![Ministry of Defense contracts with BrahMos Aerospace - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/25/brahmos.jpg.webp?itok=sP1LoxTZ)
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత రక్షణ దళం మరో కీలక అడుగు ముందుకువేసింది. సముద్ర జలాల్లోకి అడుగు పెట్టాలంటే దాయాది దేశాలకు భయం పుట్టేలా చేసేందుకు ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటున్న భారత నౌకాదళం... మిసైల్స్ మహారాజుగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది. అత్యంత శక్తిమంతమైన, భారత నౌకాదళ ప్రధాన ఆయుధమైన బ్రహ్మోస్ క్షిపణులను ప్రతి యుద్ధ నౌకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు భారత్, రష్యా జాయింట్ వెంచర్‌గా ఉన్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ మన దేశంలోనే రూపొందిస్తున్న బ్రహ్మోస్ క్షిపణులను భారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.19 వేల కోట్లతో 200 మిసైల్స్ కొనుగోలు చేసేలా బ్రహ్మోస్ ఏరోస్పేస్‌తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో ఎంవోయూ చేసుకుంది. భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్లని ఏర్పాటు చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బ్రహ్మోస్ కొనుగోలుకు ఫిలిప్పీన్స్ ఒప్పందం
భారతదేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీ¯న్స్ నిలిచింది. దాదాపు 375 మిలియన్ డాలర్లతో మిసైల్స్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదర్చుకుంది.
ఇటీవల చైనా నుంచి కవ్వింపు చర్యలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ ఇబ్బందులు పడుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు బ్రహ్మోస్‌ను కీలక ఆయుధంగా మలచుకోవాలని ఫిలిప్పీన్స్ భావించి ఈ ఒప్పందం చేసుకుంది. బ్రహ్మోస్ మాత్రమే కాకుండా తేజస్ యుద్ధ విమానాలను సైతం కొనుగోలు చేసేందుకు ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందని భారత నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి.
భారత్‌తో భాగస్వామ్యం కోసం అన్ని దేశాల ఆసక్తి
సాగర జలాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కష్టాల్లో ఏ దేశం ఉన్నా సాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటోంది భారత నౌకాదళం. ఇటీవల సముద్రపు దొంగల దాడుల్లో పలు దేశాల వర్తక నౌకలు చిక్కుకోవడంతో వాటిని కాపాడే బాధ్యతను ఇండియన్ నేవీ తీసుకుని సఫలీకృతమైంది.
అందువల్ల భారత్‌తో భాగస్వామ్యం పెంచుకునేందుకు అన్ని దేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా జరుగుతున్న మిలాన్–2024లో రికార్డు స్థాయిలో ఏకంగా 51 దేశాలు పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు నౌకాదళంలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.
స్వావలంబన దిశగా భారత్
బ్రహ్మోస్ క్షిపణి ఎగు మతి వల్ల దేశ రక్షణ రంగంలో స్వావలంబన పెరుగుతుంది. భారతదేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి, విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది. భారత నావికాదళం 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించేదిశగా అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment