ఇరుగుపొరుగుతో శాంతిని కోరుకుంటూనే, అందుకోసం చేయాల్సిందంతా చేస్తూనే యుద్ధం వచ్చే పక్షంలో శత్రువును సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అనువుగా రక్షణ దళాలను తీర్చిదిద్దడం, వాటికి అవసరమైన సమస్తమూ అందుబాటులో ఉంచడం ఏ దేశానికైనా తప్పనిసరి. ఎందుకంటే యుద్ధం వద్దని ఒక పక్షం కోరుకుంటే సరిపోదు. అవతలి పక్షం కూడా వాంఛించాలి. యుద్ధ నిపు ణుల అభిప్రాయం ప్రకారం శత్రువే చాలాసార్లు యుద్ధాన్ని నిర్ణయిస్తాడు. కనుకనే మన త్రివిధ దళాలను స్వతంత్రంగా పర్యవేక్షించడానికి రక్షణ దళాల అధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్– సీడీఎస్)ని నియమించాలని కేంద్ర మంత్రివర్గం మంగళవారం తీసుకున్న నిర్ణయం అన్నివిధాలా సబబైనది. ఈ విషయమై మొన్న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పుడు అనేకమంది దాన్ని స్వాగతించారు.
త్రివిధ దళాల అధిపతులు ఎవరికి వారు వారి వారి విభాగాల నిర్వహణలో నిత్యం తలమునకలైవుంటారు. ప్రధాని, రక్షణమంత్రి ఆ విభా గాలకు ఎదురవుతున్న సమస్యలేమిటో, వాటిని తీర్చడానికి అనుసరించాల్సిన విధానమేమిటో తెలుసుకోవాలంటే ఈ ముగ్గురితో విడివిడిగా సమావేశం కావడం ప్రస్తుతం తప్పనిసరవుతోంది. రక్షణ దళాల అధిపతి వస్తే, ఆయన ఆ మూడు విభాగాలనూ పర్యవేక్షిస్తూ, వాటికి కావలసిన దీర్ఘ కాలిక ప్రణాళికలు రూపొందించి, సాధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వగలుగుతారు.
ఇప్పుడున్న విధానంలో సైన్యం, వైమానికదళం, నావికాదళం–ఈ మూడూ ఖరారు చేసే ప్రతిపాదనలు రక్షణ కార్యదర్శి వద్దకు వెళ్లడం, దానిపై ఆయన తన అభిప్రాయాన్ని జోడించి రక్షణమంత్రికి ఇవ్వడం, చివరిగా అత్యున్నత స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే రక్షణ దళాల అవసరాలను అర్ధం చేసుకుని, ప్రభుత్వం వాటిని తీర్చే క్రమంలో ఉన్నతాధికార వ్యవస్థ పెను అడ్డంకిగా వున్నదని త్రివిధ దళాల్లో ఎప్పటినుంచో అసం తృప్తివుంది.
జవాన్లకు మెరుగైన ఆయుధాలు, వాహనాలు, ఇతర సామగ్రి సకాలంలో సమకూ రడానికి ఉన్నతాధికార గణం ఆమోదం తప్పనిసరికావడం, వారు క్షేత్రస్థాయి స్థితిగతుల్ని పరిగణన లోకి తీసుకోకుండా జాప్యం చేయడం పెను సమస్యగా వున్నదని రక్షణ సిబ్బంది తరచు ఫిర్యాదు చేస్తున్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత ఈ సీడీఎస్ నియామకం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అందుకోసం మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో త్రివిధ దళాధిపతుల మధ్య ఏకాభిప్రాయంలేక మూలనబడింది. అయితే ఉన్నతాధికార గణం కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందంటారు.
సీడీఎస్ నియామకంతో అధికారాలన్నీ ఆయన వద్దనే కేంద్రీకృతమవుతాయని, తమ మాటకు విలువుండదని రక్షణ శాఖ ఉన్నతాధికారులు మొరపెట్టుకున్నారని చెబుతారు. కారణమేదైనా ఆ ప్రతిపాదన ఆగిపోయింది. అయితే అప్పటినుంచీ అడపా దడపా రక్షణ నిపుణులు దీనిపై పునరాలోచించమని ప్రభుత్వాన్ని కోరుతూనేవున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాల కమిటీ ఒకటి పనిచేస్తోంది. ఆ ముగ్గురిలోనూ సీనియర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూడు విభాగాలకు సంబంధించి ఆయన సలహాలివ్వరు. ఆ బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) చూస్తున్నారు.
వాస్తవానికి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలోనే సీడీఎస్ ప్రతిపాదన చర్చ కొచ్చింది. ఆఖరి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లార్డ్ మౌంట్‌బాటన్ నెహ్రూతో దీన్ని ప్రస్తావించినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని లెఫ్టినెంట్ జనరల్ ఎంఎల్ ఛిబ్బర్ ఒక గ్రంథంలో రాశారు. అప్పటి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ కె.ఎస్. తిమ్మయ్యను సీడీఎస్‌గా నియమిస్తే బాగుంటుందని కూడా ఆయన సూచించారట. కానీ జనరల్ తిమ్మయ్య విషయంలో నెహ్రూకు అభ్యంతరం వుండటం వల్ల కావొచ్చు... ఆయన అందుకు అంగీకరించలేదు.
దాని పర్యవసానాలు 1962 చైనా యుద్ధంలో దేశం చవిచూసింది. అప్పటి ప్రభుత్వం క్షేత్రస్థాయి అంశాలు సైనిక దళాలకు విడిచి, వారిపై పర్యవేక్షణాధికారాన్ని అనుభవంలేని ఉన్నతాధికార గణానికి అప్ప జెప్పింది. త్రివిధ దళాల మధ్య సమన్వయలోపంతో స్వల్పకాలంలోనే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సర్వాధికారాలూ సీడీఎస్‌లో కేంద్రీకృతమైతే ఆ పదవిలో వుండేవారు శక్తిమంతులుగా మారతారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని కొందరు వాదిస్తారు. అయితే ప్రపం చంలో 68 దేశాల్లో సీడీఎస్ వ్యవస్థ చాన్నాళ్లుగా అమల్లోవుంది.
యుద్ధ సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించాకే అవన్నీ సీడీఎస్‌కు మొగ్గుచూపాయి. పైగా ఇప్పుడు సైనిక రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. యుద్ధ రీతులు పూర్తిగా మారాయి. వేగంగా ముగిసే మెరుపు యుద్ధాలు, పరిమితకాలంపాటు మాత్రమే కొనసాగే ఘర్షణలు రివాజయ్యాయి. అణ్వాయుధాలు సరే... రిమోట్ కంట్రోల్ ఆయుధాలు, ద్రోన్‌లద్వారా లక్ష్యాలు ఛేదించడం, కృత్రిమ మేధతో పని చేసే స్వయంచాలిత ఆయుధాలు రంగంలోకొచ్చాయి.
అయితే సీడీఎస్ పేరుతో మరో ఉన్నత పదవి సృష్టించడం మాత్రమే జరిగితే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. దానికి అనుగుణంగా త్రివిధ దళాల్లో వేర్వేరు స్థాయిల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలి. త్రివిధ దళాలకు ప్రస్తుతం మొత్తం 19 భౌగోళిక(కమాండ్) వ్యవస్థలున్నాయి. ఇందులో సైన్యానికి ఆరు, నావికా దళానికి మూడు, వైమానిక దళానికి ఏడు వున్నాయి. వీటన్నిటి మధ్యా సమన్వయం సాధించేలా, ఒకే కమాండ్‌కింద పనిచేసేలా పునర్వ్యవస్థీకరించడం అవసరం. రక్షణ దళాలను ఆధునీకరించి, ఆమేరకు సిబ్బందిని కుదిస్తారని ఆమధ్య కథనాలు వెలువడ్డాయి. అది జరగడంతోపాటు భద్రతకు సంబంధించిన అంశాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుచూపుతో వ్యవహరించగల పటిష్టమైన వ్యవస్థ రూపొందితే అది దేశాన్ని శత్రుదుర్భేద్యంగా మారుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment