లాల్‌జాన్‌బాషాకు అశ్రునయనాలతో అంతిమయాత్ర
Published Sat, Aug 17 2013 3:02 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
కొరిటెపాడు (గుంటూరు), న్యూస్‌లైన్: ఆప్యాయ పలకరింపు...ఆపదలో ఉన్నవారికి తనదైన శైలిలో సహకరించడం...ఎదుటివారి బాధలను చూస్తూ ఊరుకోలేని మనస్తత్వం కలిగిన ఓ నేస్తామా... మీరు మా వెంట లేకున్నా... మీ తలంపును మేమెప్పటికీ మరిచిపోలేమంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్‌జాన్‌బాషా అంతిమయాత్రలో అనేక మంది పాల్గొన్నారు. జోరువానలోనూ వివిధ జిల్లాల నుంచి ఆయనను కడచూపు చూసేందుకు వచ్చిన సందర్శకులతో బ్రహ్మనందరెడ్డి స్టేడియం కిక్కిరిసిపోయింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ ఎస్‌ఎం లాల్‌జాన్‌బాషా మృతిచెందిన విషయం విదితమే. లాల్‌జాన్‌బాషా భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రి 11.50 గంటలకు గుంటూరు తీసుకువచ్చారు. ఆనందపేటలోని స్వగృహంలో ఉంచిన ఆయన పార్ధివదేహాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజల సందర్శనార్ధం బ్రహానందరెడ్డి స్టేడియంకు తరలించారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బంధువులు, శ్రేయోభిలాషులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, నగర ప్రజలు పెద్దసంఖ్యలో తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు స్టేడియానికి తరలివచ్చి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మధ్యాహ్నం 2.10 గంటలకు లాల్‌జాన్‌బాషా పార్ధివదేహాన్ని జిన్నాటవర్ సెంటర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు జోరువానలో అధిక సంఖ్యలో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య లాల్‌జాన్‌బాషా అంతిమయాత్ర కొనసాగింది. పాతబస్టాండ్ సెంటర్, పాతగుంటూరు పోలీస్‌స్టేషన్, బ్రహ్మానందరెడ్డి స్టేడియం మీదుగా సంగడిగుంటలోని శ్మశానవాటిక వరకు కొనసాగింది. 3.30 గంటలకు శ్మశానవాటికలో ఖననం చేశారు.
ప్రముఖుల నివాళి..
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కె.నారాయణ, సుజనాచౌదరి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కోడెల శివప్రసాదరావు, కళా వెంకట్రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జెఆర్ పేష్పరాజ్, శనక్కాయల అరుణ, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నక్కా ఆనందబాబు, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, దేవినేని ఉమామహేశ్వరరావు, కందుల నారాయణరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గరికపాటి మోహనరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, సలీం, కేఎస్ లక్ష్మణరావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు చీరాల గోవర్ధనరెడ్డి, ముమ్మనేని వెంకటసుబ్బయ్య, దివి శివరాం, కాగిత వెంకట్రావు, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజామాస్టారు, కాట్రగడ్డ బాబు, చమన్, తీగల కృష్ణారెడ్డి, బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, జాగర్లమూడి శ్రీనివాసరావు, షేక్ మీరావలి, కె.వీరయ్య, అనగాని సత్యప్రసాద్, కాంగ్రెస్ నేతలు, మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, లింగంశెట్టి ఈశ్వరరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.రమాదేవి, ఎన్.భావన్నారాయణ తదితరులు పాల్గొని లాల్‌జాన్‌బాషా పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైఎస్సార్ సీపీ నాయకుల నివాళి..
వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ నేతలు జంగా కృష్ణమూర్తి, లేళ్ళ అప్పిరెడ్డి, నసీర్‌అహ్మద్, షేక్ షౌకత్, రాతంశెట్టి సీతారామాంజనేయులు, మందపాటి శేషగిరి రావులు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో లాల్‌జాన్‌బాషా పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు.
జనాజా మోసిన చంద్రబాబు
లాల్‌జాన్‌బాషా అంతిమయాత్ర సందర్భంగా నిర్వహిం చిన జనాజాను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మోశారు. మొదటగా లాల్‌జాన్‌బాషా పార్ధివదేహాన్ని తన భుజానికెత్తుకున్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం నుంచి ప్రారంభమైన లాల్‌జాన్‌బాషా అంతిమయాత్రలో పాతగుంటూరు పోలీస్‌స్టేషన్ వరకు చంద్రబాబు పాల్గొని, అక్కడ నుంచి రోడ్డుమార్గాన గన్నవరం వెళ్లిపోయారు.లాల్‌జాన్‌బాషా పార్ధివదేహం ఉంచిన జనాజాను మోసేందుకు అనేకమంది ఆసక్తి కనబరిచారు.
Advertisement
Advertisement