన్ని రకాల అనుమతులు తీసుకుంది. ఇందుకోసం నేను కూడా తరచూ సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం తన అజెండాను అమలు చేసుకునేందుకు ప్రాజెక్టును పక్కన పెట్టింది. దీనిపై ఇటీవల సీఎంను కలిసి వివరించా.       – టి.రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు    

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

దామగుండం ఆలయ కొలను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement