నిందితుల్ని తీసుకువెళ్తున్న ఎన్‌ఐఏ టీమ్
సాక్షి, సిటీబ్యూరో: దర్భంగ ఎక్స్‌ప్రెస్ దహనానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు స్థానికంగా లభించే పదార్థాలతోనే ‘బాంబు’ తయారు చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నిర్ధారించింది. హబీబ్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లోని దుకాణాల నుంచి ఖరీదు చేసిన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించే దాన్ని తయారు చేసినట్లు తేల్చారు. వాస్తవానికి ఇది బాంబు కాదని మండుతూ చుట్టూ మంటలు వ్యాపించేలా డిజైన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా ఖైరాన ప్రాంతానికి చెందిన నాసిర్ మాలిక్ దాదాపు 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ సమీపంలో ఉన్న ఓ ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తున్నాడు. ఇక్కడి యువతినే వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఇతడి సోదరుడైన ఇమ్రాన్ మాలిక్ తమ స్వస్థలంలోనే ఉండేవాడు. ఖైరాన ప్రాంతానికే చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖానా అలియాజ్ హఫీజ్ ఇక్బాల్ అలియాస్ మాలిక్ భాయ్ 1993 నుంచి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నాడు.
ఇతడిపై సీబీఐ, ఢిల్లీ పోలీసు సహా అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. అక్కడ ఉంటూనే ఐఎస్‌ఐ సహకారంతో నకిలీ నోట్ల చెలామణితో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇక్బాలే కొన్నాళ్ల క్రితం ఆన్‌లైన్ ద్వారా ఇమ్రాన్‌ను ఉగ్రవాదం వైపు ఆకర్షించాడు.
యూట్యూబ్‌లో లింకులు షేర్..
స్థానికంగా దొరికే పదార్థాలతో వివిధ రకాల పేలుళ్లు సృష్టించడం ఎలా? అగ్ని ప్రమాదాలు జరిగేలా చేయడం ఎలా? తదితర అంశాలపై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తూ యూట్యూబ్‌లో ఉన్న కొన్ని వీడియోల లింకులూ షేర్ చేశాడు. దర్భంగ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేయాలనే కుట్రతో దాదాపు 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ఇమ్రాన్ తన సోదరుడు నాసిర్ వద్ద ఆశ్రయం పొందాడు. చిక్కడపల్లి, హబీబ్ నగర్‌ల్లోని వివిధ దుకాణాల నుంచి సేకరించిన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించి మంటలు సృష్టించే బాంబు వంటివి తయారు చేశాడు.
పాక్ నుంచి సూచనలు..
ఇంట్లోనే ఇమ్రాన్, నాసిర్‌లు రెండు మూడింటిని తయారు చేసి మండించి చూశారు. దీనికి సంబంధించిన సూచనల్ని పాక్ నుంచి ఇక్బాల్ ఖానా ఇస్తూనే ఉన్నాడు. ఇంట్లో ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలుసుకున్న ఇక్బాల్ ఓ టానిక్ సీసాలో ఈ మూడింటినీ నేర్పుగా ఏర్పాటు చేయించాడు. పేపర్, ఇంజెక్షన్ సిరంజ్‌లతో చేసిన ఏర్పాటు కారణంగా గరిష్టంగా 16 గంటల్లో ఈ మూడు కలిసి మంటలు చెలరేగేటా ప్లాన్ చేశారు. అయితే ఇమ్రాన్, నాసిర్‌లు 50 మిల్లీ లీటర్ల పరిమాణంలో తయారు చేసిన దాన్ని పక్కాగా రూపొందించలేకపోయారు.
ఫలితంగా ఆ సీసాలో ఉన్న రసాయనాలు బయటకు కారడంతో పాటు దర్భంగ రైల్వేస్టేషన్‌లో ఆ పార్శిల్ దింపిన కూలీ కింద పడేస్తే కానీ మంటలు అంటుకోలేదు. సికింద్రాబాద్‌లో పార్శిల్ ఆఫీస్‌లో ఈ అన్నదమ్ములు మహ్మద్ సూఫియాన్ పేరుతో ఇచ్చిన పాన్ కార్డు కాపీ సైతం ఇక్బాల్ వాట్సాప్ ద్వారా షేర్ చేశాడని ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కేసులో ఇమ్రాన్‌ను ప్రధాన నిందితుడిగా(ఏ1), నాసిర్‌ను రెండో నిందితుడిగా(ఏ2) చేర్చిన ఎన్‌ఐఏ వీరితో సంప్రదింపులు జరిపిన ఖైరాన వాసులు హాజీ సలీం, మహ్మద్ ఖాఫిల్‌ను మిగిలిన నిందితులుగా చేర్చాలని నిర్ణయించింది.
ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల అరెస్టు
బిహార్ రాష్ట్రం దర్బంగ రైల్వే స్టేషన్‌లో జరిగిన పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ముందడుగు వేసింది. ఘటనకు కారణమైన ఇద్దరు లష్కర్–ఎ–తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేసింది. యూపీలోని శాలినీ జిల్లాకు చెందిన ఇమ్రాన్ మాలిక్ అలియాస్ ఇమ్రాన్‌ఖాన్, నజీర్ ఖాన్ అలియాస్ నజీర్ మాలిక్ ప్రస్తుతం నాంపల్లిలో నివసిస్తున్నారు. ఈ నెల17న దర్బాంగా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబరు 1లోని ఓ పార్సిల్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ముజఫర్ నగర్ జిల్లా, దర్బంగా రైల్వే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
దర్యాప్తులో భాగంగా పార్సిల్ సికింద్రాబాద్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఉగ్రకోణాలు బయటపడటంతో కేసును ఈ నెల 24న ఎన్‌ఐఏకి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ లష్కర్–ఎ–తోయిబా దేశవ్యాప్తంగా పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిందని గుర్తించింది. పాకిస్తాన్ హండ్లర్ల ఆదేశాల మేరకు నజీర్ అతని సోదరుడు ఇమ్రాన్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ఈ పేలుడుకు ప్లాన్ చేశారని నిర్ధారించారు.
దుబాయ్ ఎందుకు వెళ్లారో..?
ఈ నలుగురూ కలిసి 2016లో దుబాయ్ వెళ్లారని గుర్తించిన దర్యాప్తు అధికారులు అది ఎందుకన్నది ఆరా తీస్తున్నారు. ఇమ్రాన్, నాసిర్‌లను ఎన్‌ఐఏ అధికారులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్‌పై బీహార్‌లోని పాట్నా ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చేందుకు వారిని ఇక్కడి నుంచి తరలించారు. ఇక్బాల్ ఖానా సైతం ఖైరానలో ఉండగా వస్త్ర వ్యాపారం చేసే వారు. ఇలానే ఇతడికి ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
హైదరాబాదే.. ఎందుకు?
ఒకవేళ వీరు భారీ విధ్వంసానికి పాల్పడే క్రమంలో దీన్ని ఒక ట్రయల్‌గా ఈ పేలుడుకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. పాకిస్తాన్ నుంచి పక్కాగా ఆదేశాలు అందాయి. నిందితులిద్దరూ ఇందుకోసం ఎన్‌క్రిప్టెడ్ సౌకర్యం ఉన్న అనేక రకాల సామాజిక మాధ్యమాలను వినియోగించారు. మొత్తానికి టెర్రర్ మాడ్యుల్‌ను పక్కాగా అమలు చేశారు.
అయితే హైదరాబాద్‌లో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉన్నందున ఎలాంటి నేరం జరిగినా నిందితులు కేవలం 24 గంటల్లో దొరికిపోతారు. ఈ విషయం నేరస్తులకు తెలుసు. అలాంటిది చిన్నపాటి పేలుడుకు కుట్ర పన్నినా.. పోలీసులు వెదుక్కుంటూ వస్తారన్న విషయం మాత్రం విస్మరిస్తారా? లేక వీరు మరేదైనా ప్లాన్ అమలు చేసే క్రమంలో దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చేందుకు ఈ పేలుడుకు పాల్పడ్డారా? అన్న కోణంలో ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది.
చదవండి: జూబ్లీహిల్స్: లైసెన్స్‌డ్ గన్‌కు పని చెప్పమంటావా..?
Comments
Please login to add a commentAdd a comment