
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. భారత రక్షణరంగం శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే ధీశాలి ఐఎన్‌ఎస్ అరిధామన్ నేవీలో చేరడానికి తొలి అడుగు వేసింది. భారత అణు జలాంతర్గాముల శ్రేణిలో తొలి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అరిహంత్ 2009 జూలైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అదే శ్రేణిలోని రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిధామన్ ఆదివారం రంగప్రవేశం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ అణు జలాంతర్గామిని విశాఖలోని నేవల్ డాక్ యార్డులో కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత రహ స్యంగా ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చాలా గోప్యంగా ఉంచారు.
ఇలాంటి కార్యక్రమాలను రహస్యంగా నిర్వహించడం రక్షణశాఖలో పరిపాటి. ఇప్పటివరకూ ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు మాత్రమే అణు జలాంత ర్గాములను కలిగి ఉన్నాయి. ఐఎన్‌ఎస్ అరిహంత్‌తో న్యూక్లియర్ సబ్‌మెరైన్లు కలిగిన ఆరో దేశంగా భారత్ చేరింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టు కింద మొత్తం ఐదు అణు జలాంతర్గాములను నావికా దళం కోసం భారత్ నిర్మించతలపెట్టింది. ఇందులో మొదటిది ఐఎన్‌ఎస్ అరిహంత్, రెండోది అరిధామన్. స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ నేవల్ డాక్‌యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ ఐదు అణు జలాంతర్గాము ల నిర్మాణం జరుగుతోంది. ఐఎన్‌ఎస్ అరిహంత్‌కంటే అరిధామన్ రెట్టింపు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిధామన్ సముద్ర సన్నాహాలు, ఇతర అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకుని నేవీలో చేర డానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment