నాసిర్, ఇమ్రాన్
సాక్షి, సిటీబ్యూరో: దర్భంగ రైల్వే స్టేషన్‌లో జరిగిన విస్ఫోటం కేసులో అరెస్టు అయిన లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్‌లు తండ్రికి తగని కుమారులని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. వీరి తండ్రి మూసా ఖాన్ ఆర్మీలో పనిచేసి చైనాపై పోరాడగా.. ఈ ద్వయం హైదరాబాద్‌లో ఉండి పాకిస్థాన్ కోసం పని చేశారని వివరిస్తున్నారు.
ఈ ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శుక్రవారం పట్నాలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పట్నా సెంట్రల్ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
1962 యుద్థంలో పాల్గొన్న మూసా...
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా ఖైరానానగర్‌లో ఉన్న మొహల్లా ఖయాస్తవాడ ప్రాంతానికి చెందిన మూసా ఖాన్‌ది వ్యవసాయ కుటుంబం. చిన్న వయస్సులోనే ఆర్మీలో సైనికుడిగా చేరిన మూసా 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధంలో పాల్గొన్నాడు. భారత సైనికుల తరఫున కీలకపాత్ర పోషించిన ఈయన ఆ యుద్ధం తర్వాత పదవీ విరమణ పొందారు. ఆపై ఖైరానానగర్‌లోనే వంట సామాగ్రి విక్రయించే దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. తన కుమారులను లష్కరేతొయిబా ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారనే విషయం మీడియా వచ్చిన బుధవారం నుంచి ఇల్లు, దుకాణానికి తాళం వేసిన మూసా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎన్‌ఐఏ అధికారులు చెప్తున్నారు.
ఉగ్రవాదులు, సికింద్రాబాద్ స్టేషన్ వద్ద కారు నుంచి పార్శిల్ దింపుతున్న సీసీ టీవీ ఫుటేజ్
అటు ఉగ్రవాదులు..ఇటు మాఫియా...
రెండు నెలల క్రితం వరకు ఇమ్రాన్ ఖాన్ తండ్రి దుకాణంలోనే ఉంటూ ఆ వ్యాపారంలోనే ఉంటూ సహకరించాడు. కొన్నాళ్ల క్రితం ఇతడికి పాకిస్థాన్‌లో ఉంటున్న ఇక్బాల్ ఖానాతో పరిచయమైంది. కొన్నేళ్లుగా పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం పని చేస్తున్న ఇతగాడు భారత్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఇక్బాల్‌పై నకిలీ నోట్ల సరఫరా, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం వంటి అనేక కేసు లు నమోదై ఉన్నాయి. ఇతడి ఆదేశాలతో 2012లో తన బంధువుల వద్దకు వెళ్తున్నట్లు వీసా తీసుకున్న ఇమ్రాన్ పాకిస్థాన్‌కు వెళ్లాడు. అక్కడి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఎల్‌ఈటీ ట్రైనింగ్ క్యాంప్‌లో నాలుగు నెలల పాటు ఉగ్రవాద శిక్షణ పొందాడు.
ఖైరానాలో జరిగిన కుట్ర...
దర్భంగ విస్ఫోటనానికి సంబంధించిన కుట్ర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానాలో ఉన్న లష్కరేతొయిబా ఉగ్రవాది మహ్మద్ సలీం అహ్మద్ అలియాస్ హాజీ సలీం ఇంట్లో సమావేశమైన ఉగ్రవాదులు ఈ మేరకు కుట్ర చేశారు. ఈ మీటింగ్‌లో హాజీతో పాటు అతడి కుమారుడు ఖఫీల్, నగరం నుంచి వెళ్లిన ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ పాల్గొన్నారు. కదిలే రైలుకు మంటలు అంటుకునేలా చేస్తే అది ఆగేలోపే భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు ఉంటాయని ఇలా చేశారని ఎన్‌ఐఏ పేర్కొంది.
పాకిస్థాన్‌లో ఉండి కథ నడుపుతున్న ఇక్బాల్ ఖానాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న హాజీనే ‘దర్భంగ కుట్ర’కు సూత్రధారని స్పష్టమైంది. ఇక్బాల్ నుంచి హాజీకి రూ.1.6 లక్షలు కోల్‌తాలోని హవాలా వ్యాపారి ద్వారా అందినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దాదాపు వారం రోజులుగా బీహార్ ఏటీఎస్ కస్టడీలో ఉన్న హాజీ, ఖఫీల్‌లను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
చదవండి: ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం.. బిల్ కలెక్టర్ బాగోతం
Comments
Please login to add a commentAdd a comment