Indian Defense Department
-
‘బ్రహ్మోస్’తో యుద్ధ నౌకలకు మరింత బలం
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత రక్షణ దళం మరో కీలక అడుగు ముందుకువేసింది. సముద్ర జలాల్లోకి అడుగు పెట్టాలంటే దాయాది దేశాలకు భయం పుట్టేలా చేసేందుకు ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటున్న భారత నౌకాదళం... మిసైల్స్ మహారాజుగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది. అత్యంత శక్తిమంతమైన, భారత నౌకాదళ ప్రధాన ఆయుధమైన బ్రహ్మోస్ క్షిపణులను ప్రతి యుద్ధ నౌకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు భారత్, రష్యా జాయింట్ వెంచర్‌గా ఉన్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ మన దేశంలోనే రూపొందిస్తున్న బ్రహ్మోస్ క్షిపణులను భారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.19 వేల కోట్లతో 200 మిసైల్స్ కొనుగోలు చేసేలా బ్రహ్మోస్ ఏరోస్పేస్తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో ఎంవోయూ చేసుకుంది. భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్లని ఏర్పాటు చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బ్రహ్మోస్ కొనుగోలుకు ఫిలిప్పీన్స్ ఒప్పందం భారతదేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీ¯న్స్ నిలిచింది. దాదాపు 375 మిలియన్ డాలర్లతో మిసైల్స్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదర్చుకుంది. ఇటీవల చైనా నుంచి కవ్వింపు చర్యలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ ఇబ్బందులు పడుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు బ్రహ్మోస్‌ను కీలక ఆయుధంగా మలచుకోవాలని ఫిలిప్పీన్స్ భావించి ఈ ఒప్పందం చేసుకుంది. బ్రహ్మోస్ మాత్రమే కాకుండా తేజస్ యుద్ధ విమానాలను సైతం కొనుగోలు చేసేందుకు ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందని భారత నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌తో భాగస్వామ్యం కోసం అన్ని దేశాల ఆసక్తి సాగర జలాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కష్టాల్లో ఏ దేశం ఉన్నా సాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటోంది భారత నౌకాదళం. ఇటీవల సముద్రపు దొంగల దాడుల్లో పలు దేశాల వర్తక నౌకలు చిక్కుకోవడంతో వాటిని కాపాడే బాధ్యతను ఇండియన్ నేవీ తీసుకుని సఫలీకృతమైంది. అందువల్ల భారత్‌తో భాగస్వామ్యం పెంచుకునేందుకు అన్ని దేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా జరుగుతున్న మిలాన్–2024లో రికార్డు స్థాయిలో ఏకంగా 51 దేశాలు పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు నౌకాదళంలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. స్వావలంబన దిశగా భారత్ బ్రహ్మోస్ క్షిపణి ఎగు మతి వల్ల దేశ రక్షణ రంగంలో స్వావలంబన పెరుగుతుంది. భారతదేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి, విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది. భారత నావికాదళం 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించేదిశగా అడుగులు వేస్తోంది. -
కలాం స్ఫూర్తితో అంతరిక్ష విజయాలు
ఆత్మకూరు రూరల్: దివంగత రాష్ట్రపతి, అగ్రశ్రేణి క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో భారత రక్షణ శాఖ అంతరిక్ష విజయాలు సాధిస్తోందని భారత రక్షణ శాఖ శాస్త్ర, సాంకేతిక సలహాదారు డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి అన్నారు. గత నెల 30 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాస భారతీయులు, జేఎన్టీయూ నిపుణులు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఆర్డీవోలో తన ప్రస్థానం గురించి వివరించారు. అబ్దుల్ కలాం శిష్యుడిగా డీఆర్డీవోలో పెద్ద లక్ష్యాలను ఏర్పచుకుని వాటిని సాధించడం కోసం సహచర శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసి ఘన విజయాలు సాధించామన్నారు. గత 8 ఏళ్లుగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన పరిశోధనల ఫలితంగా భారతదేశ రక్షణ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలు, క్షిపణులు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుని అగ్రరాజ్యాల సరసన చేరామన్నారు. ప్రపంచ శాంతి కోసం తన బలాన్ని, బలగాన్ని భారతదేశం వినియోగిస్తోందని సతీష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవిజ్ఞానం అభివృద్ధికి అంకితభావంతో సతీష్‌రెడ్డి చేసిన పరిశోధనలను పలువురు వక్తలు ప్రశంసించారు. అనంతరం సతీష్‌రెడ్డిని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు అయిన టాంటెక్స్, తానా, నాటా, నాట్స్, ఆట సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కోర్సిపాటి, ఆయా సంఘాల నాయకులు చిల్లకూరి గోపిరెడ్డి, అజయ్ కలువ, ఉప్పలపాటి కృష్ణారెడ్డి, బలరామ్, భీమా, భాస్కర్‌రెడ్డి, సురేష్, రంగారావు, శ్రీనివాసరాజు, శ్రీనివాసమూర్తి, పులి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రఫేల్’పై ఆధారాలున్నా మౌనమెందుకు?
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి వ్యవహారం సెగలు రాజేస్తూనే ఉంది. రఫేల్ ఫైటర్జెట్ల సరఫరా కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ఫ్రాన్స్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘డసాల్ట్ ఏవియేషన్’ భారత్‌కు చెందిన సుశేన్ గుప్తా అనే మధ్యవర్తికి 2007–12కాలంలో కమీషన్ల కింద 7.5 మిలియన్ యూరోలు(రూ.65 కోట్లు) చెల్లించినట్లు ఫ్రెంచ్ పరిశోధన పత్రిక ‘మీడియాపార్ట్’ ఆరోపించింది. కమీషన్లు చేతులు మారడానికి వీలుగా డొల్ల కంపెనీల పేరిట నకిలీ రశీదులను సృష్టించి వాడారంది. ఆ రశీదులను ప్రచురించింది. అయితే, దీనిపై భారత రక్షణ శాఖ గానీ, డసాల్ట్ ఏవియేషన్ స్పందించలేదు. యూపీఏ సర్కారు హయాంలో కుదిరిన పాత ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.59వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వంతో కొత్త ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు వెనుక భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రఫేల్ డీల్‌లో అవినీతికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ భారత్‌లోని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఎందుకు మౌనంగా ఉంటున్నాయని మీడియాపార్ట్ ప్రశ్నించింది. రఫేల్ ఒప్పందంలో విదేశీ కంపెనీలు, మోసపూరిత కాంట్రాక్టులు, నకిలీ రశీదుల ప్రమేయం కనిపిస్తోందని, 2018 అక్టోబర్ నుంచి ఆధారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయినా విచారణ జరపొద్దని సీబీఐ, ఈడీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని మీడియాపార్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్కో రఫేల్ ఫైటర్‌జెట్‌ను రూ.526 కోట్లకు కొనుగోలు చేసేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదిరిందని, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఒక్కో విమానాన్ని రూ.1,670 కోట్లకు కొంటోందని, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రఫేల్ ఒప్పందంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కమీషన్లు చేతులు మారాయని బీజేపీ నేత అమిత్ మాలవియా చెప్పారు. -
నేవీ ‘హనీ ట్రాప్’ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల కుట్రే
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నేవీ అధికారులకు యువతులను ఎరవేసి సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు పన్నిన హనీ ట్రాప్ వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల కుట్ర దాగి ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఇమ్రాన్ యాకూబ్‌పై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. భారత రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకుని నావికాదళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా దేశ సైనిక రహస్యాలను తెలుసుకోడానికి పాకిస్తాన్ నిఘా అధికారులు పన్నిన కుట్రను 2019లో కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టి దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. దీనిపై 2019 నవంబర్ 16న విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గూఢచర్యం ద్వారా దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించగా 2019 డిసెంబర్ 12న కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్‌తో వ్యాపార సంబంధాలున్న ముగ్గురు పౌరులతో పాటు 11 మంది నావికాదళ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ వారిని అరెస్ట్ చేసింది. వారిపై 2020 జూన్ 15న ఎన్ఐఏ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అనంతర దర్యాప్తులో గుజరాత్‌లోని గోద్రాకు చెందిన యాకూబ్ ఇమ్రాన్‌కు పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. నావికాదళ రహస్యాలు, సమాచారం సేకరించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల సూచనల మేరకు ఇమ్రాన్ యాకూబ్ నేవీ అధికారుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్టు ఆధారాలు సేకరించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇమ్రాన్ చట్టవిరుద్ధంగా వస్త్ర వ్యాపారం పేరుతో నిధులను సమీకరించినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో రుజువైంది. ఈ విషయాలతో అతడిపై అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ ప్రకటించింది. -
ఇక తిరుగులేని ‘రక్షణ’
ఇరుగుపొరుగుతో శాంతిని కోరుకుంటూనే, అందుకోసం చేయాల్సిందంతా చేస్తూనే యుద్ధం వచ్చే పక్షంలో శత్రువును సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అనువుగా రక్షణ దళాలను తీర్చిదిద్దడం, వాటికి అవసరమైన సమస్తమూ అందుబాటులో ఉంచడం ఏ దేశానికైనా తప్పనిసరి. ఎందుకంటే యుద్ధం వద్దని ఒక పక్షం కోరుకుంటే సరిపోదు. అవతలి పక్షం కూడా వాంఛించాలి. యుద్ధ నిపు ణుల అభిప్రాయం ప్రకారం శత్రువే చాలాసార్లు యుద్ధాన్ని నిర్ణయిస్తాడు. కనుకనే మన త్రివిధ దళాలను స్వతంత్రంగా పర్యవేక్షించడానికి రక్షణ దళాల అధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్– సీడీఎస్)ని నియమించాలని కేంద్ర మంత్రివర్గం మంగళవారం తీసుకున్న నిర్ణయం అన్నివిధాలా సబబైనది. ఈ విషయమై మొన్న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పుడు అనేకమంది దాన్ని స్వాగతించారు. త్రివిధ దళాల అధిపతులు ఎవరికి వారు వారి వారి విభాగాల నిర్వహణలో నిత్యం తలమునకలైవుంటారు. ప్రధాని, రక్షణమంత్రి ఆ విభా గాలకు ఎదురవుతున్న సమస్యలేమిటో, వాటిని తీర్చడానికి అనుసరించాల్సిన విధానమేమిటో తెలుసుకోవాలంటే ఈ ముగ్గురితో విడివిడిగా సమావేశం కావడం ప్రస్తుతం తప్పనిసరవుతోంది. రక్షణ దళాల అధిపతి వస్తే, ఆయన ఆ మూడు విభాగాలనూ పర్యవేక్షిస్తూ, వాటికి కావలసిన దీర్ఘ కాలిక ప్రణాళికలు రూపొందించి, సాధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వగలుగుతారు. ఇప్పుడున్న విధానంలో సైన్యం, వైమానికదళం, నావికాదళం–ఈ మూడూ ఖరారు చేసే ప్రతిపాదనలు రక్షణ కార్యదర్శి వద్దకు వెళ్లడం, దానిపై ఆయన తన అభిప్రాయాన్ని జోడించి రక్షణమంత్రికి ఇవ్వడం, చివరిగా అత్యున్నత స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే రక్షణ దళాల అవసరాలను అర్ధం చేసుకుని, ప్రభుత్వం వాటిని తీర్చే క్రమంలో ఉన్నతాధికార వ్యవస్థ పెను అడ్డంకిగా వున్నదని త్రివిధ దళాల్లో ఎప్పటినుంచో అసం తృప్తివుంది. జవాన్లకు మెరుగైన ఆయుధాలు, వాహనాలు, ఇతర సామగ్రి సకాలంలో సమకూ రడానికి ఉన్నతాధికార గణం ఆమోదం తప్పనిసరికావడం, వారు క్షేత్రస్థాయి స్థితిగతుల్ని పరిగణన లోకి తీసుకోకుండా జాప్యం చేయడం పెను సమస్యగా వున్నదని రక్షణ సిబ్బంది తరచు ఫిర్యాదు చేస్తున్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత ఈ సీడీఎస్ నియామకం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అందుకోసం మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో త్రివిధ దళాధిపతుల మధ్య ఏకాభిప్రాయంలేక మూలనబడింది. అయితే ఉన్నతాధికార గణం కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందంటారు. సీడీఎస్ నియామకంతో అధికారాలన్నీ ఆయన వద్దనే కేంద్రీకృతమవుతాయని, తమ మాటకు విలువుండదని రక్షణ శాఖ ఉన్నతాధికారులు మొరపెట్టుకున్నారని చెబుతారు. కారణమేదైనా ఆ ప్రతిపాదన ఆగిపోయింది. అయితే అప్పటినుంచీ అడపా దడపా రక్షణ నిపుణులు దీనిపై పునరాలోచించమని ప్రభుత్వాన్ని కోరుతూనేవున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాల కమిటీ ఒకటి పనిచేస్తోంది. ఆ ముగ్గురిలోనూ సీనియర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూడు విభాగాలకు సంబంధించి ఆయన సలహాలివ్వరు. ఆ బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) చూస్తున్నారు. వాస్తవానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలోనే సీడీఎస్ ప్రతిపాదన చర్చ కొచ్చింది. ఆఖరి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లార్డ్ మౌంట్‌బాటన్ నెహ్రూతో దీన్ని ప్రస్తావించినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని లెఫ్టినెంట్ జనరల్ ఎంఎల్ ఛిబ్బర్ ఒక గ్రంథంలో రాశారు. అప్పటి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ కె.ఎస్. తిమ్మయ్యను సీడీఎస్‌గా నియమిస్తే బాగుంటుందని కూడా ఆయన సూచించారట. కానీ జనరల్ తిమ్మయ్య విషయంలో నెహ్రూకు అభ్యంతరం వుండటం వల్ల కావొచ్చు... ఆయన అందుకు అంగీకరించలేదు. దాని పర్యవసానాలు 1962 చైనా యుద్ధంలో దేశం చవిచూసింది. అప్పటి ప్రభుత్వం క్షేత్రస్థాయి అంశాలు సైనిక దళాలకు విడిచి, వారిపై పర్యవేక్షణాధికారాన్ని అనుభవంలేని ఉన్నతాధికార గణానికి అప్ప జెప్పింది. త్రివిధ దళాల మధ్య సమన్వయలోపంతో స్వల్పకాలంలోనే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సర్వాధికారాలూ సీడీఎస్‌లో కేంద్రీకృతమైతే ఆ పదవిలో వుండేవారు శక్తిమంతులుగా మారతారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని కొందరు వాదిస్తారు. అయితే ప్రపం చంలో 68 దేశాల్లో సీడీఎస్ వ్యవస్థ చాన్నాళ్లుగా అమల్లోవుంది. యుద్ధ సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించాకే అవన్నీ సీడీఎస్‌కు మొగ్గుచూపాయి. పైగా ఇప్పుడు సైనిక రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. యుద్ధ రీతులు పూర్తిగా మారాయి. వేగంగా ముగిసే మెరుపు యుద్ధాలు, పరిమితకాలంపాటు మాత్రమే కొనసాగే ఘర్షణలు రివాజయ్యాయి. అణ్వాయుధాలు సరే... రిమోట్ కంట్రోల్ ఆయుధాలు, ద్రోన్‌లద్వారా లక్ష్యాలు ఛేదించడం, కృత్రిమ మేధతో పని చేసే స్వయంచాలిత ఆయుధాలు రంగంలోకొచ్చాయి. అయితే సీడీఎస్ పేరుతో మరో ఉన్నత పదవి సృష్టించడం మాత్రమే జరిగితే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. దానికి అనుగుణంగా త్రివిధ దళాల్లో వేర్వేరు స్థాయిల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలి. త్రివిధ దళాలకు ప్రస్తుతం మొత్తం 19 భౌగోళిక(కమాండ్) వ్యవస్థలున్నాయి. ఇందులో సైన్యానికి ఆరు, నావికా దళానికి మూడు, వైమానిక దళానికి ఏడు వున్నాయి. వీటన్నిటి మధ్యా సమన్వయం సాధించేలా, ఒకే కమాండ్‌కింద పనిచేసేలా పునర్వ్యవస్థీకరించడం అవసరం. రక్షణ దళాలను ఆధునీకరించి, ఆమేరకు సిబ్బందిని కుదిస్తారని ఆమధ్య కథనాలు వెలువడ్డాయి. అది జరగడంతోపాటు భద్రతకు సంబంధించిన అంశాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుచూపుతో వ్యవహరించగల పటిష్టమైన వ్యవస్థ రూపొందితే అది దేశాన్ని శత్రుదుర్భేద్యంగా మారుస్తుంది. -
ఆయుధ సామగ్రికి 15వేల కోట్లు
న్యూఢిల్లీ: భారత రక్షణ బలగాలకు అవసరమైన యుద్ధసామగ్రిని దేశీయంగా తయారుచేసేందుకు రూ. 15 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టుకు ఆర్మీ పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమైన ఆయుధాలు, యుద్ధ ట్యాంకుల కోసం వివిధ రకాల మందుగుండు, యుద్ధ సామగ్రిని భారత్‌లోనే తయారుచేస్తారు. సైన్యానికి అవసరమైన మందుగుండు దిగుమతుల్లో భారీ జాప్యాన్ని నివారించడంతో పాటు.. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు అవసరమయ్యే మందుగుండు నిల్వల పరిమాణాల్ని తగ్గించేందుకు కూడా ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో 11 ప్రైవేటు సంస్థలు పాలుపంచుకోనున్నాయి. దీని అమలును ఆర్మీ, రక్షణ శాఖలోని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఎంతో రహస్యంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు తక్షణ లక్ష్యం.. యుద్ధం సమయంలో 30 రోజులకు అవసరమైన యుద్ధ సామగ్రిని అందించడం కాగా.. దీర్ఘకాలంలో దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడం. ‘మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 15 వేల కోట్లు.. 10 ఏళ్లకు సంబంధించి తయారు చేయాల్సిన యుద్ధ సామగ్రి పరిమాణంపై లక్ష్యాన్ని పెట్టుకున్నాం’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. మొదటి దశలో రాకెట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఆర్టిలరీ గన్స్, పదాతి దళం కోసం యుద్ధ వాహనాలు, గ్రనేడ్ లాంచర్లు, యుద్ధ రంగంలో వాడే వివిధ ఆయుధాల్ని నిర్దేశిత గడువులోగా తయారుచేస్తారు. మందుగుండు నిల్వలు వేగంగా తగ్గిపోవడంపై కొన్నేళ్లుగా ఆర్మీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చైనా తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధ సామగ్రి తయారీపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టింది. -
అణు జలాంతర్గామి అరిధామన్ ప్రవేశం
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. భారత రక్షణరంగం శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే ధీశాలి ఐఎన్ఎస్ అరిధామన్ నేవీలో చేరడానికి తొలి అడుగు వేసింది. భారత అణు జలాంతర్గాముల శ్రేణిలో తొలి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ 2009 జూలైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అదే శ్రేణిలోని రెండో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధామన్ ఆదివారం రంగప్రవేశం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ అణు జలాంతర్గామిని విశాఖలోని నేవల్ డాక్ యార్డులో కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత రహ స్యంగా ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఇలాంటి కార్యక్రమాలను రహస్యంగా నిర్వహించడం రక్షణశాఖలో పరిపాటి. ఇప్పటివరకూ ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు మాత్రమే అణు జలాంత ర్గాములను కలిగి ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిహంత్‌తో న్యూక్లియర్ సబ్మెరైన్లు కలిగిన ఆరో దేశంగా భారత్ చేరింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టు కింద మొత్తం ఐదు అణు జలాంతర్గాములను నావికా దళం కోసం భారత్ నిర్మించతలపెట్టింది. ఇందులో మొదటిది ఐఎన్ఎస్ అరిహంత్, రెండోది అరిధామన్. స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ నేవల్ డాక్యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్లో ఈ ఐదు అణు జలాంతర్గాము ల నిర్మాణం జరుగుతోంది. ఐఎన్ఎస్ అరిహంత్‌కంటే అరిధామన్ రెట్టింపు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిధామన్ సముద్ర సన్నాహాలు, ఇతర అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకుని నేవీలో చేర డానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. -
ఉద్రిక్తతలను నివారిద్దాం!
భారత్, పాక్ నిర్ణయం జమ్మూ: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు, ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేయాలని ఇరు దేశాల సీనియర్ సైనిక అధికారులు నిర్ణయించారు. కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టర్ పరిధిలో చకన్ దా బాగ్‌లో జరిగిన భేటీలో ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయని భారత రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. కాల్పుల ఉల్లంఘన, పౌరులపై దాడులు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. కాల్పులు, మోర్టార్ దాడులతో పాక్ విరుచుకుపడిన 20 రోజుల తర్వాత ఇరుదేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన తొలి భేటీ ఇది. ‘దుశ్చర్యలు ఆపితేనే సత్సంబంధాలు’ సాంబా(కశ్మీర్): భారత్‌తో సత్సంబంధాలు కావాలనుకుంటే ఉగ్రవాదం, సరిహద్దులనుంచి చొరబాట్లు, సరిహద్దుల ఉల్లంఘన వంటి దుశ్చర్యలను నిలిపివేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పాకిస్తాన్, చైనాలకు స్పష్టంచేశారు. పొరుగుదేశాలపై ఆక్రమణలకు పాల్పడే ఉద్దేశాలు భారత్‌కు లేవని పేర్కొన్నారు. భారత్ ఇరుగు, పొరుగు దేశాలతో ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని చెప్పారు. సోమవారం ఆయన జమ్మూకశ్మీర్‌లో సరిహద్దులవద్ద కొత్తగా నిర్మించిన ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసుల కేంద్రాన్ని ప్రారంభించి ప్రసంగించారు.