
అశ్రునయనాలతో లాల్‌జాన్‌కు తుదివీడ్కోలు
సాక్షి, గుంటూరు: నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా అంత్యక్రియలు శుక్రవారం గుంటూరులో జరిగాయి. బి.ఆర్.స్టేడియంలో ఉంచిన ఆయన భౌతికకాయానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పలువురు నేత లు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు రోడ్డు మార్గంలో గుంటూరు చేరుకున్నారు. స్థానిక ఆనందపేటలోని లాల్‌జాన్‌బాషా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్‌ను ఓదార్చారు. బాషా జనాజాను కొంతదూరం మోశారు.
బాషా మృతదేహానికి మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నారాయణ, సుజనాచౌదరి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, నన్నపనేని రాజకుమారి, సలీం, లక్ష్మణరావు, టీడీపీ ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, నూర్‌బాషా సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చమన్, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. బాషా అంతిమ యాత్రలో పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.