టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా దుర్మరణం | TDP leader Lal Jan Basha dies in road accident | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా దుర్మరణం

Published Fri, Aug 16 2013 3:52 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా దుర్మరణం - Sakshi

టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా దుర్మరణం

సాక్షి, నార్కట్‌పల్లి/నల్లగొండ/హైదరాబాద్: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా (57) గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అత్యంత వేగంగా వెళ్తూ అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాషా గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరారు.
 
 8.30 గంటల సమయంలో ఆయన వాహనం నార్కట్‌పల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. మూడు పల్టీలు కొట్టి, అవతలివైపు పడింది. ఈ ప్రమాదంలో బాషా అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ ముజాఫర్ ఇక్బాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడం వల్లే బాషా మృతి చెందారని పోస్టుమార్టం నిర్వహించిన నల్లగొండ ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాషా భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నం.12 మిథిలానగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. సాయంత్రం గంటసేపు బాషా భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉంచి, అనంతరం ఆయన స్వస్థలం గుంటూరుకు తీసుకెళ్లారు. శుక్రవారం అంత్యక్రియలకు చంద్రబాబు, పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు హాజరవుతారు.
 
 బాషా దుర్మరణం గురించి తెలిసిన వెంటనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బయల్దేరి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అక్కడ బాషా మృతదేహాన్ని చూసి కంటతడిపెట్టారు. బాషా కుమారుడు గయాజుద్దీన్‌ను ఓదార్చారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, ‘‘బాషాతో నాది విడదీయలేని సంబంధం. నా కుటుంబసభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉంది.  పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన మృతి తీరని లోటు’’ అని అన్నారు. బాషా మృతిపట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, లోక్‌సత్తా అధినేత జేపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావంతో లాల్‌జాన్‌బాషాతో కలిసి పనిచేశానని, ఆయన తనకు మంచి మిత్రుడని మంత్రి జానారెడ్డి చెప్పారు. వామపక్ష శ్రేయోభిలాషిని కోల్పోయామని సీపీఐ నేత నారాయణ అన్నారు.
   సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సంతాపం తెలిపారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ ఒక సంయుక్త ప్రకటనలో సంతాపం తెలిపారు. బాషా మరణం వెనుకబడిన వర్గాలకు తీరని లోటని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి, పరిటాల సునీత, వేనేపల్లి చందర్‌రావు, టీఆర్‌ఎస్ నేత కె.కేశవరావు, మంత్రి అహ్మదుల్లా, అక్బరుద్దీన్ ఒవైసీ, దేవేందర్‌గౌడ్, పయ్యావుల కేశవ్, షబ్బీర్ అలీ, జైపాల్ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేత రెహమాన్, గద్దర్ తదితరులు బాషా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, సినీనటుడు బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
 విజయమ్మ దిగ్భ్రాంతి
 లాల్‌జాన్ బాషా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరాడంబరుడు, సౌమ్యుడైన బాషా హఠాన్మరణం తమ మనస్సును కలచి వేసిందని విజయమ్మ పేర్కొన్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో బాషా ప్రజలకు, మైనారిటీలకు అంకితభావంతో సేవలు అందించారని అన్నారు.
 
 అతివేగమే ప్రమాదానికి కారణం!
 బాషా ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదం సమయంలో గంటకు 120 నుంచి 150  కి.మీ. వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంత వేగంతో వాహనం ఢీకొనడంతో డివైడర్‌కు ఉన్న ఇనుప కంచెలోని ఒక రాడ్  బాషా కూర్చున్న ముందుసీటు వైపు దూసుకొచ్చి, ఆయన కుడికాలులో గుచ్చుకుంది. వాహనం పల్టీలు కొడుతున్న సమయంలో ముందు డోర్ ఊడిపోయింది. సీటుబెల్టు పెట్టుకోకపోవడంతో బాషా అందులోంచి ఎగిరి కిందపడిపోయారు. రాడ్ గుచ్చుకున్న కాలు అంతవరకు తెగి, వాహనంలోనే ఉండిపోయింది. అయితే.. హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందే త్వరగా వెళ్లాలని లాల్‌జాన్‌బాషా తనకు సూచించారని డ్రైవర్ ముజాఫర్ ఇక్బాల్ తెలిపారు. వర్షం కురుస్తుండడంతో రోడ్డంతా తడిసి ఉందని, కామినేని జంక్షన్ వద్దకు రాగానే వాహనం వేగాన్ని తగ్గించేందుకు బ్రేక్ వేశానని.. వెంటనే అదుపుతప్పి ఘోరం జరిగిపోయిందని చెప్పాడు.
 
 బాషా రాజకీయ ప్రస్థానం
 లాల్‌జాన్‌బాషా 1956లో గుంటూరులో జన్మించారు. ఆయనకు 1975లో వివాహమైంది. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం అంటే ఆయనకు బాగా ఇష్టం. అందుకే తరచూ తల్లి, ఆరుగురు తమ్ముళ్లు, నలుగురు సోదరీమణులతో గడుపుతుంటారు. ఇనుము వ్యాపారంలో స్థిరపడిన లాల్‌జాన్‌బాషా 1991లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగి.. ఆచార్య ఎన్‌జీ రంగాపై గెలుపొందారు. ఇక్కడ్నుంచి గెలుపొందిన మొట్టమొదటి టీడీపీ ఎంపీగా బాషాకు గుర్తింపు ఉంది. అయితే తదుపరి 1996, 1998లలో రాయపాటి సాంబశివరావుపై ఓటమి పాలయ్యారు. 1999లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి నేదురుమల్లి జనార్దనరెడ్డిపై పోటీపడ్డారు. కానీ విజయం సాధించలేకపోయారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement