సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనిత, ఇంట్లో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్, హన్మకొండలో సోదాలు చేపట్టింది. న్యూ ప్రకాష్రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఎన్సోఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.
స్థానిక పోలీసులు అనిత ఇంటివద్ద మోహరించి అటు వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్తగా మహిళా చైతన్య కార్యక్రమాలు అనిత నిర్వహిస్తారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనిత ఇంట్లో మూడుగంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు మహిళల మ్యానిఫెస్టో, పాటల పుస్తకాలు తీసుకెళ్ళారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. గతంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఉండేదని ప్రస్తుతం కమిటీలు లేవని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమ ఆక్టివిటీస్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు నెలలకు ఓసారి సమావేశం నిర్వహిస్తామని మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో రాసుకున్న బుక్ ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్ళారని చెప్పారు. గతంలో కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలిపారు.
మహిళలకు సమాజంలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడొద్దని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో వారం రోజులుగా పోలీస్ ప్రత్యేక బలగాలు సరిహద్దులో మోహరించి కూంబింగ్ చేపట్టాయి. ఓ వైపు సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ మరోవైపు మావోయిస్టుల సానుభూతిపరుల గురించి ఎన్ఐఏ ఆరా తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అనిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment