బెజవాడ అడ్రస్‌తో బురిడీ.. గమ్యస్థానం ఢిల్లీయే.. | Central Home Department clarified About Heroin Smuggling | Sakshi
Sakshi News home page

బెజవాడ అడ్రస్‌తో బురిడీ.. గమ్యస్థానం ఢిల్లీయే..

Published Fri, Oct 8 2021 4:46 AM | Last Updated on Fri, Oct 8 2021 10:35 AM

Central Home Department clarified About Heroin Smuggling - Sakshi

సాక్షి, అమరావతి: ఇటీవల గుజరాత్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ నిల్వలతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) వర్గాలు స్పష్టం చేశాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి ఇరాక్‌ మీదుగా గుజరాత్‌కు దిగుమతైన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ గమ్యస్థానం దేశ రాజధాని ఢిల్లీయేనని  ప్రాథమికంగా నిర్ధారించింది. డీఆర్‌ఐ, ఇతర నిఘా సంస్థలను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నట్లు తుది అంచనాకు వచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడిన డ్రగ్స్‌ అక్రమ తరలింపు కేసులో దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. హెరాయిన్‌ దిగుమతితో ఏపీకి సంబంధం లేదని ఈ కేసుకు సంబంధించిన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. 

విజయవాడకు సంబంధమే లేదు... 
ఈ కేసులో చెన్నైకు చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య గోవిందరాజు దుర్గాపూర్ణిమ వైశాలితోపాటు ఆరుగురు అఫ్గాన్‌వాసులు, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఓ మహిళను డీఆర్‌ఐ ఇప్పటికే అరెస్టు చేసింది. అఫ్గానిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా హెరాయిన్‌ దిగుమతి దందాలో సుధాకర్‌ దంపతులను కమీషన్‌ ప్రాతిపదికన వాడుకుందని డీఆర్‌ఐ ప్రాథమికంగా గుర్తించింది. ఈ క్రమంలోనే నిందితులు విజయవాడ చిరునామాతో రిజిస్టర్‌ చేసిన అషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరును వాడుకునేందుకు సమ్మతించారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన ముఠా సభ్యులే మన దేశంలోనూ తిష్టవేసి డ్రగ్స్‌ రాకెట్‌ నడిపించారు.

సెప్టెంబర్‌ 14, 15వ తేదీల్లో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన రెండు కంటైనర్ల హెరాయిన్‌ను డీఆర్‌ఐ జప్తు చేసిన విషయం విదితమే. అషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో జూన్‌లో కూడా అఫ్గానిస్తాన్‌ నుంచి రెండు కంటైనర్ల హెరాయిన్‌ను ముంద్రా పోర్టులో దిగుమతి చేసి గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీకి తరలించినట్లు విచారణలో వెల్లడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రెండు కంటైనర్ల హెరాయిన్‌ను గుజరాత్‌ నుంచి నేరుగా ఢిల్లీకి తరలించారని, విజయవాడకుగానీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ఇతర చోట్లకుగానీ తరలించలేదన్నది కీలక అంశమని డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు. అంటే కేవలం తమ కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వినియోగించుకున్నారని, హెరాయిన్‌ స్మగ్లింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైందని డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు.

ప్రాధాన్యం సంతరించుకున్న న్యాయమూర్తి వ్యాఖ్యలు 
గుజరాత్‌లో హెరాయిన్‌ జప్తు కేసులో అరెస్టైన నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విజయవాడకు చెందిన సంస్థ హెరాయిన్‌ను దిగుమతి చేసుకుంటే పశ్చిమ తీరాన గుజరాత్‌లో ఉన్న ముంద్రా పోర్టుకు ఎందుకు తెస్తారు? విజయవాడకు సమీపంలో తూర్పు తీరంలోనే పలు పోర్టులు ఉన్నాయి కదా? అని పేర్కొన్నారు. హెరాయిన్‌ను ఢిల్లీకి తరలించాలన్నదే స్మగ్లర్ల ఉద్దేశమని డీఆర్‌ఐ కూడా న్యాయస్థానానికి తెలిపింది. విజయవాడకు చేర్చడం అసలు స్మగ్లర్ల లక్ష్యమే కాదని పేర్కొంది.

స్మగ్లింగ్‌ ముఠా అంతా అఫ్గానిస్తాన్, ఇరాన్, ఢిల్లీల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. చెన్నై నుంచి అఫ్గానిస్తాన్‌లోని ముఠా సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి హెరాయిన్‌ను గుజరాత్‌ తీరానికి తెప్పించి ఢిల్లీకి తరలిస్తున్నారని తెలిపింది. అఫ్గానిస్తాన్, ఇరాన్‌లోని ముఠాలు నడుపుతున్న ఈ దందాలో ఉగ్రవాద, దేశ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నట్లు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ స్మగ్లింగ్‌ కేసులు విచారించే డీఆర్‌ఐ కాకుండా ఉగ్రవాద నేరాలను దర్యాప్తు చేసే ‘ఎన్‌ఐఏ’కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement