Lal jan basha
-
అశ్రునయనాలతో లాల్‌జాన్‌కు తుదివీడ్కోలు
సాక్షి, గుంటూరు: నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా అంత్యక్రియలు శుక్రవారం గుంటూరులో జరిగాయి. బి.ఆర్.స్టేడియంలో ఉంచిన ఆయన భౌతికకాయానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పలువురు నేత లు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు రోడ్డు మార్గంలో గుంటూరు చేరుకున్నారు. స్థానిక ఆనందపేటలోని లాల్‌జాన్‌బాషా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్‌ను ఓదార్చారు. బాషా జనాజాను కొంతదూరం మోశారు. బాషా మృతదేహానికి మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నారాయణ, సుజనాచౌదరి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, నన్నపనేని రాజకుమారి, సలీం, లక్ష్మణరావు, టీడీపీ ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, నూర్‌బాషా సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చమన్, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. బాషా అంతిమ యాత్రలో పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. -
లాల్‌జాన్‌బాషాకు అశ్రునయనాలతో అంతిమయాత్ర
కొరిటెపాడు (గుంటూరు), న్యూస్‌లైన్: ఆప్యాయ పలకరింపు...ఆపదలో ఉన్నవారికి తనదైన శైలిలో సహకరించడం...ఎదుటివారి బాధలను చూస్తూ ఊరుకోలేని మనస్తత్వం కలిగిన ఓ నేస్తామా... మీరు మా వెంట లేకున్నా... మీ తలంపును మేమెప్పటికీ మరిచిపోలేమంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్‌జాన్‌బాషా అంతిమయాత్రలో అనేక మంది పాల్గొన్నారు. జోరువానలోనూ వివిధ జిల్లాల నుంచి ఆయనను కడచూపు చూసేందుకు వచ్చిన సందర్శకులతో బ్రహ్మనందరెడ్డి స్టేడియం కిక్కిరిసిపోయింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ ఎస్ఎం లాల్‌జాన్‌బాషా మృతిచెందిన విషయం విదితమే. లాల్‌జాన్‌బాషా భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రి 11.50 గంటలకు గుంటూరు తీసుకువచ్చారు. ఆనందపేటలోని స్వగృహంలో ఉంచిన ఆయన పార్ధివదేహాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజల సందర్శనార్ధం బ్రహానందరెడ్డి స్టేడియంకు తరలించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బంధువులు, శ్రేయోభిలాషులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, నగర ప్రజలు పెద్దసంఖ్యలో తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు స్టేడియానికి తరలివచ్చి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మధ్యాహ్నం 2.10 గంటలకు లాల్‌జాన్‌బాషా పార్ధివదేహాన్ని జిన్నాటవర్ సెంటర్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు జోరువానలో అధిక సంఖ్యలో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య లాల్‌జాన్‌బాషా అంతిమయాత్ర కొనసాగింది. పాతబస్టాండ్ సెంటర్, పాతగుంటూరు పోలీస్‌స్టేషన్, బ్రహ్మానందరెడ్డి స్టేడియం మీదుగా సంగడిగుంటలోని శ్మశానవాటిక వరకు కొనసాగింది. 3.30 గంటలకు శ్మశానవాటికలో ఖననం చేశారు. ప్రముఖుల నివాళి.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కె.నారాయణ, సుజనాచౌదరి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కోడెల శివప్రసాదరావు, కళా వెంకట్రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జెఆర్ పేష్పరాజ్, శనక్కాయల అరుణ, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నక్కా ఆనందబాబు, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, దేవినేని ఉమామహేశ్వరరావు, కందుల నారాయణరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గరికపాటి మోహనరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, సలీం, కేఎస్ లక్ష్మణరావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు చీరాల గోవర్ధనరెడ్డి, ముమ్మనేని వెంకటసుబ్బయ్య, దివి శివరాం, కాగిత వెంకట్రావు, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజామాస్టారు, కాట్రగడ్డ బాబు, చమన్, తీగల కృష్ణారెడ్డి, బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, జాగర్లమూడి శ్రీనివాసరావు, షేక్ మీరావలి, కె.వీరయ్య, అనగాని సత్యప్రసాద్, కాంగ్రెస్ నేతలు, మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, లింగంశెట్టి ఈశ్వరరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.రమాదేవి, ఎన్.భావన్నారాయణ తదితరులు పాల్గొని లాల్‌జాన్‌బాషా పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకుల నివాళి.. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ నేతలు జంగా కృష్ణమూర్తి, లేళ్ళ అప్పిరెడ్డి, నసీర్‌అహ్మద్, షేక్ షౌకత్, రాతంశెట్టి సీతారామాంజనేయులు, మందపాటి శేషగిరి రావులు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో లాల్‌జాన్‌బాషా పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. జనాజా మోసిన చంద్రబాబు లాల్‌జాన్‌బాషా అంతిమయాత్ర సందర్భంగా నిర్వహిం చిన జనాజాను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మోశారు. మొదటగా లాల్‌జాన్‌బాషా పార్ధివదేహాన్ని తన భుజానికెత్తుకున్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం నుంచి ప్రారంభమైన లాల్‌జాన్‌బాషా అంతిమయాత్రలో పాతగుంటూరు పోలీస్‌స్టేషన్ వరకు చంద్రబాబు పాల్గొని, అక్కడ నుంచి రోడ్డుమార్గాన గన్నవరం వెళ్లిపోయారు.లాల్‌జాన్‌బాషా పార్ధివదేహం ఉంచిన జనాజాను మోసేందుకు అనేకమంది ఆసక్తి కనబరిచారు. -
రోడ్డు ప్రమాదంలో లాల్‌జాన్‌బాషా దుర్మరణం ‘దేశం’ శ్రేణుల దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు/ కొరిటెపాడు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ఎస్ఎం లాల్‌జాన్‌బాషా అకాల మరణంతో ఆ పార్టీ జిల్లా శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మరణవార్త తెలుసుకున్న లాల్‌జాన్‌బాషా తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం జియావుద్దీన్ తీవ్ర షాక్‌కు లోనయ్యారు. హైదరాబాద్ నుంచి గుం టూరు బయల్దేరిన లాల్‌జాన్‌బాషా నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో గురువారం ఉద యం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారనే సమాచారం తెలుసుకున్న పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, బంధువులు గుంటూరు ఆనందపేటలో ఉన్న ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. బాషా కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢసానుభూతి తెలిపారు. 1956 లో జన్మించిన ఆయనకు 1975లో వివాహమైంది. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉమ్మడి కుటుంబాన్ని ఇష్టపడే ఆయన.. తల్లి, ఆరుగురు తమ్ముళ్లు, నలుగురు సోదరీమణులతో తరచూ గడుపుతుంటారు. ఐరన్ వ్యాపారంలో స్థిరపడిన లాల్‌జాన్‌బాషా 1991లో గుంటూరు పార్లమెంట్‌కు పోటీచేసి ఆచార్య ఎన్జీ రంగాపై గెలుపొందారు. ఇక్కడ్నుంచి గెలుపొందిన మొట్టమొదటి టీడీపీ ఎంపీగా లాల్‌జాన్‌బాషాకు గుర్తింపు ఉంది. ఆ తర్వాత 1996, 98లలో రాయపాటి సాంబశివరావుపై ఓటమిపాలయ్యారు. 1999లోనూ నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి నేదురుమల్లి జనార్దనరెడ్డిపై పోటీచేసి ఓటమిపాలుకాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను 2002లో రాజ్యసభకు పంపారు. 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. పార్టీ సంక్షోభసమయంలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉండి చంద్రబాబుకు ప్రధాన సలహాదారుగా పనిచేశారు. ఢిల్లీలో టీడీపీ అధికారప్రతినిధిగా కూడా ఆయన వ్యవహరించారు. ప్రస్తుతం ముంబైలో మర్కంటైల్ బ్యాంకు చైర్మన్‌గా లాల్‌జాన్‌బాషా కొనసాగుతున్నారు. నేతల పరామర్శలు..: లాల్‌జాన్‌బాషా కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని తెలిపిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, కొమ్మాలపాటి శ్రీధర్, మాజీమంత్రులు కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజామాస్టారు, వెన్నా సాంబశివారెడ్డి, ముమ్మనేని వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ మహ్మద్ జానీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు నసీర్‌అహ్మద్, చాంద్ బాషా తదితరులు ఉన్నారు. నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ఫోన్లో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలు నేడు.. : లాల్‌జాన్‌బాషా భౌతికకాయం గురువారం అర్ధరాత్రికి గుంటూరు చేరుకుంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజల సందర్శనార్థం స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఉంచనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు వస్తున్నట్లు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బాషా మృతి పార్టీకి తీరనిలోటు.. : లాల్‌జాన్‌బాషా మరణం పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం సంతాప సభ నిర్వహించారు. పుల్లారావు మాట్లాడుతూ క్రమశిక్షణ గల నాయకుడిని పార్టీ కోల్పోయిందని తెలిపారు. అన్ని పార్టీల నేతలతో ఆయన సఖ్యతగా మెలిగేవారని గుర్తుచేశారు. ఇటీవల పార్టీ ప్రకటించిన ముస్లిం మైనార్టీ డిక్లరేషన్‌ను రూపొందించడంలో లాలాజాన్బాషా కీలకపాత్ర పోషించారన్నారు. సంతాప సభలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. తొలుత లాల్‌జాన్‌బాషా చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు. -
టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా దుర్మరణం
సాక్షి, నార్కట్‌పల్లి/నల్లగొండ/హైదరాబాద్: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా (57) గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అత్యంత వేగంగా వెళ్తూ అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాషా గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరారు. 8.30 గంటల సమయంలో ఆయన వాహనం నార్కట్‌పల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. మూడు పల్టీలు కొట్టి, అవతలివైపు పడింది. ఈ ప్రమాదంలో బాషా అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ ముజాఫర్ ఇక్బాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడం వల్లే బాషా మృతి చెందారని పోస్టుమార్టం నిర్వహించిన నల్లగొండ ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాషా భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నం.12 మిథిలానగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. సాయంత్రం గంటసేపు బాషా భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి, అనంతరం ఆయన స్వస్థలం గుంటూరుకు తీసుకెళ్లారు. శుక్రవారం అంత్యక్రియలకు చంద్రబాబు, పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు హాజరవుతారు. బాషా దుర్మరణం గురించి తెలిసిన వెంటనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బయల్దేరి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అక్కడ బాషా మృతదేహాన్ని చూసి కంటతడిపెట్టారు. బాషా కుమారుడు గయాజుద్దీన్‌ను ఓదార్చారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, ‘‘బాషాతో నాది విడదీయలేని సంబంధం. నా కుటుంబసభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉంది. పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన మృతి తీరని లోటు’’ అని అన్నారు. బాషా మృతిపట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, లోక్‌సత్తా అధినేత జేపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావంతో లాల్జాన్బాషాతో కలిసి పనిచేశానని, ఆయన తనకు మంచి మిత్రుడని మంత్రి జానారెడ్డి చెప్పారు. వామపక్ష శ్రేయోభిలాషిని కోల్పోయామని సీపీఐ నేత నారాయణ అన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సంతాపం తెలిపారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ ఒక సంయుక్త ప్రకటనలో సంతాపం తెలిపారు. బాషా మరణం వెనుకబడిన వర్గాలకు తీరని లోటని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి, పరిటాల సునీత, వేనేపల్లి చందర్రావు, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, మంత్రి అహ్మదుల్లా, అక్బరుద్దీన్ ఒవైసీ, దేవేందర్‌గౌడ్, పయ్యావుల కేశవ్, షబ్బీర్ అలీ, జైపాల్ యాదవ్, వైఎస్సార్సీపీ నేత రెహమాన్, గద్దర్ తదితరులు బాషా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, సినీనటుడు బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయమ్మ దిగ్భ్రాంతి లాల్‌జాన్ బాషా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరాడంబరుడు, సౌమ్యుడైన బాషా హఠాన్మరణం తమ మనస్సును కలచి వేసిందని విజయమ్మ పేర్కొన్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో బాషా ప్రజలకు, మైనారిటీలకు అంకితభావంతో సేవలు అందించారని అన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం! బాషా ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదం సమయంలో గంటకు 120 నుంచి 150 కి.మీ. వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంత వేగంతో వాహనం ఢీకొనడంతో డివైడర్‌కు ఉన్న ఇనుప కంచెలోని ఒక రాడ్ బాషా కూర్చున్న ముందుసీటు వైపు దూసుకొచ్చి, ఆయన కుడికాలులో గుచ్చుకుంది. వాహనం పల్టీలు కొడుతున్న సమయంలో ముందు డోర్ ఊడిపోయింది. సీటుబెల్టు పెట్టుకోకపోవడంతో బాషా అందులోంచి ఎగిరి కిందపడిపోయారు. రాడ్ గుచ్చుకున్న కాలు అంతవరకు తెగి, వాహనంలోనే ఉండిపోయింది. అయితే.. హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందే త్వరగా వెళ్లాలని లాల్‌జాన్‌బాషా తనకు సూచించారని డ్రైవర్ ముజాఫర్ ఇక్బాల్ తెలిపారు. వర్షం కురుస్తుండడంతో రోడ్డంతా తడిసి ఉందని, కామినేని జంక్షన్ వద్దకు రాగానే వాహనం వేగాన్ని తగ్గించేందుకు బ్రేక్ వేశానని.. వెంటనే అదుపుతప్పి ఘోరం జరిగిపోయిందని చెప్పాడు. బాషా రాజకీయ ప్రస్థానం లాల్‌జాన్‌బాషా 1956లో గుంటూరులో జన్మించారు. ఆయనకు 1975లో వివాహమైంది. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం అంటే ఆయనకు బాగా ఇష్టం. అందుకే తరచూ తల్లి, ఆరుగురు తమ్ముళ్లు, నలుగురు సోదరీమణులతో గడుపుతుంటారు. ఇనుము వ్యాపారంలో స్థిరపడిన లాల్‌జాన్‌బాషా 1991లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగి.. ఆచార్య ఎన్జీ రంగాపై గెలుపొందారు. ఇక్కడ్నుంచి గెలుపొందిన మొట్టమొదటి టీడీపీ ఎంపీగా బాషాకు గుర్తింపు ఉంది. అయితే తదుపరి 1996, 1998లలో రాయపాటి సాంబశివరావుపై ఓటమి పాలయ్యారు. 1999లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి నేదురుమల్లి జనార్దనరెడ్డిపై పోటీపడ్డారు. కానీ విజయం సాధించలేకపోయారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. -
ఎవరిదీ... పాపం
సాక్షిప్రతినిధి, నల్లగొండజిల్లా అంతా స్వాతంత్య్రవేడుకల్లో మునిగి ఉంది... ఎవరిహడావిడిలో వారున్నారు. ఇంతలోనే ఓ వార్త జిల్లాలో దావానంలావ్యాపించింది. సమాచారం తెలుసుకుని టీడీపీ నాయకులంతా నార్కట్‌పల్లికి పరుగులు దీశారు... ఈ లోగాటీవీల్లో స్క్రోలింగులు ప్రత్యక్షమయ్యాయి.. గుంటూరు జిల్లాకుచెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీఎంపీ లాల్‌జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారన్నదేఆ వార్త. నార్కట్‌పల్లిలో జాతీయజెండా ఆవిష్కరణ వేడుకల్లో ఉన్నటీడీపీ జిల్లా నాయకుడు రేగట్టే మల్లికార్జున్‌రెడ్డికి రోడ్డు ప్రమాదం సమాచారం అందగానే, ఆయన హైదరాబాద్ ట్రస్ట్ భవన్‌కు సమాచారంఅందించారు. ‘‘ఫేక్ కాల్’ అంటూకార్యాలయ సిబ్బంది కొట్టి పారేశారు. కొద్దిసేపటికే మళ్లీ చంద్రబాబునాయుడు రేగట్టెను వాకబుచేశారు. అప్పటికే నార్కట్‌పల్లి కామినేని జంక్షన్ వద్దకు చేరుకున్నరేగట్టె.. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది లాల్‌జాన్ బాషానేననిధృవీకరించుకుని హైదరాబాద్‌కు తెలియజేశారు. ఈలోగా నల్లగొండ నుంచీటీడీపీ నాయకులు నార్కట్‌పల్లికి చేరుకుని లాల్‌జాన్ బాషా మృతదేహాన్ని అంబులెన్సులోజిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. జోరున కురుస్తున్న వానలో.. అమితమైన వేగంతో హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళుతున్న ఆ ఇన్నోవా వాహనం డివైడర్‌ను ఢీకొని మూడు పల్టీలు కొట్టడం చూసిన..దగ్గరలోనే ఆస్పత్రి వద్ద టీ తాగుతున్న స్థానికులు ఉరుకుల పరుగుల మీద ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే స్థానిక మీడియా,పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం నుంచి బయట పడిన డ్రైవర్ ముజఫర్ చనిపోయింది టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా అంటేముందు ఎవరూ నమ్మలేదు. చివరకు లాల్‌జాన్‌బాషా విజిటింగ్ పోలీసులకు ఇవ్వడంతో కొంతనమ్మకం కుదిరినా, మృత దేహం బొక్కబోర్లాఉండడం, స్థానికంగా గుర్తుపట్టే వారులేకపోవడంతో పోలీసులు ఓ నిర్ణయానికి రావడానికివెనకా ముందాడారు. ఈలోగా అక్కడి చేరుకున్న టీడీపీ నాయకుడు రేగట్టె మల్లికార్జున్రెడ్డిపోలీసుల సమక్షంలో మృతదేహాన్ని వెల్లకిలాతిప్పి ప్రమాదంలో చనిపోయింది లాల్‌జాన్‌బాషా అని గుర్తించారు. నిత్యం ప్రమాదాలతోవందలాది ప్రాణాలను బలిగోరిన జాతీయరహదారిపై ప్రయాణం ఇప్పటికీ నరకానికిదారే అన్న అభిప్రాయాన్ని గురువారం నాటిప్రమాదం చెప్పకనే చెప్పింది. నాలుగు లేన్లరహదారిగా మార్చినా అధికారుల తప్పిదాలు,సాంకేతిక లోపాలు, అయిన వారికోసం రోడ్డుఅలైన్మెంటును ఇష్టం వచ్చినట్లు మార్చిన కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేసిన రోడ్డు నిర్మాణ సంస్థజీఎంఆర్ నిర్లక్ష్యానికి కామినేని జంక్షన్లోఇలాంటి ప్రమాదాలు ఇప్పటికే పదులసంఖ్యలో జరిగాయి. అందుబాటులోకి వచ్చినఎక్స్ప్రెస్ హైవేపై వాయువేగంతో దూసుకువెళుతున్న వాహనాల్లో ప్రయాణం గాలిలోదీపంలా మారుతున్నాయి. హైదరాబాద్ నుంచిబయలు దేరే సమయంలోనే కొంత వేగంగావెళ్లాలని లాల్‌జాన్ బాషా చెప్పారని డ్రైవర్ముజఫర్ చెబుతున్నాడు. అయినా, జోరుగాకురుస్తున్న వానలో, కనీసం జాగ్రత్తలు పాటించకుండా అపరిమిత వేగంతో వాహనం నడిపినడ్రైవర్ తన యజమాని దుర్మరణానికి ప్రత్యక్షంగా కారణమయ్యాడ న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ సీనియర్ నేత దుర్మరణం వార్తతెలుసుకుని వివిధ పార్టీలకు చెందిన నాయకులు జిల్లా ఆస్పత్రికి చేరుకోవడంతో మార్చురీవద్ద ఆవరణ కిక్కిరిసి పోయింది. రాష్ట్ర టీడీపీనేతలు జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబునాయుడు హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. లాల్‌జాన్‌బాషా మతదేహాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికితరలించేలా కుటుంబ సభ్యులను ఒప్పించారు.మొత్తంగా గురువారం నాటి రోడ్డు ప్రమాదంజాతీయ రహదారిపై వాయువేగంతో దూసుకుపోయే వాహన చోదకులకు ఓ హెచ్చిరకలాంటిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. -
లాల్‌జాన్ బాషా మృతి పట్ల విజయమ్మ దిగ్బ్రాంతి
తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా ఆకస్మిక మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిరాడంబరుడు, సౌమ్యుడైన లాల్‌జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో మరణించడం తన మనసుసు కలిచివేసిందని తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి ఆయన అంకితభావంతో విశేషమైన కృషి చేశారని చెప్పారు. పార్లమెంట్లో ఇరుసభలకు ఎన్నికై పలు ప్రజా సమస్యలపై స్పందించి ప్రజాహిత రాజకీయాల్లో కొనసాగారని విజయమ్మ వివరించారు. లాల్‌జాన్ బాషా కుటుంబసభ్యలకు వైఎస్ విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తు లాల్‌జాన్ బాషా ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రి వద్ద డివైడర్‌ను డీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బాషా అక్కడికక్కడే మృతి చెందారు.