నాన్నా.. వెళ్లిపోయావా..!
ముషీరాబాద్: ముక్కు పచ్చరాలని ఇద్దరు చిన్నారులను వదిలి తండ్రి కూడా వెళ్లిపోవడంతో వారు అనాథలుగా మిగిలారు. వివరాల్లోకి వెళితే..2015 సెప్టెంబర్ 7న లక్ష్మి అనే మహిళ, రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితమైన భర్త వినోద్ కళ్లెదుటే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో వారి ఇద్దరు పిల్లలు సుశీల్ సూర్య (11), నికిత (9)ల పరిస్థితిపై ‘రెక్కలు తెగిన ఈ పక్షులకు దిక్కెవరు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి దేశవిదేశాల నుంచి విశేష స్పందన లభించింది. ‘సాక్షి’ ప్రతినిధులే బ్యాంకులో తెరిచిన ఖాతాలోకి దాదాపు రూ. 6.5 లక్షలు విరాళంగా అందాయి. దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ. 10 లక్షలు వారి ఖాతాలో జమచేశారు.
చిన్నారులను దత్తత తీసుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఇదిలా ఉండగా బోడుప్పల్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వినోద్ 20 రోజులుగా ఆరోగ్యపరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. అంబర్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం చీకటి మామిడిలోని వేద పాఠశాలలో చదువుతున్న సుశీల్ సూర్య, ఉప్పల్‌లో అమ్మ ఒడి ఆశ్రమంలో ఉంటున్న నికితలు అంత్యక్రియలకు హాజరై కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారుల భవిత ప్రశ్నార్థకంగా మారింది.