న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి వ్యవహారం సెగలు రాజేస్తూనే ఉంది. రఫేల్ ఫైటర్‌జెట్ల సరఫరా కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ఫ్రాన్స్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘డసాల్ట్ ఏవియేషన్’ భారత్‌కు చెందిన సుశేన్ గుప్తా అనే మధ్యవర్తికి 2007–12కాలంలో కమీషన్ల కింద 7.5 మిలియన్ యూరోలు(రూ.65 కోట్లు) చెల్లించినట్లు ఫ్రెంచ్ పరిశోధన పత్రిక ‘మీడియాపార్ట్’ ఆరోపించింది. కమీషన్లు చేతులు మారడానికి వీలుగా డొల్ల కంపెనీల పేరిట నకిలీ రశీదులను సృష్టించి వాడారంది. ఆ రశీదులను ప్రచురించింది. అయితే, దీనిపై భారత రక్షణ శాఖ గానీ, డసాల్ట్ ఏవియేషన్ స్పందించలేదు.
యూపీఏ సర్కారు హయాంలో కుదిరిన పాత ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.59వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వంతో కొత్త ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు వెనుక భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రఫేల్ డీల్‌లో అవినీతికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ భారత్‌లోని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఎందుకు మౌనంగా ఉంటున్నాయని మీడియాపార్ట్ ప్రశ్నించింది. రఫేల్ ఒప్పందంలో విదేశీ కంపెనీలు, మోసపూరిత కాంట్రాక్టులు, నకిలీ రశీదుల ప్రమేయం కనిపిస్తోందని, 2018 అక్టోబర్ నుంచి ఆధారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయినా విచారణ జరపొద్దని సీబీఐ, ఈడీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని మీడియాపార్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఒక్కో రఫేల్ ఫైటర్‌జెట్‌ను రూ.526 కోట్లకు కొనుగోలు చేసేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదిరిందని, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఒక్కో విమానాన్ని రూ.1,670 కోట్లకు కొంటోందని, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రఫేల్ ఒప్పందంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కమీషన్లు చేతులు మారాయని బీజేపీ నేత అమిత్ మాలవియా చెప్పారు.
‘రఫేల్’పై ఆధారాలున్నా మౌనమెందుకు?
Published Tue, Nov 9 2021 2:19 AM | Last Updated on Tue, Nov 9 2021 2:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment