శిరీష ఇంటివద్ద పోలీసు బలగాలు
సాక్షి, అమరావతి/టంగుటూరు/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పర్యవేక్షణలో ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బంది విజయవాడ, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో పలువురు మావోయిస్టు సానుభూతిపరుల నివాసాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే సోదాలు నిర్వహించడం ప్రారంభించారు. మావోయిస్టు పార్టీలో రిక్రూట్‌మెంట్లకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 10 గంటలకు పైగా సోదాలు నిర్వహించి, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
విజయవాడ సింగ్‌నగర్‌లోని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర (కేఎన్‌పీఎస్) అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, కొత్త రాజరాజేశ్వరిపేటలో పట్టపు జ్యోతి (డప్పు రమేష్ భార్య) నివాసాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేశాయి. ఇక ప్రకాశంజిల్లాలోని ఆలకూరపాడులోని మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష అలియాస్ రమాదేవి వాసంలోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె నివాసంలో లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. శిరీష ఇంటి పరిసరాల్లో 200 మీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రజలను, మీడియాను రాకుండా నిలువరించారు.
తహసీల్దారు, వీఆర్‌ఏ సమక్షంలో ఎన్‌ఐఏ అధికారులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థినిని దళాలకు వైద్యం చేసేలా నియమించుకుని, దళం వైపు అకర్షించేలా చేశారని వైద్య విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు క్రమంలోనే ఈ తనిఖీలు చేసినట్లు తెలిసింది. కాగా, విజయవాడలో దుడ్డు ప్రభాకర్ నివాసంలో ఎన్‌ఐఏ అధికారుల తనిఖీలు చేయడానికి వ్యతిరేకంగా విరసం, కేఎన్‌పీఎస్, ఇఫ్టూ తదితర ప్రజా సంఘాలు నిర్వహించిన ధర్నాలో శిరీష పాల్గొన్నారు. తన భర్త, కుమారుడు చనిపోయాక టైలరింగ్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న తమ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment